మన దేశంలో ఏ ఊరికి వెళ్లినా శాకాహారులు, మాంసాహారులు రెండు వర్గాలవారు కనిపించడం సాధారణమే. కానీ మాంసాహారం పూర్తిగా నిషేధించి, ఊరు మొత్తం శాకాహారులుగా మాత్రమే ఉన్న గ్రామం ఉందనగానే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అది ఒక కుటుంబం కాదు, ఒక వర్గం కాదు… ఊరు మొత్తం. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇలాంటి గ్రామాలు ఒక్కటి కాదు… భారతదేశంలో రెండున్నాయి. ఒకటి బీహార్‌లో, మరొకటి మహారాష్ట్రలో.

బీహార్ రాష్ట్రంలోని గయ జిల్లాలో ‘బిహియా’ అనే చిన్న గ్రామం ఉంది. మూడు శతాబ్దాలుగా ఈ గ్రామం శాకాహారం పాటించే సంప్రదాయాన్ని కట్టుదిట్టంగా కొనసాగిస్తోంది. 400 కుటుంబాలు కలిగిన ఈ గ్రామంలో గత 300 ఏళ్లుగా ఎవరూ మాంసాహారం తినలేదు. ఇక్కడి ప్రజల నమ్మకం ప్రకారం గ్రామ దేవతగా పూజించే బ్రహ్మ బాబా ఆగ్రహానికి గురికాకుండా ఉండాలంటే, జీవితాంతం శాకాహార జీవన విధానమే కొనసాగాలని చెబుతారు. ఈ ఆచారంలో చిన్నా పెద్దా తేడా లేదు. పరాయి ఊరునుంచి పెళ్లి చేసుకుని వచ్చే వారు కూడా అప్పుడే ఈ నియమాలను అంగీకరించాలి. ఇక్కడ మద్యపానం పూర్తిగా నిషేధం. అంతే కాదు, ఉల్లి, వెల్లుల్లి కూడా ఆహారంలో వాడరు. అంటే ఇది కేవలం ఆహార అలవాటు కాదు — సమాజం మొత్తం పాటించే ఆధ్యాత్మిక జీవన పద్దతి.
ఇదే విధంగా మరొక పూర్తి శాకాహార గ్రామం మహారాష్ట్ర రాష్ట్రంలోని సాంగ్లీ జిల్లా రేనవి గ్రామం. ఖానాపూర్ తాలూకాలో ఉన్న ఈ గ్రామం కూడా శాకాహార ఆచారానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇక్కడి ప్రజలు తరతరాలుగా మాంసాహారాన్ని పూర్తిగా దూరంగా పెట్టారు. కారణం… గ్రామంలో ఉన్న పవిత్రమైన రేవణసిద్ధ మహారాజ్ దేవాలయం. నవనాథుల్లో ఏకనాథుడు స్వయంగా ఇక్కడ వెలిసినట్లు నమ్మకం. అందువల్ల గ్రామ ప్రజలు శాకాహారాన్ని భక్తి రూపంగా స్వీకరించారు.
ఇక్కడ ఒక ప్రత్యేకమైన నిబంధన ఉంది — ఇక్కడి అమ్మాయితో లేదా అబ్బాయితో పెళ్లి చేసుకోవాలంటే, ముందే శాఖాహార జీవన విధానాన్ని అంగీకరించాలి. పెళ్లయ్యాక కాదు పెళ్లికి ముందే ఆ ప్రమాణం చేయాలి. ఆ నియమాన్ని అంగీకరించకపోతే వివాహమే జరగదు. ఈ గ్రామంలో 3,000 మందికి పైగా జనాభా ఉన్నా, అందరూ ఒకే ఆచారాన్ని పాటించడం విశేషం. హిందువులు, ముస్లింలు, వివిధ కులాల వారు కలిసి నివసిస్తున్నా — ఆహార నియమనంలో మాత్రం అందరికి ఒకే నిబంధన. సంవత్సరంలో మహాశివరాత్రి నుంచి ప్రారంభమయ్యే రేవణసిద్ధ యాత్ర దక్షిణ మహారాష్ట్రలో ప్రసిద్ధి చెందిన పవిత్ర యాత్రలలో ఒకటి. కాలం మారినా, ఆచారాలు మారినా, ఆహారపు అలవాట్లు పూర్తిగా మారినా — ఈ రెండు గ్రామాలు మాత్రం సాంప్రదాయం = జీవన విధానం అని నిరూపిస్తూ నిలిచి ఉన్నాయి. మానవ సమాజం వేల రూపాల్లో విభజించబడినా… విశ్వాసం, నమ్మకం, నియమం ఉంటే సంప్రదాయం ఎలా నిలబడుతుందో ఈ గ్రామాలే సాక్ష్యం..
