రిలీజై రెండు వారాలకు చేరువ అవుతున్నా ఇంకా అదే ఫీవర్‌లో ఉన్నా సూపర్‌స్టార్ ఫ్యా్న్స్. దాదాపు పుష్కర కాలం తర్వాత రజనీ మాస్ కాంబ్యాక్ చూసి అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. రోబో తర్వాత ఆ స్థాయి హిట్టు పడలేదే అని నిరాశలో ఉన్న తలైవా ఫ్యాన్స్‌కు చొక్కాలు చింపుకునే రేంజ్ బొమ్మ పడింది. రజనీకి సరైన కథ పడితే అవుట్ పుట్ ఏ రేంజ్లో ఉంటుందో జైలర్ మరోసారి నిరూపించింది. ముఖ్యంగా రజనీ సినిమాలకు తెలుగునాట హౌజ్ ఫుల్ బోర్డ్‌లు చూసి ఎన్నో ఏళ్లయింది. 2.ఓ, కబాలి, పేట వంటి సినిమాలు బాగానే ఆడినా.. కమర్షియల్‌గా పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. దాంతో రజనీకాంత్ క్రేజ్ అంతకంతకూ పడిపోతూ వచ్చింది.
అయితే ఇన్ని సంవత్సరాల ఆకలి మొత్తం రజినీకాంత్ జైలర్ సినిమాతో తీర్చేసుకున్నాడు. రోబో తెలుగు లైఫ్ టైమ్ షేర్‌ను కేవలం పది రోజుల్లోనే క్రాస్ చేసి ఔరా అనిపించింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సరికొత్త రికార్డు కొల్లగొట్టింది. కేవలం పది రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసి ప్రభంజనం సృష్టించింది. ఇంత తక్కువ టైమ్‌లో ఆ అరుదైన ఫీట్‌ను అందుకున్న తొలి తమిళ సినిమాగా చరిత్రకెక్కింది. ఇప్పుడున్న సినిమా జోరు చూస్తుంటే 2.ఓ లైఫ్ టైమ్ గ్రాస్ రూ.800లను ఈజీగా క్రాస్ చేస్తుందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.
నెల్సన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. వీళ్ల ఎంట్రీకి ఆడియెన్స్ ఈలలు, గోలలతో థియేటర్లు దద్దరిల్లేలా చేశారు. ఇక అనిరుధ్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గూస్బంప్స్ అనే పదం కూడా చిన్నదేనేమో అనే స్థాయిలో మ్యూజిక్ ఇచ్చాడు. మొత్తంగా జైలర్‌తో సూపర్ స్టార్ మాస్ కంబ్యాక్ ఇచ్చాడు.