నటీనటులు: కోటి, అభిలాస్ సుంకర, దీపిక ఆరాధ్య, బెనర్జీ, జీవీకే నాయుడు, కరాటే కళ్యాణి, భరణి శంకర్, రాయల్ హరిశ్చంద్ర, సంపత్, జబర్దస్త్ వాసు తదితరులు
నిర్మాత : సత్య నారాయణ సుంకర
దర్శకత్వం : రవి శ్రీ దుర్గా ప్రసాద్
సంగీతం : కోటి
సినిమాటోగ్రఫీ : నవీన్ కుమార్ చల్లా
ఎడిటర్ : పాపారావు
విడుదల తేది: సెప్టెంబర్ 22,2022
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి మొదటి సారిగా విలన్ పాత్రలో నటించిన చిత్రం ‘పగ పగ పగ’. అభిలాష్ సుంకర, దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని సత్యనారాయణ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన సినిమా పోస్టర్, మూవీ మోషన్ పోస్టర్, కోటి నటించిన పాత్రకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు(సెప్టెంబర్ 22)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రేక్షకులందరికీ ఉచితంగా చూపిస్తామని నిర్మాతలు ప్రకటన చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కంటెంట్‌పై నమ్మకంతో నిర్మాతలు తీసుకున్న ఈ నిర్ణయం సినిమాపై ఆసక్తిని పెంచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఓ సారి చూద్దాం.
కథేంటంటే..
‘పగపగపగ’ సినిమా కథ అంతా 1985, 1990, 2006వ సంవత్సరాల కాలంలో సాగుతుంది. బెజవాడలోని బెజ్జోనిపేటకు చెందిన జగ్గుభాయ్(కోటి), కృష్ణ(బెనర్జీ) కాంట్రాక్ట్ కిల్లర్స్. ఒక్కసారి డీల్ కుదుర్చుకుంటే ప్రాణాలు పోయినా పూర్తి చేయడం వీరి స్పెషాలిటీ. అయితే కృష్ట పోలీసు హత్య కేసులో అరెస్ట్ అవుతాడు. ఆ సమయంలో జగ్గూభాయ్‌కి కూతురు సిరి(దీపిక ఆరాధ్య) పుడుతుంది. కృష్ణ ఫ్యామిలీని కంటికి రెప్పలా కాపాడుతానని మాట ఇచ్చిన జగ్గు.. అతను జైలుకు వెళ్లగానే ఆ ఊరి నుంచి పారిపోతాడు. తర్వాత హత్యలను చేయడం మానేసి జగదీష్ ప్రసాద్‌గా పేరు మార్చుకొని పెద్ద వ్యాపారవేత్తగా మారతాడు.
మరోవైపు కృష్ణ ఫ్యామిలీ మాత్రం కష్టాలు పడుతూనే ఉంటుంది. అతని కొడుకు అభి(అభిలాష్)ని చదువులో రాణిస్తాడు. అభి చదువుకునే కాలేజీలోనే సిరి చేరుతుంది. ఈ క్రమంలోనే ఇద్దరికీ పరిచయం ఏర్పడి ప్రేమించుకుంటారు. జగదీష్ మాత్రం వీరి పెళ్లికి నిరాకరిస్తాడు. దీంతో ఇద్దరు పారిపోయి పెళ్లి చేసుకుంటారు. తను గారాబంగా పెంచుకున్న కూతురిని తీసుకెళ్లిన అభిపై జగదీష్ పగ పెంచుకుంటాడు. అల్లుడిని చంపడానికి ఓ ముఠాతో డీల్ కుదుర్చుకుంటాడు. కానీ కూతురు ప్రెగ్నెన్సీ అని తెలిసి ఆ డీల్‌ని వద్దనుకుంటాడు. ఇంతలోపే ఆ డీల్ చేతులు మారి చివరకు బెజ్జోనిపేటకు చెందిన ఓ వ్యక్తికి చేరుతుంది. అసలు ఆ డీల్ తీసుకుంది ఎవరు? తన అల్లుడిని కాపాడుకోవడానికి జగదీష్ చేసిన ప్రయత్నం ఏంటి? అభి తండ్రి కృష్ణ చివరకు ఏం చేశాడు? అభి ప్రాణాలను ఎవరు రక్షించారు? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
ప్రస్తుతం ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడం, థియేటర్లకు రప్పించడం చాలా కష్టంగా మారింది. డిఫరెంట్ కంటెంట్ ఉంటే తప్పా ప్రేక్షకులు సినిమాలను ఆదరించడం లేదు. ఇలాంటి తరుణంలోనే డిఫరెంట్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు దర్శకుడు రవి శ్రీ దుర్గా ప్రసాద్. ఆయన ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉంది. అందుకు అనుగుణంగానే ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించేందుకు 100శాతం కష్టపడ్డాడు. కొన్ని సీన్లలో ఆయన టేకింగ్ మెస్మరైజ్ చేస్తుంది. పాత్రలకు తగినట్లుగా నటీనటులను ఎంపిక చేసుకోవడంలో దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. వారి నుంచి నటన కూడా బాగానే రాబట్టుకున్నాడు.
అభి, సిరిల మధ్య కెమిస్ట్రీ బాగుంది. జగ్గూభాయ్ కాస్త జగదీష్ ప్రసాద్‌గా మారడం.. వ్యాపారంలో రాణించడం.. అదేసమయంలో కృష్ణ కష్టాలతో బాధపడడం, సిరి, అభిలు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. అసలు కథ అంతా సెకండాఫ్‌లో ఉంటుంది. కాంట్రాక్ట్ కిల్లర్‌ని పట్టుకునేందుకు జగ్గుభాయ్ చేసే ప్రయత్నాలు ఉత్కంఠగా సాగుతాయి. ఈ కథకి పోకిరి సినిమాలోని ఓ సన్నివేశాన్ని లింక్ చేయడం బాగుంది. క్లైమాక్స్ ప్రేక్షకుడి ఉహకు భిన్నంగా, టైటిల్‌కి తగ్గట్టుగా ఉంటుంది.
ఎవరెలా చేశారంటే..
కెరీర్‌లో మొదటిసారి విలన్ పాత్ర పోషించాడు సంగీత దర్శకుడు కోటి. జగ్గూ అలియాస్ జగదీష్ ప్రసాద్ పాత్రకు తగిన న్యాయం చేశాడు. విలన్‌గా, హీరోయిన్‌కి తండ్రిగా నటనలో అదరగొట్టేశాడు. హీరో అభిలాష్‌కి ఇది తొలి సినిమా అయినప్పటికీ చక్కగా నటించాడు. సీరియస్, కామెడీ సీన్స్‌తో పాటు యాక్షన్ ఎడిసోడ్స్‌లోనూ అదరగొట్టేశాడు. హీరోయిన్‌గా సిరి పాత్రలో దీపిక మెప్పించింది. బెనర్జీ, కరాటే కళ్యాణి, జీవా తదితరులు తమ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. కోటి సంగీతం ఈ సినిమాకు ప్లస్ అయింది. తనదైన నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచాడు. నవీన్ కుమార్ చల్లా సినిమాటోగ్రఫీ, పాపారావు ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.
ఆకట్టుకున్న దర్శకుడు
శ్రీ రవి దుర్గా ప్రసాద్ కొత్త దర్శకుడు అయినప్పటికీ ఈ సినిమాను కథనం పరంగా బాగానే డీల్ చేశాడనిపిస్తుంది. ఈ చిత్రంలో నటించిన వారిలా చాలామంది కొత్తవారే. సంగీత దర్శకుడిగా కోటి మాత్రమే ప్రేక్షకులకు పరిచయస్తుడు. అయితే నటుడిగా కోటిని ప్రేక్షకులు ఊహించని కోణంలో చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాకు ఆయన క్యారెక్టరే హైలెట్ అయింది. హీరో హీరోయిన్లు కొత్తవారు అయినప్పటికీ వారి నుంచి హావభావాలు రాబట్టడంలో కృతకృత్యులయ్యారు. సినిమా ఫస్టాఫ్ కామెడీ, అదిరిపోయే డైలాగులతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో ఏం జరుగుతుందోనన్న ఆతృతను ప్రేక్షకుడిలో కలిగించారు. చాలా సీన్లు మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని క్రియేట్ చేసినా.. ఓవరాల్ ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా మెప్పించేలా ఉంది. ఇంత మంచి కంటెంట్‌తో తెరకెక్కించిన ‘పగపగపగ’ చిత్రాన్ని అదేస్థాయిలో ప్రమోట్ చేయలేదనిపిస్తోంది. నిర్మాతలు పబ్లిసిటీ మీద కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. కాస్త పరిచయం ఉన్న హీరోహీరోయిన్ల పెట్టుకుంటే ఈ సినిమా మరో స్థాయిలో ఉండేది. అయినప్పటికీ కొత్త నటులతో ఆయన తెరకెక్కించిన విధానాన్ని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం.