సాధారణంగా హిందూ దేవతల ఆలయాలు ఊరి మధ్యనో.. శివారులోనో.. గుట్టలపైనో ఉంటుంటాయి. అయితే తిరుపతికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న రేణిగుంటలో కొలువైన కట్ట పుట్టాలమ్మ ఆలయం మాత్రం ఎవరి ఊహకి అందని రీతిలో ఉంటుంది. అవును ఇక్కడి అమ్మవారి ఆలయం రైలు పట్టాల కింద ఉండటం విశేషం. కింద అమ్మవారు పూజలు అందుకుంటుంటే.. పైనుంచి రైళ్లు పరుగులు తీస్తుంటాయి.
కట్ట పుట్టాలమ్మ అమ్మవారికి కొన్ని శతాబ్దాల చరిత్ర ఉంది. చెరువు కట్టపై కొలువై ఉన్న అమ్మవారిని ఆ మార్గంలో వెళ్లే ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకుని వెళ్లేవారట. అయితే బ్రిటీష్ వారి కాలంలో సరిగ్గా అమ్మవారి విగ్రహం మీదుగా రైల్వే లైన్ వేయాలని నిర్ణయించారట. అయితే అక్కడ చేపట్టిన రైల్వే ట్రాక్ పనుల్లో తరుచూ ఏదొక అవాంతరం ఏర్పడేదట. ఇది అమ్మవారి మహిమేనని స్థానికులు బ్రిటీష్ వారికి చెప్పడంతో అమ్మవారి విగ్రహాన్ని అలాగే ఉంచి పైనుంచి లైన్ వేశారు. దీంతో పైన రైలు పట్టాలు.. కింద అమ్మవారి ఆలయం కొలువుదీరాయి.
ఇక్కడి అమ్మవారిని సత్య ప్రమాణాలకు నిలయంగా భక్తులు భావిస్తారు. అమ్మవారిపై ప్రమాణం చేసి మాట తప్పితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. ఆదివారం, మంగళవారం, శుక్రవారాల్లో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఏటా సెప్టెంబర్ నెలలో జరిగే అమ్మవారి జాతరకి పక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు.