చిత్రం: వకీల్ సాబ్,
నటీనటులు: పవన్‌కల్యాణ్, నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్, శ్రుతి హాసన్, నరేశ్,
సంగీతం: తమన్,
నిర్మాత: దిల్‌రాజ్,
సమర్పణ: బోనీకపూర్,
రచన, దర్శకత్వం: వేణు శ్రీరామ్,
బ్యానర్: శ్రీ వేంకటేశ్వరక్రియేషన్స్,
విడుదల: 09-04-2021
రేటింగ్: 3.5/5
తెలుగు హీరోల్లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఉండే క్రేజే వేరు. ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన క్రేజ్‌ని పెంచాయే తప్ప… ఇసుమంతైనా తగ్గించలేకపోయాయి. రాజకీయాల్లో బిజీగా మారడంతో మూడేళ్లు గ్యాప్ తీసుకున్నా పవన్ సినిమా వస్తుందంటే ఆయన అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. హిందీలో విజయవంతమైన ‘పింక్’ సినిమా రీమేక్‌గా తన రీఎంట్రీ సినిమా ‘వకీల్‌సాబ్’ని ప్రకటించడంతో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. ప్రచార చిత్రాలు సైతం సినిమాపై మరిన్ని అంచనాల్ని పెంచాయి. మూడేళ్లుగా ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. నేడు(ఏప్రిల్ 9) థియేటర్లలో అడుగుపెట్టిన ‘వకీల్ సాబ్’ అంచనాలను అందుకున్నాడా? లేదా? అన్నది చూద్దాం…
మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ముగ్గురు అమ్మాయిలు నివేదా థామస్ (పల్లవి), అంజలి (జరీనా), అనన్య (దివ్య నాయక్) నగరానికి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటూ ఒకే ఇంట్లో కలిసి ఉంటారు. ఓరోజు రాత్రి ఇంటికి వెళ్తుండగా క్యాబ్ సడెన్‌గా ఆగిపోతుంది. వీరిపై కన్నేసిన ఎంపీ రాజేంద్ర (ముఖేష్ రుషి) కొడుకు వంశీ తన స్నేహితులతో కలిసి వాళ్లకు మాయమాటలు చెప్పి ఓ రిసార్ట్‌కి తీసుకెళ్తాడు. అక్కడ పల్లవికి వంశీ నుంచి చేదు అనుభవం ఎదురవుతుంది. తప్పించుకునే క్రమంలో వంశీని మందు సీసాతో కొట్టిన పల్లవి తన ఫ్రెండ్స్‌తో కలిసి అక్కడి నుంచి పారిపోతుంది.
ఎంపీ రాజేంద్ర తన పలుకుబడి ఉపయోగించి ఈ ముగ్గురు యువతులపై ఎదురు కేసు పెట్టిస్తాడు. ప్రాసిక్యూషన్ లాయర్ నంద (ప్రకాష్ రాజ్) సాయంతో వీళ్లని వ్యభిచారులుగా చిత్రీకరించి పల్లవిని జైలుకు పంపిస్తాడు.. అయితే పల్లవిని బెయిల్‌పై తీసుకొచ్చేందుకు జరీనా, అనన్య ఎన్ని ప్రయత్నాలు చేసినా నిరాశే ఎదురవుతుంది. ఆ సందర్భంలోనే సత్యదేవ్ అలియాస్ వకీల్‌సాబ్ (పవన్‌కల్యాణ్) గురించి తెలుసుకుని ఆయన సాయం కోరతారు. వాళ్ల పరిస్థితిని చూసి రంగంలోకి దిగిన వకీల్ సాబ్ ఈ కేసుని ఎలా ఛేదించాడు? ఈ ముగ్గురు అమ్మాయిల్ని కేసు నుంచి ఎలా బయటపడేశాడు? అసలు నిందితులను చట్టానికి ఎలా పట్టించాడు? అసలు వకీల్ సాబ్ నేపథ్యం ఏంటి? అన్నది థియేటర్లలో చూడాల్సిందే..
సమాజంలో మహిళలకు ఎదురవుతున్న సంఘటనలు, అఘాయిత్యాలను ఎత్తిచూపుతూనే కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన చిత్రమిది. అమ్మాయి నవ్వినా, ఒకరిని టచ్ చేస్తూ మాట్లాడినా, ఒంటరిగా వెళ్లినా మరో వంకతో చూసే ధోరణి గురించి ఇందులో హీరో చెప్పిన విషయాలు ఆలోచన రేకెత్తిస్తాయి. ఇలా జరగొద్దు… జరగకూడదనే ఓ బలమైన సందేశాన్నిస్తాయి. మగువా… పాటతో సినిమా మొదలవుతుంది. మూడు భిన్నమైన కుటుంబాల నుంచి అమ్మాయిలు తమ కలల్ని సాకారం చేసుకోవడం కోసం నగరానికి చేరుకోవడం, ఉద్యోగాలు చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలవడం వంటి సన్నివేశాలతో ఆ పాట సాగుతుంది. ముగ్గురమ్మాయిలకి ఎదురైన సంఘటనల తర్వాత వకీల్‌సాబ్‌గా పవన్‌కల్యాణ్ ఎంట్రీ ఇస్తాడు. అక్కడి నుంచి కథ వేగం పుంజుకుంటుంది. సత్యదేవ్ ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు, పల్లవి కోసం కోర్టు వాదించే సన్నివేశాలు సినిమాకే హైలట్‌గా నిలిచాయి.
ఫస్టాఫ్‌లో పవన్ అభిమానుల్ని అలరించడమే లక్ష్యంగా సన్నివేశాలుండగా.. సెకండాఫ్‌లో కోర్టు రూమ్ డ్రామా సినిమాకు ప్రాణంగా నిలిచాయి. సత్యదేవ్, నందా వాద ప్రతివాదనలతో సన్నివేశాలను రక్తి కట్టించారు. హిందీ చిత్రం ‘పింక్’కి రీమేక్ అయినప్పటికీ దాన్ని పవన్‌కల్యాణ్ ఇమేజ్‌కి తగ్గట్టుగా తీర్చిదిద్దిన విధానం, అభిమానుల్ని అలరించేలా వాణిజ్యాంశాల్ని జోడించిన తీరు మెచ్చుకుని తీరాల్సిందే. హీరో పాత్రను బలంగా ఎలివేట్ చేసినా కథ పక్కదారి పట్టకుండా దర్శకుడు శ్రద్ధ తీసుకున్నాడు.
చీడ పురుగు మగవాడి మెదడులో పెట్టుకుని… మందు ఆడవాళ్ల మొహం మీద కొడతాం అంటే ఎలా? అంటూ సాగే సంభాషణలు చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి. పవన్‌కల్యాణ్ పొలిటికల్ ఇమేజ్‌కి తగినట్లుగా కూడా ఇందులో కొన్ని డైలాగులు జోడించారు. ‘ఆశయం కోసం పనిచేసేవాడికి గెలుపు ఓటములతో పని ఉండదు’ అంటూ పవన్ రాజకీయ నేపథ్యాన్ని పవన్ టచ్ చేశారు. పొలిటికల్ ఇమేజ్ ఈ సినిమా విషయంలో పవన్‌కల్యాణ్‌కి బాగా కలిసొచ్చింది.
వకీల్‌సాబ్ పాత్రలో పవన్‌కల్యాణ్ పూర్తిగా ఒదిగిపోయారు. కోర్టులో అమ్మాయిలకు న్యాయం జరిగేలా చూడటంతో పాటు తన పాత్రకు వందశాతం న్యాయం చేశారు. కోర్టు సన్నివేశాల్లో పవన్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. నివేదా, అంజలి, అనన్య వారి పాత్రల్లో జీవించారు. నందా పాత్రలో ప్రకాశ్‌రాజ్ నటన సినిమాకి మరింత బలాన్నిచ్చింది. దర్శకుడు శ్రీరామ్ వేణు ముందు నుంచి చెప్పినట్లుగానే తన పనితనంగా అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే ఫస్టాఫ్‌పై మరింత శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా మరో రేంజ్‌కి వెళ్లేదనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని మైనస్‌లున్నా పవన్ కళ్యాణ్ వాటన్నింటినీ కనిపించకుండా చేశారు. థమన్ పాటలు, నేపథ్య సంగీతం, పి.ఎస్. వినోద్ కెమెరా పనితనం సినిమాకి అదనపు ఆకర్షణలుగా నిలిచాయి. నిర్మాణ పరంగా దిల్‌రాజు టేస్ట్ ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. మొత్తం ‘వకీల్ సాబ్’ అందరూ కచ్చితంగా చూడాల్సిన సినిమా.