జన్ విశ్వాస్ చట్టం-2026: మారిన రైల్వే రూల్స్.. జైలు శిక్షలు రద్దు.. కానీ జరిమానాల మోత

Telugu BOX Office

రైల్వే ప్రయాణికులకు సంబంధించిన నిబంధనలు, శిక్షల విషయంలో కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. చిన్నచిన్న పొరపాట్లు, నిబంధనల ఉల్లంఘనలకు జైలు శిక్షలు విధిస్తూ కోర్టుల చుట్టూ తిప్పే పాత విధానానికి స్వస్తి పలికింది. ‘జన్ విశ్వాస్ చట్టం-2026’ ద్వారా రైల్వే వ్యవస్థలో దశాబ్దాలుగా అమలులో ఉన్న ‘రైల్వే చట్టం-1989’ స్థానంలో కీలక సవరణలు తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం.. రైల్వే నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి పలు సెక్షన్లలో క్రిమినల్ శిక్షలను (జైలు శిక్షలను) పూర్తిగా రద్దు చేసి, వాటి స్థానంలో భారీగా సివిల్ జరిమానాలను (పెనాల్టీలను) మాత్రమే ఖరారు చేశారు. దీనివల్ల న్యాయస్థానాలపై కేసుల భారం తగ్గడమే కాకుండా, ప్రయాణికులకు కోర్టుల చుట్టూ తిరిగే తిప్పలు తప్పుతాయి. అయితే, జైలు శిక్షలు తగ్గినప్పటికీ.. జరిమానాల మోత మాత్రం గట్టిగానే ఉండనుంది.

మారిన రైల్వే నిబంధనలు – జరిమానాల వివరాలు:

మద్యం తాగి ప్రయాణిస్తే: రైళ్లలో మద్యం సేవించి ప్రయాణించడం, ఇతరులను ఇబ్బంది పెట్టడం, అసభ్యంగా ప్రవర్తించడం వంటి పనులకు గతంలో 6 నెలల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా ఉండేది. ఇప్పుడు జైలు శిక్షను రద్దు చేసి, జరిమానాను రూ.1000కి పెంచారు. అయితే, ఇదే తప్పును పదే పదే రిపీట్ చేస్తే మాత్రం రూ.5,000 పెనాల్టీతో పాటు జైలు శిక్ష తప్పదు.

  మహిళల బోగీల్లో పురుషులు ప్రవేశిస్తే: లేడీస్ కంపార్ట్‌మెంట్‌లో పురుషులు ప్రయాణిస్తే గతంలో రూ.500 జరిమానా విధించి, టికెట్ రద్దు చేసి కిందకు దించేసేవారు. ఇప్పుడు ఆ జరిమానాను ఏకంగా రూ.2,500కు పెంచారు.

రైల్వే ప్రాంగణంలో ధూమపానం: స్టేషన్లలో లేదా రైళ్లలో ధూమపానం చేస్తే గతంలో కేవలం రూ.200 పెనాల్టీ మాత్రమే ఉండేది. కానీ ఇకపై దీనికి రూ.2,000 జరిమానా విధించడంతో పాటు, సదరు ప్రయాణికుడి టికెట్‌ను రద్దు చేసి రైల్వే పరిసరాల నుంచి బయటకు పంపించేస్తారు.

టికెట్ లేని ప్రయాణం: టికెట్ లేకుండా ప్రయాణించే వారికి విధించే కనీస జరిమానాను రూ.250 నుండి రూ.500కు పెంచారు. ప్రయాణికులు టికెట్ ధరతో పాటు ఈ పెనాల్టీని కూడా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

ఇతరుల టికెట్‌పై ప్రయాణిస్తే: వేరొకరి పేరు మీద ఉన్న టికెట్‌తో ప్రయాణిస్తే గతంలో 3 నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ జైలు శిక్షను తీసేసి కేవలం పెనాల్టీ మాత్రమే వసూలు చేస్తారు.

జనరల్ టికెట్‌తో రిజర్వేషన్ బోగీల్లోకి ఎక్కితే: సాధారణ టికెట్ కొని స్లీపర్ లేదా ఏసీ బోగీల్లో ప్రయాణిస్తే గతంలో రూ.500 జరిమానా ఉండేది, దాన్ని ఇప్పుడు రూ.2,000కు పెంచారు.

కన్ఫర్మ్ సీటు ఇవ్వకపోతే: రిజర్వేషన్ ఉన్న ప్రయాణికుడికి సీటు కేటాయించకుండా నిబంధనలు ఉల్లంఘిస్తే, గతంలో క్రిమినల్ కేసుతో పాటు రూ.500 జరిమానా ఉండేది. కొత్త రూల్ ప్రకారం సదరు వ్యక్తిని అక్కడి నుంచి ఖాళీ చేయించడంతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తారు.

రైళ్లలో భిక్షాటన, చిన్న వ్యాపారాలు: రైళ్లలో భిక్షాటన చేసినా లేదా అనుమతి లేకుండా తిరుగుతూ చిన్న వ్యాపారాలు, విక్రయాలు జరిపినా గతంలో ఏడాది వరకు జైలు శిక్ష లేదా రూ.2000 జరిమానా విధించేవారు. ఇప్పుడు జైలు శిక్షను తొలగించి, కేవలం జరిమానా మాత్రమే వసూలు చేసేలా మార్పు చేశారు.

నిషేధిత వస్తువుల రవాణా: రైళ్లలో ప్రయాణించేటప్పుడు ప్రమాదకరమైన లేదా నిషేధించబడిన వస్తువులను తీసుకెళ్తే గతంలో కేవలం రూ.500 జరిమానా మాత్రమే ఉండేది. ఇప్పుడది భారీగా పెరిగి ఏకంగా రూ.10,000కు చేరింది.

 

కేంద్ర ప్రభుత్వ తాజా సవరణల ప్రకారం, జైలు శిక్షల భయం తప్పినప్పటికీ నిబంధనలు ఉల్లంఘిస్తే జేబుకు గట్టిగానే చిల్లు పడనుంది. కాబట్టి ప్రయాణికులు రైల్వే నియమాలను ఖచ్చితంగా పాటించడం మంచిది.

Share This Article
Leave a Comment