మన సనాతన సంప్రదాయంలో గురువుకు అత్యున్నత స్థానం ఉంది. అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగు వైపు నడిపించే మార్గదర్శియే గురువు. ఆషాఢ మాస శుక్ల పక్ష పౌర్ణమిని శతాబ్దాలుగా ‘గురు పౌర్ణమి’ లేదా ‘వ్యాస పౌర్ణమి’గా భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం మన సాంప్రదాయం.
వ్యాస పీఠం… గురు పరంపర
మహాభారతం, అష్టాదశ పురాణాలను మానవాళికి ప్రసాదించిన కృష్ణ ద్వైపాయనుడైన వేద వ్యాస మహర్షి జన్మదినమే ఈ శుభదినం. ఈ రోజున వ్యాస భగవానుడిని జగద్గురువుగా భావించి పూజిస్తారు. ఇంట్లో లేదా ఆశ్రమాల్లో వ్యాస పీఠాన్ని ఏర్పాటు చేసుకుని, భారత భాగవతాది పవిత్ర గ్రంథాలను ఉంచి, వ్యాస లేదా విష్ణు అష్టోత్తర శతనామావళితో అర్చనలు నిర్వహిస్తారు. మనకు ఆధ్యాత్మిక, భౌతిక జ్ఞానాన్ని అందించిన ప్రత్యక్ష గురువులను నూతన వస్త్రాలు, దక్షిణ తాంబూలాలతో సత్కరించి ఆశీస్సులు పొందడం ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. మేధా దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్వామి, ఆదిశంకరాచార్యులు, రమణ మహర్షి వంటి మహనీయులను స్మరించుకుంటూ, “నారాయణం పద్మభువం వశిష్ఠం…” అనే గురు పరంపరా శ్లోకాన్ని జపించడం పవిత్రమైన విధిగా భావిస్తారు.

గిరి ప్రదక్షిణ మహిమ
గురు పౌర్ణమి నాడు గోవర్ధన గిరి, అరుణాచలం, సింహాచలం వంటి పవిత్ర క్షేత్రాలలో గిరి ప్రదక్షిణ చేయడం ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగానూ ఎంతో శ్రేయస్కరం. ఈ రాత్రి వేళ కురిసే చంద్ర కిరణాలలో విశేషమైన ఓషధీ తత్త్వం ఉంటుందని, అది మనస్సుకు అపారమైన ప్రశాంతతను చేకూరుస్తుందని విశ్వసిస్తారు.
ఇంట్లోనే చేసుకోదగిన విశేష పూజ
క్షేత్ర దర్శనాలకు వెళ్లలేని వారు ఈ రాత్రి చంద్రోదయం తర్వాత ఒక వెండి గిన్నెలో ఆవుపాలు పోసి, అందులో ఏలకల పొడి, పటికబెల్లం కలపాలి. ఆ గిన్నెను చంద్రకాంతి సోకేలా తులసికోట వద్ద ఉంచి, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయాలి. అనంతరం ఆ పాలను అమ్మవారికి నివేదించి తీర్థంగా స్వీకరిస్తే జగన్మాత సంపూర్ణ కృపాకటాక్షాలు లభిస్తాయని నమ్ముతారు.
దత్తాత్రేయుడు చూపిన 24 మంది గురువులు
‘గురు’ శబ్దంలో ‘గ’కారం బ్రహ్మకు, ‘ర’కారం పాపాలను హరించే శివశక్తికి సంకేతాలు. ఇవి విష్ణుశక్తితో కలిసినప్పుడు త్రిమూర్తి తత్త్వంగా రూపుదిద్దుకుంటుంది. జగద్గురువైన శ్రీ దత్తాత్రేయుడు ప్రకృతిలోని ప్రతి అణువు నుంచి జ్ఞానాన్ని గ్రహించవచ్చని నిరూపించారు. యాదవ వంశ మూలపురుషుడైన యదుమహారాజుకు దత్తస్వామి తాను స్వీకరించిన 24 మంది గురువుల అంతరార్థాన్ని వివరించారు:
భూమి: క్షమ, పరోపకారం.
వాయువు: ఆసక్తి లేకపోవడం (నిస్సంగత్వం).
ఆకాశం: సర్వవ్యాపకత్వం.
జలం: నిర్మలత్వం, మాధుర్యం.
అగ్ని: తేజస్సు, ఈశ్వర తత్త్వం.
సూర్యుడు: ప్రతిఫలం ఆశించకుండా కాంతిని ఇస్తూ, త్యాగగుణాన్ని నేర్పడం.
చంద్రుడు: హెచ్చుతగ్గులు (వృద్ధిక్షయాలు) శరీరానికే కానీ ఆత్మకు కాదని తెలియజేయడం.
పావురాల జంట: మోహంలో పడితే ఆత్మానురాగాన్ని కోల్పోతామని హెచ్చరిక.
కొండచిలువ (అజగరం): దైవికంగా లభించిన దానితో తృప్తి చెందడం.
సముద్రం: కల్మషాలను దరిచేరనీయకుండా ప్రశాంతంగా ఉండటం.
మిడత: కామమోహాలనే జ్వాలలో పడి ప్రాణాలు కోల్పోకూడదని సందేశం.
తుమ్మెద/తేనెటీగ: ఇతరులను బాధించకుండా సారాన్ని గ్రహించడం, రేపటి కోసం మితిమీరి దాచుకోకపోవడం.
ఏనుగు: మోహంలో పడితే బలవంతుడైనా ఇతరులకు బానిసవుతాడని పాఠం.
మధుహారి (తేనెసేకరిసేవాడు): ఇతరుల కష్టాన్ని ఆశించడం తగదని హెచ్చరిక.
లేడి: ఇంద్రియ చపలత, లలిత కళల పట్ల మితిమీరిన భ్రమ ప్రమాదకరమని సూచన.
చేప: రుచికి ఆశపడి ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదని జిహ్వ చాపల్య నియంత్రణ.
పింగళ (వేశ్య): భౌతిక ఆశలు నిరాశకే దారితీస్తాయని, వైరాగ్యమే నిజమైన సుఖమని తెలుసుకోవడం.
లకుముకి పిట్ట (కురరము): ఆశపడిన దాన్ని పట్టుకుని వేలాడితే దుఃఖమే మిగులుతుందని పాఠం.
బాలుడు: అమాయకత్వం, పాపపుణ్యాలకు అతీతంగా ఉండటం.
కన్యక: ధైర్యంతో కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవడం.
బాణాలు తయారుచేసేవాడు (శరకారుడు): లక్ష్యంపై ఏకాగ్రత.
పాము: శాశ్వతం కాని శరీరం కోసం శాశ్వత నివాసాలు ఆశించకపోవడం.
సాలీడు: సృష్టి, స్థితి, లయల పరబ్రహ్మ తత్త్వం.
పురుగు (భ్రమరకీటకం): ధ్యానం దేనిపై లగ్నం చేస్తే చివరకు ఆ రూపమే పొందుతారని ఆత్మజ్ఞానం.
జీవిత గమ్యానికి దిక్సూచి
మాతృదేవోభవ, పితృదేవోభవ తర్వాత ‘ఆచార్యదేవోభవ’ అని మన సంస్కృతి ఘోషిస్తోంది. అక్షరాలు నేర్పే ఉపాధ్యాయుడి నుండి జీవిత సత్యాన్ని బోధించే ఆధ్యాత్మిక గురువు వరకు ప్రతి ఒక్కరూ మన వికాసానికి కారణమే. గురువు చెప్పే మాటలను ఏకాగ్రతతో విని, జీవితంలో ఆచరించడమే మనం ఆ మహనీయులకు ఇచ్చే నిజమైన గురుదక్షిణ.
