నటీనటులు: అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి, చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, ఝాన్సీ తదితరులు.
కథ, దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ
నిర్మాత: అక్కినేని నాగార్జున
స్క్రీన్ ప్లే: సత్యానంద్
సంగీతం: అనూప్ రూబెన్స్,
ఛాయాగ్రహణం: యువరాజ్
నిర్మాణ సంస్థ: జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి.
విడుదల: 14 జనవరి 2021
అక్కినేని నాగార్జున కెరీర్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా’. నాగార్జున డ్యూయల్ రోల్ చేసిన ఈ సినిమా 2016, సంక్రాంతి సీజన్‌లో విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ చిత్రానికి కొనసాగింపుగా అందులోని బంగార్రాజు పాత్రతో కథని అల్లుకొని ‘సోగ్గాడే చిన్ని నాయనా’కి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ సినిమా తెరకెక్కింది. ‘మనం’ తర్వాత నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన ఈ చిత్రం శుక్రవారం(జనవరి 14)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కి మంచి స్పందన రావడం.. దానికి తోడు ప్రమోషన్స్‌ని గ్రాండ్‌గా చేయడంలో ‘బంగార్రాజు’పై భారీగా హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య సంక్రాంతి బరిలోకి దిగిన ‘బంగార్రాజు’ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించాడు?.. బంగార్రాజు పాత్రల్లో తండ్రీ తనయులు చేసిన సందడి ఎలా ఉంది? తదితర విషయాలు తెలుసుకుందాం…
కథేంటి..
సోగ్గాడే చిన్ని నాయన’చిత్రం ఎక్కడ ముగిసిందో.. అక్కడి నుంచే ‘బంగార్రాజు’ కథ మొదలవుతుంది. ఆత్మగా వచ్చిన బంగార్రాజు(నాగార్జున)..తన ఫ్యామిలీ సమస్యలన్నీ చక్కదిద్ది స్వర్గానికి తిరిగి వెళ్తాడు. కొన్నాళ్లకు డాక్టర్ రాము(నాగార్జున), సీత దంపతులకు కొడుకు పుట్టడం, కొంతకాలానికే సీత చనిపోవడంతో కొడుకు బాధ్యతలకు తన తల్లి సత్తెమ్మ(రమ్యకృష్ణ)కు అప్పగించి రాము విదేశాలకు వెళ్లిపోతాడు. మనవడు పెద్దయ్యేసరికి సత్తెమ్మ కూడా చనిపోయి ఉన్న బంగార్రాజు దగ్గరకు వెళ్లుంది. చిన్న బంగార్రాజు(నాగచైతన్య) కూడా తాత మాదిరే ఊర్లో ఆవారాగా తిరుతూ అమ్మాయిల వెంటపడుతుంటాడు. మరోపక్క చిన్న బంగార్రాజు మరదలు నాగలక్ష్మీ(కృతిశెట్టి) ఆ ఊరికి సర్పంచ్ అవుతుంది. వీరిద్దరికి ఒకరంటే ఒకరుపడరు. కానీ వీరిద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుందని సత్తెమ్మ భావిస్తుంది సత్తెమ్మ. తన మనవడి ప్రేమకి సహాయం చేయడానికి బంగార్రాజుని భూమ్మీదకి పంపిస్తుంది. అలా చిన బంగార్రాజులోకి ఆత్మగా దూరి అతనికి పెద బంగార్రాజు ఎలా సాయం చేశాడు? భార్య సత్యభామ కోరిక మేరకు చిన్న బంగార్రాజునీ, నాగలక్ష్మి (కృతిశెట్టి)నీ ఎలా కలిపాడు? చిన బంగార్రాజుని చంపాలనే కుట్రతోపాటు, ఊరి గుడిలో ఉన్న నిధులపై కన్నేసిన దుష్ట శక్తుల పతకాల్ని బంగార్రాజు ఎలా తిప్పికొట్టాడన్నదే మిగతా కథ.
సినిమా ఎలా ఉందంటే…
పండగ లాంటి సినిమా అని ముందునుంచీ చెబుతూ వచ్చిన చిత్ర బృందం అందుకు తగ్గ హంగుల్ని పక్కాగా మేళవించింది. గ్రామీణ నేపథ్యం, ఆకట్టుకునే తారాగణం, కలర్‌ఫుల్ పాటలకి తోడు అభిమానుల్ని మెప్పించే అంశాల్ని జోడించి సినిమాని తీర్చిదిద్దారు. పండగ సమయంలోనే విడుదలైంది కాబట్టి సందడికి ఢోకా లేదన్నట్టుగా సాగిపోతుంది సినిమా. తొలి సినిమా తరహాలోనే పక్కా ఫార్ములాతో గుడికీ, బంగార్రాజు కుటుంబానికీ ముడిపెట్టి కథని అల్లుకున్నారు దర్శకుడు. తొలి సినిమాలో తనయుడి సమస్యయితే, ఇందులో మనవడి జీవితాన్ని చక్కబెడతాడు. తొలి సినిమాలో బంగార్రాజు మాత్రమే ఆత్మ, ఇందులో మాత్రం ఆయనకి భార్య సత్యభామ కూడా కూడా తోడైంది.
ఫస్టాప్ కూల్.. సెకండాఫ్ కేక
ఫస్టాప్ అంతా మన్మథుడిగా ముద్రపడిన చినబంగార్రాజు, ఊరి సర్పంచ్ అయిన నాగలక్ష్మి హంగామాతోనే సాగుతుంది. ఒకరంటే ఒకరికి పడని ఆ ఇద్దరూ కలిసే వైనం, పెద్ద బంగార్రాజు చేసే మేజిక్‌తో సన్నివేశాలు సరదాగా సాగిపోతాయి. ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం ఆసక్తిని పెంచుతుంది. చాలా సన్నివేశాలు ఊహాజనితంగానే సాగినప్పటికీ మాస్ ప్రేక్షకుల్ని మెప్పించే అంశాల్ని పుష్కలంగా జోడించారు. మామిడి తోటలో చిన్న పిల్లాడిని కాపాడే సన్నివేశాలు, పతాక సన్నివేశాల్లో గుడి దగ్గర చోటు చేసుకునే మలుపు ప్రేక్షకుల్ని అలరిస్తాయి. అత్తమామలు, కోడలికి మధ్య మనస్పర్థల్ని తొలిగించే ఓ సన్నివేశంలో బంగార్రాజు చెప్పే సంభాషణలు, ఆ నేపథ్యంలో పండే భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. అయితే ఈ సినిమాల్లో కొన్ని విషయాలు మరీ నాటకీయంగా అనిపిస్తాయి.
తండ్రీకొడుకులే హైలెట్
ఈ సినిమాకు ప్రధాన బలం నాగార్జున, నాగచైతన్యల నటనే. చిన్నబంగార్రాజు, పెద్ద బంగార్రాజు పాత్రల్లో వీరిద్దరు ఒదిగిపోయారు. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తాయి. బంగార్రాజు ఆత్మ దూరిన ప్రతిసారి నాగచైతన్య చేసే సందడి ఆకట్టుకుంటుంది. అయితే సాధారణ సమయంలో చిన్నబంగార్రాజు కామ్‌గా ఉండడం.. ఆత్మ దూరిన తర్వాత రెచ్చిపోవడంతో.. చై కంటే నాగార్జుననే హైలెట్ అయ్యాడని చెప్పాలి. క్లైమాక్స్‌లో వీరిద్దరు కలిసి చేసే ఫైట్ సీన్ కూడా ఆకట్టుకుంటుంది.
ఎవరెలా చేశారంటే..
గ్రామ సర్పంచ్ నాగలక్ష్మీగా కృతిశెట్టి తనదైన నటనతో మెప్పించింది. అమాయకపు మాటలతో నవ్వించింది. బంగార్రాజు భార‍్య సత్య అలియాస్ సత్తెమ్మగా రమ్యకృష్ణ మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించింది. సంపత్ రాజ్, రావు రమేశ్, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. యువరాజ్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. అనూప్ పాటలు సినిమాకి ప్రధాన బలం. విజువల్‌గా కూడా పాటలు ఆకట్టుకుంటాయి. దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ రచన పరంగా తనదైన ప్రభావం చూపించారు. కథ పరంగా మరింత ఫోకస్ చేస్తే సినిమా మరో స్థాయిలో ఉండేది. మొత్తానికి ‘బంగార్రాజు’ సంక్రాంతి సోగ్గాడు తానేనని మరోసారి నిరూపించుకున్నాడు.