ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఇక నుంచి GST రెండు శ్లాబులే

Telugu BOX Office

దేశంలో జీఎస్టీ (వస్తు సేవల పన్ను) సంస్కరణలకు లైన్‌ క్లియర్‌ అయింది. పేదలు, మధ్యతరగతికి ఊరటనిచ్చేలా పన్ను శ్లాబుల కుదింపునకు జీఎస్టీ కౌన్సిల్‌ పచ్చజెండా ఊపింది. దీనితో ప్రస్తుతం 5, 12, 18, 28 శాతంగా ఉన్న పన్ను రేట్లలో 5, 18 పన్ను రేట్లు మాత్రమే కొనసాగనున్నాయి. హానికర, విలాస వస్తువులపై 40 శాతం ప్రత్యేక పన్ను విధిస్తారు. ఎప్పటి నుంచో ప్రజలు కోరుతున్న మేరకు ఆరోగ్య, జీవిత బీమాలపై జీఎస్టీ పూర్తిగా రద్దయింది. బుధవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ వివరాలను వెల్లడించారు. దుర్గా నవరాత్రుల మొదటి రోజు అయిన సెప్టెంబర్‌ 22వ తేదీ నుంచి జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వస్తాయని ప్రకటించారు. దేశంలోని సాధారణ ప్రజలకు ప్రయోజనం కలిగించేందుకే జీఎస్టీ సంస్కరణలు చేపట్టామని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ‘‘జీఎస్టీలో వినూత్న సంస్కరణలు తీసుకువస్తామని ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు. ఈ సంస్కరణలు కేవలం పన్నురేట్ల హేతుబద్ధీకరణ మాత్రమేకాదు.. పేదలు, మధ్యతరగతి వారికి ఉపశమనం కలిగేలా, సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించేలా ఉండటమే లక్ష్యం. అందుకే లోతుగా సమీక్ష జరిపి నిర్ణయాలు తీసుకున్నాం. మద్దతు తెలిపిన అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. పన్ను శ్లాబులను రెండుకు తగ్గిస్తున్నాం. ఇకపై 5శాతం, 18శాతం పన్నురేట్లు ఉంటాయి. ఈ మార్పులతో సాధారణ ప్రజలు వినియోగించే నిత్యావసరాల ధరలు చాలా వరకు తగ్గుతాయి. వ్యవసాయ రంగానికి, రైతులకు ప్రయోజనం కలుగుతుంది. ఇది దేశంలో వినియోగాన్ని పెంచి, ఆర్థిక వ్యవస్థకు ఊపునిస్తుంది’’ అని తెలిపారు. హానికర వస్తువుల కేటగిరీలోని పాన్‌ మసాలాలు, గుట్కా, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై ప్రస్తుతమున్న ధరలే కొనసాగేలా పన్నులు ఉంటాయని చెప్పారు.

తగ్గేవి.. పెరిగేవి ఇవే..

జీఎస్టీ మార్పులతో చాలా వరకు నిత్యావసరాల ధరలు భారీగా తగ్గనున్నాయి. ఇప్పటివరకు 5శాతం పన్నురేటులో ఉన్న టెట్రాప్యాక్‌ పాలు, పనీర్‌, బ్రెడ్‌లపై పన్ను పూర్తిగా మినహాయించారు. ఇప్పటివరకు 18శాతం, 12శాతం పన్ను రేట్లలో ఉండి.. ఇకపై 5శాతం పన్ను పరిధిలో వస్తున్న హెయిర్‌ ఆయిల్‌, సబ్బులు, షాంపూలు, టూత్‌ బ్రష్‌లు, సైకిళ్లు, టేబుళ్లు, కుర్చీలు, పాస్తా, నూడుల్స్‌, కాఫీ, కార్న్‌ఫ్లేక్స్‌, బటర్‌, నెయ్యి, హస్తకళాకృతులు, మార్బుల్‌, గ్రానైట్‌తోపాటు కొన్ని రకాల ఔషధాలు, డయాగ్నస్టిక్‌ కిట్లు, కళ్లద్దాలు, సోలార్‌ ప్యానెళ్ల ధరలు తగ్గనున్నాయి.

పెట్రోల్‌, డీజిల్‌, సీఎన్జీ వాహనాలు, వాటి విడిభాగాలపై జీఎస్టీ తగ్గింపుతో కార్లతోపాటు ఆటోలు, బస్సులు, ట్రక్కుల ధరలూ దిగివస్తాయి. ముఖ్యంగా విలాసవంతమైన వాహనాలపై అదనపు సెస్‌ను ఎత్తివేయడంతో వాటి ధరలు మరింతగా తగ్గే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్‌ కార్లపై ఎప్పటిలాగే 5శాతం పన్ను కొనసాగనుంది. ఇక 350 సీసీ సామర్థ్యంలోపు ఉన్న ద్విచక్ర వాహనాలను 28శాతం పన్నురేటు నుంచి 18శాతానికి మార్చడంతో.. వాటి ధరలు పది శాతం మేర తగ్గనున్నాయి.

40శాతం ప్రత్యేక పన్ను రేటులోని శీతల పానీయాలు, చక్కెర, ఇతర తీపి పదార్థాలు, కెఫీన్‌ కలిపిన పానీయాలు, పళ్ల రసాల ధరలు కొంతమేర పెరిగే అవకాశం ఉంది. పాన్‌ మసాలాలు, సిగరెట్లు, గుట్కాలు, ఇతర పొగాకు ఉత్పత్తుల ధరల్లో పెద్దగా మార్పులు ఉండవు. 18 శాతం పన్నురేటులో మొబైల్‌ ఫోన్లను యథాతథంగా కొనసాగించారు. దీనితో వాటి ధరల్లో మార్పు ఉండదు. సిమెంట్‌పై పన్నును 28శాతం నుంచి 18శాతానికి తగ్గించారు. దీనితో దేశవ్యాప్తంగా నిర్మాణ రంగానికి ఊరట లభించనుంది. ఇళ్లు, ఫ్లాట్ల ధరలు కాస్త తగ్గేందుకు వీలుంటుంది. ప్రస్తుతం రూ.1000 లోపు ధర ఉన్న వస్త్రాలు, చెప్పులు, బూట్లపై 5శాతం, ఆపై ధర ఉంటే 12శాతం పన్ను వసూలు చేస్తున్నారు. ఇకపై రూ.2,500 వరకు ధర ఉన్న వస్త్రాలు, పాదరక్షలపై 5శాతమే పన్ను వర్తిస్తుంది. అంటే రూ.1000 నుంచి రూ.2,500 వరకు ధర ఉన్న వాటి ధరలు తగ్గుతాయి. అయితే రూ.2,500కుపైన ధర ఉండే వస్త్రాలు, పాదరక్షలు 18శాతం పన్నురేటులోకి వెళతాయి. అంటే.. వాటి ధరలు పెరుగుతాయి.

జీఎస్టీ తగ్గింపు ఇలా..

నిత్యావసర వస్తువులు ప్రస్తుతం తగ్గిన తర్వాత

తల నూనెలు, షాంపూలు, టూత్‌పేస్టులు,

టూత్‌ బ్రష్‌లు, షేవింగ్‌ క్రీమ్‌లు, సబ్బులు 18శాతం 5శాతం

వెన్న, నెయ్యి, చీజ్‌, డెయిరీ స్ర్పెడ్‌లు 12శాతం 5శాతం

ప్రీప్యాక్డ్‌ నమ్కీన్‌, భుజియా, మిక్చర్‌లు 12శాతం 5శాతం

ఫీడింగ్‌ బాటిళ్లు, బేబీ న్యాప్కిన్లు, డైపర్లు 12శాతం 5శాతం

కుట్టు మిషన్లు, వాటి విడిభాగాలు 12శాతం 5శాతం

Share This Article
Leave a Comment