భక్త జన కోలాహలం నడుమ..గణపతి బప్పా మోరియా అనే నినాదాల మధ్య.. ఖైరతాబాద్ మహాగణపతి గంగ ఒడికి చేరాడు.దశమహా విద్యాగణపతిగా తొమ్మిదిరోజుల పాటు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య.. ఇక వీడ్కోలు అంటూ ట్యాంక్ బండ్ వద్ద గంగమ్మ ఒడిలోకి చేరాడు. ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఏర్పాటు చేసిన నాలుగో నంబర్ క్రేన్ వద్ద బడా గణేశుడి నిమజ్జనం పూర్తయ్యింది.
అంతకుముందు ఉదయం 6 గంటలకు మొదలైన ఖైరతాబాద్ మహాగణపతి భక్తుల కోలాహలం మధ్య సందడిగా సాగింది. టెలిఫోన్ భవన్, సచివాలయం ఎన్టీఆర్ మార్గ్ గుండా సాగిన ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర మధ్యాహ్నానికి ట్యాంక్ బండ్‌కు చేరుకుంది. ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన క్రేన్ నెంబర్ 4 దగ్గర పూజల అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో బడా గణేశ్ నిమజ్జనం జరిగింది. మహా గణపతి నిమజ్జన ప్రక్రియను వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు గణపతి బప్పా మోరియా నినాదాలతో హోరెత్తిపోయాయి.