కర్ణాటకలో జంగిల్ మెన్.. పదేళ్లుగా ఆకులే అతడి ఆహారం

Telugu BOX Office

మీరు అడవి దొంగ సినిమా చూశారు. అందులో చిన్నతనంలో తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన హీరో అడవిలో క్రూర మృగాల మధ్యే పెరుగుతాడు. చెట్లు, పుట్టలే తన ఇళ్లుగా భావించి అక్కడ దొరికే దుంపలు, మొక్కలనే ఆహారంగా తీసుకుంటాడు. అలాంటి ఘటనే కర్ణాటకలో వెలుగుచూసింది. ఆధునిక యుగంలోనూ ఆది మానవుడి తరహాలో జీవిస్తున్నాడో యువకుడు. పదేళ్లుగా ఒంటరిగా అడవిలోనే ఉంటూ కేవలం పచ్చి ఆకులే తింటున్నాడు. కర్ణాటకలోని బెళగావి జిల్లా సవదత్తి తాలూకా ఉగరగోళ గ్రామానికి చెందిన మహబూబీ, మాలిక్‌ దంపతుల కుమారుడు 34 ఏళ్ల బుడాన్‌ మాలిక్‌ హొసమణి చదువుపై ఆసక్తి లేకపోవడంతో చిన్నప్పుడు బడికి వెళ్లలేదు. ఊళ్లో ఖాళీగా, ఒంటరిగా తిరిగేవాడు. కొన్నాళ్లకు ఒంటరితనమే ఆయనకు స్నేహితుడిగా మారింది. ఫోన్‌లో గరుడ పురాణం, శివ పురాణం ఆలకిస్తూ ఒంటబట్టించుకున్నాడు. యోగాసనాలు నేర్చుకున్నాడు.

తన 24వ ఏట సొంతూరు విడిచి 100 కిలోమీటర్ల దూరంలోని దమ్మూర్‌ పట్టణ శివార్లలో ఎల్లమ్మదేవి కొలువై ఉన్న హెగ్గోళ సిద్దనకొళ్ల కొండపైకి చేరుకున్నాడు. అక్కడే చిన్న పాక వేసుకొని జీవించడం మొదలుపెట్టాడు. కొండపై ఉన్న చెట్లు, వివిధ రకాల మొక్కల ఆకులను కోతులు తినడాన్ని చూసి తానూ అలాగే అలవాటు చేసుకున్నాడు. తెల్లవారుజామున 3 గంటలకు నిద్ర లేవడంతో అతడి రోజు ప్రారంభమవుతుంది. లేచింది మొదలు అడవిలోని కొండలు, చెట్లు ఎక్కుతూ ఆకులు తిని, అక్కడి నదుల్లో ప్రవహించే నీటిని తాగుతూ జీవిస్తున్నాడు. రోజుకు కనీసం రెండుసార్లు తప్పకుండా యోగా, వ్యాయామం చేస్తాడు. ఇప్పటివరకు దాదాపు 80కి పైగా రకాల ఆకులను తిన్న బుడాన్‌.. ఈ పదేళ్లలో ఏ రకమైన అనారోగ్యానికి గురి కాలేదు. బరువు 60 కిలోలకు తగ్గకుండా, పెరగకుండా చూసుకుంటున్న అతని ఎత్తు 5.9 అడుగులు. దుస్తులు, ఇతర వస్తువుల కోసం డబ్బు అవసరమైనప్పుడు మాత్రం సమీప గ్రామంలోకి వెళ్లి అన్ని రకాల పనులు చేస్తుంటాడు. అతడిని పరీక్షించిన వైద్యులు కూడా ఆరోగ్యంగా ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల వాళ్లు అతడిని చూసేందుకు అక్కడికి తరలివస్తున్నారు.

Share This Article
Leave a Comment