ఐఐటీ నుంచి అమెరికా దాకా.. గూగుల్‌ క్లౌడ్‌ సీఈఓ థామస్‌ కురియన్‌ విజయ గాథ

Telugu BOX Office

విశాఖపట్నంలో గూగుల్‌ (Google) అతిపెద్ద ఏఐ హబ్‌ (AI Hub) ఏర్పాటుకు మార్గం సుగమం చేసిన థామస్‌ కురియన్‌ (Thomas Kurian) పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఐఐటీ చదువు మధ్యలోనే వదిలేసి, కష్టాల నడుమ అమెరికా వెళ్లి సాధించిన ఆయన విజయ గాథ ప్రేరణాత్మకంగా నిలుస్తోంది. కేరళలోని కొట్టాయం జిల్లా పాంపడి గ్రామంలో పుట్టిన థామస్‌ కురియన్‌ విద్యావంతుల కుటుంబంలో పెరిగారు. తండ్రి కెమికల్‌ ఇంజినీర్‌, తల్లి టీచర్‌. వీరికి నలుగురు పిల్లలు. థామస్‌ తన కవల సోదరుడు జార్జ్‌ కురియన్‌తో కలిసి బెంగళూరులోని సెయింట్‌ జోసెఫ్‌ స్కూల్‌లో చదువుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ ఐఐటీ మద్రాసులో ప్రవేశం పొందారు. అయితే, చదువు మధ్యలోనే అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీలో అవకాశం రావడంతో తమ కలల గమ్యం వైపు అడుగులు వేశారు.

అగ్రరాజ్యంలో మొదటి రోజులు సవాళ్లతో నిండిపోయాయి. కేఫ్‌లలో వెయిటర్‌గా, కార్‌ పార్కింగ్‌ల వద్ద అటెండర్‌గా పనిచేసి చదువుకు డబ్బు సంపాదించారు. అక్కడి నుంచి స్టాన్‌ఫోర్డ్‌ గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ఎంబీఏ పూర్తి చేసి కార్పొరేట్‌ ప్రపంచంలో అడుగుపెట్టారు. తొలి ఉద్యోగం మెకెన్సీ అండ్‌ కంపెనీలో లభించగా, ఆ సంస్థలో ఆరేళ్లు పని చేశారు. అనంతరం ఒరాకిల్‌లో చేరిన ఆయన 22 ఏళ్ల పాటు ఆ కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా 32 దేశాల్లో 35 వేల మంది ఉద్యోగులను నేతృత్వం వహించారు. 2018లో ఒరాకిల్‌ సహ వ్యవస్థాపకుడు ల్యారీ ఎల్లిసన్‌తో విభేదాలు తలెత్తడంతో థామస్‌ కురియన్‌ ఆ సంస్థను వీడారు. అదే ఏడాది గూగుల్‌ క్లౌడ్‌ విభాగం సీఈఓగా నియమితులై తన ప్రతిభను చాటారు. ఆయన నాయకత్వంలో గూగుల్‌ క్లౌడ్‌ సర్వీసులు గణనీయమైన వృద్ధిని సాధించాయి. క్లౌడ్‌ కస్టమర్‌ సర్వీస్‌లో కొత్త ఆవిష్కరణలు, వ్యాపార వ్యూహాలలో మార్పులతో ఆయన సంస్థకు కొత్త దిశ చూపించారు.

తాజాగా విశాఖపట్నంలో గూగుల్‌ ఏఐ హబ్‌ ఏర్పాటు ప్రాజెక్ట్‌ రూపుదిద్దుకోవడంలో థామస్‌ కురియన్‌ కీలకపాత్ర పోషించారు. ఈ హబ్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో నూతన అవకాశాలు సృష్టించబోతున్నాయని అంచనా. థామస్‌ కురియన్‌ నికర సంపద రూ.15 వేల కోట్లకు పైగా ఉందని ఫోర్బ్స్‌ అంచనా వేస్తోంది. విశేషమేమిటంటే, ఆయన కవల సోదరుడు జార్జ్‌ కురియన్‌ కూడా సీఈఓగానే ఉన్నారు — అమెరికాలోని నెట్‌యాప్‌ (NetApp) కంపెనీకి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. కష్టాలను ఎదుర్కొని సాధించిన థామస్‌ కురియన్‌ ప్రయాణం యువతకు ప్రేరణగా నిలుస్తోంది.

Share This Article
Leave a Comment