హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఆషాడ మాసం నాల్గవ మాసం. సనాతన ధర్మంలో ప్రతి మాసానికి మతపరమైన, ఆధ్యాత్మిక దృక్కోణంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి మాసంలో పండగలు, పూజలు, ఉపవాసాలు వస్తాయి. పౌర్ణమి ప్రతి నెల వస్తుంది. కానీ ఆషాడమాసంలో వచ్చే పౌర్ణమికి ఓ ప్రత్యేక ఉంది. ఈ పౌర్ణమిని గురు పూర్ణిమ అంటారు. ఆషాఢ మాసంలో వచ్చే ఈ పౌర్ణమిని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఎందుకంటే మహాభారతాన్ని రచించిన వేద వ్యాస మహర్షి కూడా ఈ రోజునే జన్మించారని నమ్ముతారు. ఈ సందర్భంగా, ఈ రోజును గురు పూర్ణిమగా జరుపుకుంటారు. పూర్తి ఆచార, నియమాలతో వ్యాస భగవానుడిని పూజిస్తారు.
భారతీయ సంస్కృతిలో గురువులది ప్రత్యేకస్థానం. యోగ సంప్రదాయంలో పరమశివుడు ఆదియోగి. సిద్ధసంప్రదాయంలో శివుడే ఆదిగురువు. గురుపరంపరకు ఆద్యుడు నారయణుడు. ఈ సృష్టిలో శివుడు, శక్తి, విష్ణువు పరబ్రహ్మ యొక్క ముఖ్యమైన ప్రతిబింబాలు. నిరాకారము, శూన్యము, ఆద్యంతరహితమైన తత్వం, అవ్యక్తమే శివుడు. నిరాకారం సాకారమైనప్పుడు, అవ్యక్తం వ్యక్తమై సృష్టిగా ఏర్పడడమే శక్తి, పార్వతీ దేవీ. సృష్టి మొత్తం జడమనుకుంటే, ఆ జడత్వంలో ఉన్న చైతన్యం, ప్రాణశక్తి శ్రీ మన్నారాయణుడు. బ్రహ్మ దేవుడు, మహర్షులు మొదలైన అనేకమందికి జననమరణాలు, జన్మలు ఉన్నా, వీటన్నిటికి అతీతులు శివ, శక్తి, విష్ణువులు. వీరిని ముగ్గురిగా చెప్పుకున్నా, నిజానికి వీరు ఒక్కరే, తత్వం ఒకటే.
సనాతనధర్మం ప్రకారం ఈ సృష్టి క్రమానికి ఆది, అంతము అంటూ ఉండవు. సముద్రపు అలలపై ఏర్పడే నురుగులో ప్రతి క్షణం కొన్ని వేల బుడగలు పుడుతుంటాయి. కొన్ని వేలు నీటిలో కలిసిపోతుంటాయి. అట్లాగే పరమాత్ముడి సృష్టిలో అనేక జగత్తులు నిత్యం ఉద్భవిస్తుంటే, అనేకం లయమవుతుంటాయి. సృష్టి ఏర్పడే క్రమాన్ని సనాతన ధర్మం సశాస్త్రీయంగా కూడా వివరించింది. వాటిలో అణువుల కదిలకలకు ప్రతీక నటరాజ స్వామి. శివుడు ఎప్పుడూ తాండం చేస్తూనే ఉంటాడు నటరాజు రూపంలో. ఆయన తాండవం ఆగదు. పరమశివుడి తాండవ సమయంలో ఆయన చేతి ఢమరుకం నుంచి నాదం (శబ్దం) పుట్టింది. నాదం నుంచి వేదం పుట్టింది. సృష్టికి మొదట నాదం రూపంలో పరబ్రహ్మ వ్యక్తమయ్యాడు కనుక నాదబ్రహ్మం అని అంటాం. నాదం నుంచి ప్రణవం (ఓంకారం), వేదం వచ్చాయి. ఈ వేదాన్ని సర్వవ్యాపకుడైన శ్రీ మహా విష్ణువు బ్రహ్మదేవునకు ఉపాదేశించాడు (శివకేశవులకు బేధం లేదు, ఇద్దరూ ఒకే పరమాత్మ యొక్క భిన్న కోణాలు). కనుక శ్రీ మహావిష్ణువును గురుపరంపరలో మొదటివాడిగా చెప్పుకుంటున్నాం. అందుకే అద్వైత గురు పరంపర స్తోత్రం ‘నారయణ సమారంభాం’ అంటూ ప్రారంభమవుతుంది. బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకుని సృష్టి చేశాడు. అందుకే వేదోఖిలం జగన్మూలం అన్నారు అంటే వేదమే జగత్తునకు మూలమై ఉన్నది అని అర్దం. దేవతలను, మానవులను, దానవులను సృష్టించాడు. వేదం ఆధారంగా ధర్మాన్ని ఏర్పరిచాడు.
బ్రహ్మ శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలో నుంచి పుట్టాడు, కనుక బ్రహ్మదేవుడిని పద్మభువుడు అన్నారు. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి కుమారుడు. విష్ణువుమూర్తి తనకు ప్రసాదించిన జ్ఞానాన్ని, బ్రహ్మ విద్యను, వేదాన్ని బ్రహ్మ తన కుమారుడైన వశిష్టమహర్షికి, వశిష్టుడు తన పుత్రుడైన శక్తి మహర్షికి, శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి, ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాడు. ఈ మధ్యలో చాలా యుగాలు గడిచిపోయింది, కోట్ల సంవత్సరాలు కాలంలో వెళ్ళిపోయాయి, ఎందరో మహానుభావులు పుట్టారు, ఎందరో ముక్తిని పొందారు. అనేక మందికి ఈ మహాజ్ఞానం ఉపదేశించబడదింది. వశిష్టమహర్షి 24 వ త్రేతాయుగంలో శ్రీ రామచంద్రునికి, లక్ష్మణునికి గురువుగా యోగవిద్యను బోధించారు. ఆ మహాయుగం గడిచిపోయింది, ఇంకా 3 మహాయుగాలు గడిచి 28 వ మహాయుగం ప్రారంభమైంది. సత్యం యుగం దాటింది, త్రేతాయుగం వెళ్ళిపోయింది, ద్వాపరయుగం ఆఖరికి చేరుకుంది. ఇంతలో మహాభారత యుద్ధం జరిగింది. ఇంతకాలం గడిచినా వేదం ఎప్పుడు గ్రంధస్థం కాలేదు. గురువుల ద్వారా విని నేర్చుకునేవారు. అందుకే వేదానికి ‘శ్రుతి’ అని పేరు వచ్చింది.
ఈ వేదాన్ని సమాధి స్థితిలో ఉన్న ఋషీశ్వరులు దర్శించారు. పరమాత్మ వారికిచ్చిన వేదం ఒకటిగానే ఉండేది. అంతా కలిసిపోయి ఉండేది. దానికి తోడు, మధ్యకాలంలో అనేకమంది తమ అనుభూతులు ద్వారా, సమాధి స్థితి ద్వారా అనేకానేక విషయాలను వేదం నుంచి వెలికితీశారు. ఇదంతా పెద్ద జ్ఞానరాశి. ఒక వ్యక్తి వీటిని సక్రమంగా అర్దం చేసుకోవడం దుర్లభంగా ఉండేది. ఈ విషయాన్ని వ్యాసమహర్షి గుర్తించారు. రాబోయేది కలియుగం. కలియుగ జనంలో భక్తి తక్కువగా ఉంటుంది, ఆయుషు తక్కువ (100-120 ఏళ్ళు), అధికశాతం ప్రజలు మందబుద్ధులుగా ఉంటారు. జ్ఞాపకశక్తి గొప్పగా ఉండదు. మహాభారత యుద్ధం కారణంగా వేదపండితుల అనేకమంది మరణించారు. వైదిక సంస్కృతి దెబ్బతింది. ఇలా సాగితే, కలియుగ జనం ఎట్లా తరిస్తారు? ఆ సందేహం వ్యాసమహర్షికి కలిగింది. ఋషి భవిష్యత్తును దర్శనం చేయగలడు. కనుక అన్ని విషయాలను గమనించి కలియుగ ప్రారంభానికి ముందు వ్యాసమహర్షి ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగు వేదాలుగా ఋగ్, యజుర్, సామ, అథర్వ వేదాలుగా విభజించారు. ప్రపంచ నలుమూలల ఉండే 88,000 మహర్షులను భారతదేశానికి ఆహ్వానించి వేదసభ ఒకటి నిర్వహించి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వేదాన్ని గ్రంధస్థం చేశారు.
ఈ రోజున ఎలా పూజించాలంటే..
గురు పూర్ణిమ రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి పూజకు ఏర్పాటు చేసుకోండి. ఈ రోజు ప్రత్యేకమైన రోజు కాబట్టి, తెల్లవారుజామున పూజలు చేయడంలో మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూజాసామాగ్రి, పూలు, మాలలు, తాంబూలం, వంటి ఇతర పూజా వస్తువులను ఒక రోజు ముందుగానే ఏర్పాటు చేసుకోండి. అనంతరం మీ గురువుగారి దగ్గరకు వెళ్లి, ఆయన పాదాలు కడిగిన తర్వాత ఆయనకు పూజ చేసి.. మీ శక్తి కొలది పండ్లు, పూలు, డ్రై ఫ్రూట్స్, స్వీట్లు, డబ్బు మొదలైన వాటిని సమర్పించండి.
ఈ రోజున చేయాల్సిన పనులు
- పౌర్ణమి రోజున కొన్ని పనులు చేయడం ద్వారా సంపదలకు దేవత అంటే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. దీని కోసం, ఒక కుండలో మంచినీటిని తీసుకొని రావి చెట్టుకు ఆ నీటిని సమర్పించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు.
- సాయంత్రం వేళల్లో భార్యాభర్తలు కలిసి చంద్రుని దర్శనం చేసుకుని పూజిస్తే వారి దాంపత్య జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయి.
- పౌర్ణమి సాయంత్రం తులసి మొక్క ముందు స్వచ్ఛమైన దేశం నెయ్యి దీపం వెలిగించడం వలన అదృష్టం కలిగిస్తుంది.
చేయకూడని పనులు
- పౌర్ణమి నాడు దానం చేయడం చాలా శ్రేయస్కరం అని అంటారు. అయితే ఈరోజున ఇంటికి వచ్చిన బిచ్చగాళ్లను కూడా కూడా ఖాళీ చేతులతో తిరిగి పంపించకూడదని అంటారు. హిందూ మతంలో దాతృత్వానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది గ్రంధాలలో కూడా ప్రస్తావించబడింది. ఈ రోజుల్లో పేదలకు లేదా అవసరం ఉన్న వారికి వస్తువులను దానం చేయడం ద్వారా మీరు రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు. అలాగే ఇంటికి వచ్చే వ్యక్తికి ఏదైనా దానం చేయండి.
- పౌర్ణమి రోజున, వృద్ధులను లేదా స్త్రీని పొరపాటున కూడా అవమానించకూడదు. వాస్తవానికి, గురు పూర్ణిమ మీ పెద్దలను గౌరవించాలని మీకు బోధిస్తుంది, అయితే ఈ రోజున, పెద్దలను అవమానించే వైఖరి మీకు ఉంటే.. సాధారణ జీవితంలో ఈ చర్యలు హానికరాన్ని కలుగజేస్తాయి.