యూకే వలస విధానంలో భారీ మార్పులు – శాశ్వత నివాసానికి గడువు రెట్టింపు

Telugu BOX Office

యునైటెడ్ కింగ్‌డమ్‌ ప్రభుత్వం తమ వలస విధానంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. భారత్‌ సహా అనేక దేశాల నుంచి బ్రిటన్‌కు వెళ్లి పనిచేస్తున్న వలసదారులపై నేరుగా ప్రభావం చూపే కీలక ప్రతిపాదనలను యూకే హోం సెక్రటరీ షబానా మహమూద్ గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ముఖ్యంగా శాశ్వత నివాస అనుమతి (ILR – Indefinite Leave to Remain) పొందేందుకు అవసరమైన గడువును రెట్టింపు చేయడం ఈ ప్రతిపాదనల్లో ప్రధాన అంశం.

ఇప్పటివరకు అమల్లో ఉన్న ఐదేళ్ల ఆటోమేటిక్ విధానాన్ని పదేళ్లకు పెంచుతున్నట్లు ఆమె ధృవీకరించారు. ఇది “ఎర్న్‌డ్ సెటిల్‌మెంట్ మోడల్”లో భాగంగా తీసుకొస్తున్న సంస్కరణలలో అత్యంత కీలక మార్పుగా చెప్పవచ్చు. ఇప్పటి వరకు యూకేలో ఐదేళ్లు చట్టబద్ధంగా పనిచేసిన వారు ILR కోసం దరఖాస్తు చేసుకునే అర్హత పొందేవారు. అయితే కొత్త నిబంధనల ప్రకారం ఈ అవకాశం ఇక పదేళ్ల తర్వాత మాత్రమే లభిస్తుంది.

తక్కువ వేతన ఉద్యోగులకు కఠిన నిబంధనలు

కొత్త ప్రతిపాదనలలో భాగంగా తక్కువ వేతనం పొందే ఉద్యోగుల కోసం గడువును మరింత పెంచారు.ఈ వర్గానికి చెందినవారు ఏకంగా 15 సంవత్సరాలు నిరీక్షించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్న వలసదారులయితే మరింత కఠినతరం చేశారు. ఈ వర్గానికి షబానా మహమూద్ ప్రకారం 20 ఏళ్ల నిరీక్షణ తప్పదు.

కీలక రంగాలకు మినహాయింపు

అయితే అన్ని వలసదారులపైనా సమాన నియమాలు అమలు చేయడం లేదు. నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS), హెల్త్‌కేర్, కీలక సాంకేతిక రంగాలలో పనిచేస్తున్న నిపుణులు, అధిక సంపాదన కలిగిన వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులపై మాత్రం ఈ నియమాలు వర్తించవు. వీరికి ఐదు సంవత్సరాల్లోనే లేదా అంతకంటే తక్కువ సమయంలో ILR దరఖాస్తు చేసుకునే అవకాశం ఇంతకుముందులానే కొనసాగుతుంది.

2021 నుంచి వచ్చిన 20 లక్షల మందికి ప్రభావం

2021 నుంచి ఇప్పటివరకు దాదాపు 20 లక్షల మంది యూకేలోకి వలస వచ్చారని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి నియమాల ప్రకారం వీళ్లంతా 2026 నుంచి 2030 మధ్య ఐఎల్‌ఆర్‌కు అర్హులు అవుతారు. అయితే ఆ టైమ్‌లైన్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ కొత్త సంస్కరణలను ప్రవేశపెడుతోంది. వలస సంఖ్య పెరగడం, సామాజిక సేవలు మరియు ప్రభుత్వ వనరులపై ఒత్తిడి పెరగడం నేపథ్యంలో ఈ మార్పులు అవసరమని యూకే ప్రభుత్వం భావిస్తోంది.

అదనపు కఠిన నిబంధనలు కూడా

ILR కోసం అర్హత పొందాలంటే కేవలం కాల పరిమితి నెరవేర్చడం సరిపోదు. కొత్త మోడల్‌లో వలసదారులు మరిన్ని ప్రమాణాలను కూడా పూర్తిచేయాలి:

  • క్రిమినల్ రికార్డు ఉండకూడదు

  • ఇంగ్లీష్ భాషలో ఉన్నత ప్రమాణాలతో మాట్లాడగలగాలి

  • సమాజంలో స్వచ్ఛంద సేవ చేయడం తప్పనిసరి

  • ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలి

ఈ అన్ని నియమాలను సక్రమంగా అమలు చేస్తేనే వలసదారులు ఇకపై ILR పొందగలరు.

యూకేలో పని చేస్తున్న భారతీయుల సంఖ్య గణనీయంగా ఉన్న నేపథ్యంలో ఈ మార్పులు ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది. నూతన వలస విధానంపై బ్రిటన్‌లో పనిచేస్తున్న నిపుణులు, వలస సంఘాలు ఇప్పటికే చర్చలు ప్రారంభించాయి. ప్రభుత్వం తీసుకొచ్చే ఈ సంస్కరణలు రాబోయే నెలల్లో మరింత వివరణాత్మకంగా అమలు రూపంలోకి రానున్నాయి.

Share This Article
Leave a Comment