H-1B Visa ఏడాదికి లక్ష డాలర్లు కట్టాల్సిందే.. ఎంత పనిచేశావ్ ట్రంప్ మావా

Telugu BOX Office

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నాటి నుంచి భారత్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే భారీ పన్నులతో భారత ఎగుమతులను దెబ్బకొట్టిన ట్రంప్ తాజాగా అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయులకు గట్టి షాకిచ్చారు. హెచ్1బీ వీసా దరఖాస్తు రుసుమును ఊహించనంతగా పెంచేశారు. హెచ్1బీ వీసా వార్షిక రుసుమును లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై శుక్రవారం సంతకం చేశారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం భారత్, చైనాలపై తీవ్ర ప్రభావం చూపనుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఉత్తర్వు ప్రకారం ఇకపై అమెరికా వేదికగా పని చేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవాలంటే ఇకపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాలి. అమెరికాలో హెచ్1బీ వీసాపై పని చేస్తున్న విదేశీ ఉద్యోగుల్లో దాదాపు 71 శాతం మంది భారతీయులే ఉంటారు. చైనీయులు 11.7 శాతం మంది ఉంటారు.

అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను నియమించుకునే వీలు కల్పిస్తూ 1990లో హెచ్‌1బీ వీసాను తీసుకొచ్చారు. ఈ వీసాను ఉపయోగించుకుని ఎంతో మంది విదేశీ నిపుణులు అమెరికాలోకి ప్రవేశించారు.  హెచ్1బీ వీసాదారులకు లాటరీ విధానం ఉంది. ఈ వీసా కోసం అప్లై చేసేందుకు ముందుగా సాధారణ ఛార్జీలు చెల్లించాలి. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. ఏడాదికి 85 వేల వీసాలను అమెరికా లాటరీ విధానం ద్వారా జారీ చేస్తుంది. సాధారణంగా కంపెనీలే ఉద్యోగుల హెచ్‌1బీ వీసా ఛార్జీలను చెల్లిస్తుంటాయి. అయితే ప్రస్తుతం ఆ ఫీజును భారీగా పెంచేయడంతో కంపెనీలు పెను భారాన్ని ఎదుర్కోక తప్పదు. ప్రతి హెచ్‌-1బీ వీసాపై ఏటా లక్ష డాలర్లు రుసుం విధించినట్లు యూఎస్‌ కామర్స్‌ సెక్రటరీ హోవార్డ్‌ లుట్నిక్‌ ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు వివరించినట్లు తెలిపారు.  అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులే తమ దేశానికి రావాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. దేశ భద్రతను దృష్టిలోపెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ చర్యను టెక్ పరిశ్రమ వ్యతిరేకించబోదని చెప్పారు.

Share This Article
Leave a Comment