మకర సంక్రాంతి.. జీవన సంక్రమణానికి ప్రతీకగా నిలిచే మహా పండుగ

Telugu BOX Office

తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలన్నీ ఒక్క చోట కలిసే పండుగ ఏదైనా ఉందంటే అది సంక్రాంతే. చెడును వదిలి మంచిని ఆహ్వానించే భావనకు, అశాంతి నుంచి శాంతి వైపు మనసు మళ్లే మార్పుకు, “నాది” నుంచి “మనది” అనే సామూహిక స్పృహకు ప్రతీకగా నిలిచే పర్వదినం మకర సంక్రాంతి. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే ఈ పవిత్ర ఘట్టం జీవన సంక్రమణకు సంకేతంగా భావిస్తారు పెద్దలు. ప్రకృతిలోనూ, మనిషి మనసులోనూ మార్పు మొదలయ్యే సమయమే సంక్రాంతి. సంక్రాంతి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు… అది ఒక తత్వం. అశుభాన్ని విడిచిపెట్టి శుభారంభానికి అడుగులు వేసే కాలం. జీవితం కొత్త దిశగా మలుపు తిరిగే వేళ. అందుకే “మకర సంక్రమణం పరమార్థం”గా దీన్ని పురాణాలు, పెద్దలు వర్ణించారు.

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందడి

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి గొప్ప పండుగే అయినా గోదావరి జిల్లాల్లో దానికి ఉండే శోభ, సందడి ప్రత్యేకం. గోదావరి తీరంలో పండే పంటలు, కళకళలాడే పల్లెలు, రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు ఇవన్నీ కలిస్తే సంక్రాంతి నిజమైన అందం ఏమిటో తెలుస్తుంది. డిసెంబర్ చివరి నుంచే గోదావరి గ్రామాలు పండుగ మూడ్‌లోకి వెళ్తాయి. ప్రతి ఇంటి ముందు తెల్లవారుజామునే పెద్ద పెద్ద రంగవల్లులు, వాటి మధ్య గొబ్బెమ్మలు కనిపిస్తాయి. కొత్త బియ్యంతో వేసిన ముగ్గులు, పూలతో అలంకరించిన ముంగిళ్లు, ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలు ఇవన్నీ పల్లె వాతావరణానికి పండుగ వెలుగులు అద్దుతాయి. భోగి రోజున గోదావరి జిల్లాల్లో భోగిమంటల సందడి ప్రత్యేకంగా ఉంటుంది. పాత సామాన్లు, పనికిరాని వస్తువులు భోగిమంటలో వేసి “పాతది పోయి కొత్తది రావాలి” అనే భావనను ప్రతిబింబిస్తారు. చిన్నారులపై భోగిపళ్లు పోసి ఆయురారోగ్యాలు కోరుకుంటారు. రైతుల ఇళ్లలో ధాన్యం బస్తాలు ఎడ్ల బండ్లపై ఇళ్లకు చేరుతుంటాయి. పంట చేతికొచ్చిన ఆనందం ప్రతి ముఖంలో కనిపిస్తుంది.

సూర్యుడి గమనం – సంక్రాంతి ఆధ్యాత్మిక అర్థం

సంక్రాంతి పండుగ సూర్యుడి గమనంతో ముడిపడి ఉంది. ఖగోళశాస్త్రం ప్రకారం సూర్యుడు స్థిరతార. అన్ని గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. మనకు తెలిసిన 12 రాశుల్లో సూర్యుడు నెలకొక రాశిలో సంచరిస్తూ ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. ఈ ప్రవేశాన్నే “సంక్రమణం” అంటారు. ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడమే మకర సంక్రాంతి. ఈ రోజుతో సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభిస్తాడు. దీన్నే ఉత్తరాయణం అంటారు. పురాణాల ప్రకారం ఉత్తరాయణం దేవతలకు పగలు, దక్షిణాయణం దేవతలకు రాత్రి. అందుకే మకర సంక్రాంతిని దేవతల దినంగా కూడా భావిస్తారు. ఉత్తరాయణం పుణ్యకాలం కావడంతో ఈ సమయంలో చేసే దానధర్మాలు, జపతపాలు, స్నానాలు ఎంతో ఫలప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి. మకర సంక్రాంతి రోజు పవిత్ర నదుల్లో స్నానం చేయడం, సూర్యారాధన చేయడం, పితృదేవతలకు తర్పణాలు విడవడం విశేష పుణ్యఫలితాన్ని ఇస్తుందని విశ్వాసం.

రైతుల పండుగ – ప్రకృతికి కృతజ్ఞత

సంక్రాంతిని రైతుల పండుగగా ఎందుకు పిలుస్తారంటే… పంట చేతికొచ్చే సమయం ఇదే. కష్టపడి సాగు చేసిన పంటలు ఇళ్లకు చేరుతాయి. కొత్త ధాన్యాన్ని చూసి రైతుల మనసు పండుగలా మారుతుంది. ప్రకృతికి, సూర్యుడికి, భూమికి కృతజ్ఞతలు చెప్పే సందర్భమే సంక్రాంతి. కొత్త బియ్యంతో నేరుగా అన్నం వండరు. బెల్లం కలిపిన పరమాన్నం, అరిసెలు, అప్పాలు, చక్కిలాలు, పొంగలి వంటి పిండి వంటలు చేస్తారు. ఇవి ఆరోగ్యకరమని పెద్దలు చెబుతారు. తమిళనాడులో పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు కాబట్టి అక్కడ ఈ పండుగను “పొంగల్” అని పిలుస్తారు. సంక్రాంతి పిండివంటల్లో నువ్వుల వినియోగం తప్పనిసరి. నువ్వులను శనిదేవుని ప్రతీకగా భావిస్తారు. చకినాలు, లడ్డూలు, ఉండ్రాళ్లు – ఇవన్నీ సంక్రాంతి విందుకు ప్రత్యేకత.

దానధర్మాల మహిమ

మకర సంక్రాంతి రోజున చేసే దానధర్మాలకు వందరెట్లు ఫలితం ఉంటుందని పండితులు చెబుతారు. ధాన్యం, నువ్వులు, బెల్లం, చెరకు, వస్త్రాలు, పండ్లు, కాయగూరలు దానం చేయడం ఆనవాయితీ. గోదానం చేస్తే స్వర్గప్రాప్తి కలుగుతుందని పురాణ విశ్వాసం. ఈ రోజు పాలు పొంగించి సూర్య భగవానుడికి నైవేద్యం సమర్పిస్తారు. అలాగే పితృదేవతలకు తప్పనిసరిగా తర్పణాలు విడుస్తారు. మిగతా సంక్రమణాలకంటే మకర సంక్రమణానికి ఈ విషయంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

భీష్మ పితామహుడి ఉత్తరాయణ నిరీక్షణ

పురాణాల ప్రకారం భీష్మ పితామహుడు ఉత్తరాయణం కోసం ఎదురుచూశాడు. బాణాల మంచంపై పడుకుని మకర సంక్రాంతి రోజే తన శరీరాన్ని విడిచిపెట్టాడు. ఉత్తరాయణంలో శరీరాన్ని త్యాగం చేస్తే పునర్జన్మ చక్రం నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం. అందుకే మకర సంక్రాంతికి ఆధ్యాత్మికంగా అంతటి ప్రాధాన్యత ఉంది.

నాలుగు రోజుల పండుగ – భోగి నుంచి ముక్కనుమ వరకూ

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిని నాలుగు రోజుల పండుగగా జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ – ప్రతి రోజుకూ ప్రత్యేకత ఉంటుంది. సంక్రాంతి రోజు పెద్ద ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసుల హరినామ సంకీర్తనలు, గంగిరెద్దుల సందడి గ్రామాలను ఉత్సాహంగా మారుస్తాయి. కనుమ రోజున పాడి పశువులకు ప్రత్యేక పూజలు చేస్తారు. ముక్కనుమ రోజు గౌరీదేవి వ్రతాలు, బొమ్మల కొలువులు, కుటుంబ సమేత వేడుకలు జరుగుతాయి.

సంక్రాంతి ఒక పండుగ మాత్రమే కాదు… అది మనిషి మనసు పరివర్తనకు సంకేతం. చెడు నుంచి మంచి వైపు, స్వార్థం నుంచి నిస్వార్థం వైపు, అవిశ్వాసం నుంచి విశ్వాసం వైపు నడిపించే కాలం. ప్రకృతితో, కుటుంబంతో, సమాజంతో అనుబంధాన్ని గుర్తుచేసే మహాపర్వదినం. అందుకే సంక్రాంతి వస్తే… పట్టణాలకన్నా పల్లెలే ముందుగా కళకళలాడతాయి. ఎక్కడ ఉన్నా సొంత ఊరికి వెళ్లాలనే తపన కలుగుతుంది. అదే సంక్రాంతి గొప్పతనం. అదే మకర సంక్రమణం పరమార్థం.

Share This Article
Leave a Comment