కొన్ని జ్ఞాపకాలు మనసుని కత్తిలా గుచ్చుకుంటాయి. మరికొన్ని జ్ఞాపకాలు కత్తికంటే పదునుగా ఉంటాయి. తలుచుకున్న ప్రతిసారీ మనసుని రంపపు కోత కోస్తాయి. టెక్ దిగ్గజ సంస్థ ఒరాకిల్ సీఈఓ లారీఎలెసన్‌కి టీనేజీలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. చిన్నతనంలో ఎదురైన చేదు అనుభవాలే ఆయన్ని ప్రపంచ కుబేరుడిగా నిలబెట్టాయి. లారీ అసలు తల్లి ఫ్లోరెన్స్ తన పరిస్థితుల వలన బిడ్డను పెంచలేక బంధువులకు అప్పగించాల్సి వచ్చింది. అలా ఆయనను లిలియన్, లూయీ ఎలెసన్‌లు దత్తత తీసుకున్నారు. పేదరికం, ఆర్థికమాంద్యం కారణంగా లారీ చిన్ననాటి జీవితం కష్టాల్లోనే గడిచింది. పెంపుడు తండ్రి తరచూ “నువ్వు దేనికీ పనికిరావు” అంటూ నిరుత్సాహపరచినా, లిలియన్ మాత్రం అండగా నిలిచి కొడుకు చదువుకు తోడ్పడింది.

స్కూల్‌లోనే విజ్ఞానంపై ఆసక్తి చూపిన లారీ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నప్పుడు తల్లిని కోల్పోవడం వల్ల చదువును మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. ఆ తర్వాత జీవనాధారం కోసం అమెరికాలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలిఫోర్నియాలో స్థిరపడ్డాడు. ప్రోగ్రామింగ్‌పై ఆసక్తితో స్వయంగా నేర్చుకున్న ఆయన, విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేని దశలోనూ కంప్యూటర్‌ను వదలలేదు. తర్వాత ఏమ్‌పెక్స్ కార్పొరేషన్‌లో ఉద్యోగం పొందిన లారీ, అక్కడి నుంచి తన స్వప్నాన్ని నెరవేర్చే ప్రయత్నం మొదలుపెట్టాడు. దాచుకున్న డబ్బుతో “సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లాబొరేటరీస్” అనే చిన్న సంస్థను ప్రారంభించాడు. మొదట్లో పెట్టుబడిదారులు దూరంగా ఉన్నప్పటికీ, పట్టుదలతో సంస్థను నిలబెట్టి, దానిని ఒరాకిల్ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దాడు. ఈరోజు 140 దేశాల్లో లక్షన్నర మందికి పైగా ఉద్యోగులను కలిగిన ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజంగా ఒరాకిల్ నిలిచింది.
లారీ ఎలెసన్ సంపద ప్రస్తుతం కొన్ని లక్షల కోట్ల రూపాయలు. 34 లక్షలకోట్ల రూపాయల సంపదతో నం.1 స్థానంలో ఉన్న ఎలాన్‌మస్క్‌ని కూడా ఒక దశలో వెనక్కినెట్టి అతనికి గట్టి పోటీనిస్తున్నాడు. వ్యాపారంలో మాత్రమే కాదు, క్రీడల్లోనూ ఆయన ఉత్సాహం చూపిస్తారు. ముఖ్యంగా సెయిలింగ్ రేసులు ఆయనకు ఇష్టమైనవే. లారీ ఎలెసన్ 81 ఏళ్ల వయసులోనూ పరిశ్రమల రంగంలో తనదైన ముద్రవేస్తున్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే – “విజయం రాత్రికి రాత్రే రాదు. ఓర్పూ, లెక్కలతో రిస్క్ తీసుకునే ధైర్యం ఉంటే ఏదైనా సాధ్యం”. అనాథగా మొదలైన జీవితం నుంచి ప్రపంచ టెక్ రంగంలో సింహాసనం ఎక్కిన లారీ ఎలెసన్ కథ కష్టాలెంతైనా పట్టుదల ఉంటే శిఖరాలు అందుకోవచ్చని నిరూపిస్తోంది.
