జాబిల్లిపై కాలుమోపిన చంద్రయాన్-3… ఇస్రో రికార్డ్

Telugu BOX Office

చందమామ చిక్కింది. విశ్వ వీధుల్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. చంద్రయాన్ 2 వైఫల్యం తర్వాత సడలని సంకల్పం, చెదరని ఆత్మవిశ్వాసంతో ఇస్రో చేసిన కృషి ఫలించింది. కులమతాలకు అతీతంగా… దేశం మొత్తం ఒక్కటై చేసిన పూజలు, ప్రార్థనలు ఫలితాన్ని ఇచ్చిన వేళ.. అందాల జాబిలిపై మూడు రంగుల జెండా మురిసింది. చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్ 3 కాలుమోపింది.

చంద్రయాన్- 3 విజయం ద్వారా అంతరిక్ష చరిత్రలో మరే దేశానికి సాధ్యం కానిదాన్ని భారత్ సుసాధ్యం చేసింది. జాబిల్లి దక్షిణ దృవంపై కాలుమోపిన తొలి దేశంగా…. అగ్రరాజ్యాలకే సాధ్యం కాని ఘనతను తన పేరిట లిఖించుకుంది. మొత్తంగా చందమామను చేరిన నాలుగో దేశంగా అమెరికా, యూరోపియన్ యూనియన్, చైనాల సరసన సగర్వంగా చేరింది.


ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి జులై నెల 14న జాబిల్లి వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించింది చంద్రయాన్-3. ఆగస్ట్ ఒకటో తేదీన చంద్రుడి కక్ష్యవైపు పయనం ప్రారంభించింది. ఐదో తేదీన జాబిల్లి కక్ష్యలోకి చంద్రయాన్-3 ప్రవేశించింది.

ఆగస్టు 6, 9, 14, 16వ తేదీలలో ఇస్రో శాస్త్రవేత్తలు కక్ష్య తగ్గిస్తూ వచ్చారు. ఆగస్ట్ 17వ తేదీన ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోయింది. 18,19 వ తేదీలలో వేగాన్ని తగ్గిస్తూ వచ్చారు ఇస్రో శాస్త్రవేత్తలు. 41 రోజుల ప్రయాణం తర్వాత ఎట్టకేలకు కోట్లాది మంది భారతీయుల ప్రార్థనలను, ఇస్రో శాస్త్రవేత్తల కృషిని నిజం చేస్తూ జాబిల్లిని ముద్దాడింది విక్రమ్ ల్యాండర్. ఇప్పటివరకూ అమెరికా, చైనా, రష్యా మాత్రమే చందమామపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ సాధించాయి. అయితే అగ్రరాజ్యాలు కూడా జాబిల్లి దక్షిణ ధ్రువాన్ని చేరుకోలేకపోయాయి. ఆ ఘనతను సాధించిన తొలిదేశంగా భారత్ సగర్వంగా నిలిచింది.

Share This Article
Leave a comment