ఇళ్లకు తలుపులే లేని గ్రామం.. ఒక్క దొంగతనం కూడా జరగలేదట

Telugu BOX Office

సాధారణంగా మనం ఇల్లు వదిలి బయటకు వెళ్లాలనుకుంటే తలుపులు, తాళాలు సరిగ్గా వేశామా లేదా అని ఒకటికి రెండుసార్లు చూసుకుంటాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే గ్రామంలో ఇళ్లకు తాళాలే కాదు అసలు తలుపులు కూడా ఉండవు. తాళం వేసిన ఇళ్లనే పట్టపగలు దోచేస్తున్న ఈ రోజుల్లో ఇంటికి తలుపులు లేని ఊరు ఒకటుందంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. కానీ అలాంటి గ్రామాన్ని చూడాలంటే మనం ఒడిశాకి వెళ్లాలి. కేంద్రపాడా జిల్లా సియాలియా గ్రామంలో ఇళ్లకు అసలు తలుపులే ఉండవు. ‘డోర్‌లెస్‌ విలేజ్‌’గా పేరొందిన ఈ గ్రామంలోని ఇళ్లలో లోపల గదులకూ తలుపుల్లేకుండా కేవలం చెక్కలు లేదా తెరలను అడ్డుపెట్టుకుంటారు. ఆ ఊర్లో ఎలాంటి చెడు సంఘటనలు జరగకుండా గ్రామదేవత ఖరాఖైదేవీ తమను రక్షిస్తుందని గ్రామస్థుల విశ్వాసం. ఊరికి ఉత్తరాన ఈ ఆలయం ఉంది. అమ్మవారి గర్భగుడికీ పైకప్పు ఉండదు. వంద ఇళ్లున్న ఈ గ్రామంలో తలుపులు లేకపోయినా ఇప్పటిదాకా ఒక్క దొంగతనం కూడా జరగకపోవడం విశేషం. ఈ గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపినట్లు జిల్లా టూరిజం అధికారి త్రిభుబన్‌ జైసింగ్‌ తెలిపారు. తమ రికార్డుల ప్రకారం సియాలియాలో ఎటువంటి నేరాలు నమోదు కాలేదని స్థానిక పోలీస్‌ అధికారి సంజయ్‌ మాలిక్‌ చెప్పారు. ప్రస్తుత కాలంలో ఇలాంటి ఊరు ఒకటి ఉందంటే నమ్మశక్యంగా లేదు కదూ.

Share This Article
Leave a Comment