సాధారణంగా మనం ఆలయానికి వెళ్లి దేవుని దర్శనం చేసిన తర్వాత కొద్దిసేపు గుడిలో కూర్చుంటాం. కానీ చాలామంది ఈ ఆచారం ఎందుకు పాటించాలో తెలియకపోవచ్చు. కొందరు దర్శనం అయ్యాక వెంటనే బయలుదేరిపోతారు. అయితే మన శాస్త్రాలు మాత్రం దర్శనం అనంతరం కొంతసేపు దేవాలయంలో కూర్చోవాలని సూచిస్తున్నాయి. దీని వెనుక ఉన్న కారణాలు కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కాదు శాస్త్రీయ ఆధారాలూ ఉన్నాయి.

హిందూ ఆలయాలు సాధారణంగా ఎక్కువ విద్యుత్ మరియు అయస్కాంత శక్తి క్షేత్రాలు కలిగిన ప్రదేశాల్లో నిర్మించబడతాయి. ఈ ప్రాంతాలు పాజిటివ్ ఎనర్జీతో నిండివుంటాయి. ఆ శక్తిని మనం గ్రహించేలా గుడి నిర్మాణం ఉంటుంది. ఆలయంలోని మూల విరాట్ లేదా ప్రధాన దేవత ప్రతిష్ఠితమయ్యే ప్రాంతం భూమి అయస్కాంత శక్తి అత్యధికంగా ఉండే స్థానం. దీనిని మూలస్థానం అంటారు. మూల విరాట్ అడుగు భాగంలో రాగి రేకులు (Copper plates) ఉంచి, వాటిపై వేద మంత్రాలు రాసి ఉంటాయి. ఈ రాగి రేకులు భూమి అయస్కాంత తరంగాలను గ్రహించి చుట్టుపక్కలకి ప్రసారం చేస్తాయి. భక్తులు దేవాలయంలో సవ్యదిశలో ప్రదిక్షణలు చేస్తూ తిరిగితే, ఆ అయస్కాంత తరంగాలు వారి శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఈ ప్రక్రియ నెమ్మదిగా జరిగే కారణంగా పెద్దలు ఎప్పుడూ “నిదానంగా, శాంతంగా ప్రదిక్షణలు చేయాలి” అని చెబుతుంటారు.
ఈ విధంగా శరీరం పాజిటివ్ ఎనర్జీని గ్రహించి మానసికంగా ప్రశాంతతను కలిగిస్తుంది. గుడిలోని నిర్మాణ శైలి, శంఖ నాదం, గంట ధ్వని, దీపాల వెలుగు, దైవ దర్శనం తర్వాత మన మనస్సు ఉల్లాసంగా, శరీరం ఉత్తేజంగా మారుతుంది. అందుకే దర్శనం తరువాత కొంతసేపు దేవుని సన్నిధిలో కూర్చోవడం ద్వారా ఆ శక్తి మనలో నిలిచిపోతుంది. గుడిలో కూర్చొని మంత్ర జపం, ధ్యానం చేస్తే జ్ఞాపకశక్తి మెరుగవడమే కాక, మనలోని ఆందోళనలు తగ్గుతాయి. ఆత్మశాంతి కలుగుతుంది. ఆలయాలు కేవలం పూజల కోసం కాదు, శరీరం, మనస్సు, ఆత్మ సమతుల్యంగా ఉండేలా చేయడానికి రూపొందించిన శక్తి కేంద్రాలు. ఈ శక్తిని పూర్తిగా గ్రహించాలంటే దర్శనం తర్వాత కొంతసేపు అక్కడ కూర్చోవడం అత్యంత ముఖ్యం. అందువల్ల, దైవ దర్శనం అనంతరం గుడి ప్రాంగణంలో కొద్దిసేపు కూర్చోవడం అంటే భక్తి మాత్రమే కాదు అది ఆరోగ్యం, శాంతి, మరియు శక్తి పొందే అద్భుతమైన ఆధ్యాత్మిక శాస్త్రం కూడా.
