రివ్యూ: లియో

Telugu BOX Office
లియో రివ్యూ
3.3

సినిమా పేరు: లియో
నటీనటులు: విజయ్‌, త్రిష, సంజయ్‌ దత్‌, అర్జున్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ తదితరులు
నిర్మాతలు: ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి
తెలుగులో విడుదల: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌
రచన-దర్శకత్వం: లోకేష్‌ కనగరాజ్‌
సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌
సినిమాటోగ్రఫీ: మనోజ్‌ పరమహంస
విడుదల తేది: అక్టోబర్‌ 19, 2023

దళపతి విజయ్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు.. ఇక లోకేష్ కనకరాజ్ వంటి స్టైలీష్ మేకర్‌తో మరో సినిమా అంటే ఆ క్రేజ్ ఇంకో లెవెల్లో ఉంటుంది. లియోతో విజయ్, లోకేష్ రెండో సారి ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అయ్యారు. అయితే ఈ సారి మాత్రం లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా లియోను ప్లాన్ చేశారు. ఖైదీ, విక్రమ్‌లను లియోకు ఎలా లింక్ చేశారు? అసలు లియో కథ ఏంటి? అన్నది ఓ సారి చూద్దాం.

కథేంటంటే..
పార్తి అలియాస్‌ పార్తిబన్‌(విజయ్‌) హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్‌ రన్‌ చేస్తూ.. భార్య సత్య(త్రిష), ఇద్దరు పిల్లలు(పాప, బాబు)తో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓ సారి తన కాఫీ షాపుకు ఓ దొంగల ముఠా వచ్చి డబ్బును దోచుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకితో అందరిని కాల్చి చంపేస్తాడు పార్తి. దీంతో అతను అరెస్ట్‌ అవుతాడు. ఆత్మ రక్షణ కోసమే వారిని చంపినట్లు కోర్టు భావించి..అతన్ని నిర్ధోషిగా ప్రకటిస్తుంది. పార్తి ఫోటో ఓ వార్త పత్రికలో చూసి ఏపీలోని ఆంటోని దాస్‌(సంజయ్‌ దత్‌) గ్యాంగ్‌.. హిమాచల్‌ ప్రదేశ్‌కు వస్తుంది. పార్తిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏంటంటే.. పార్తి, 20 ఏళ్ల కిత్రం తప్పిపోయిన ఆంటోని దాస్‌ కొడుకు లియోలా ఉండడం. అసలు లియో నేపథ్యం ఏంటి? సొంత కొడుకునే చంపాలని ఆంటోని, అతని సోదరుడు హెరాల్డ్‌ దాస్‌(అర్జున్‌) ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్తి, లియో ఒక్కరేనా? ఆంటోని గ్యాంగ్‌ నుంచి తన ఫ్యామిలిని కాపాడుకునేందుకు పార్తి ఏం చేశాడు? చివరకు ఏమైంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

లోకేష్ కనకరాజ్ టేకింగ్, మేకింగ్ కొత్తగా ఉంటుంది. ఖైదీ, విక్రమ్ సినిమాలతో లోకేష్ మీద అంచనాలు పెరిగాయి. అయితే లియో కోసం లోకేష్ కొత్త కథను ఏమీ ఎంచుకోలేదనిపిస్తుంది. గతాన్ని వీడి హాయిగా బతుకున్న గ్యాంగ్ స్టర్, రౌడీ జీవితంలోకి మళ్లీ గతం వస్తే ఎలా ఉంటుంది? అనే కథతో చాలానే చిత్రాలు వచ్చాయి. లియో ట్రైలర్ వచ్చినప్పుడు కూడా సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. ఏ హిస్టరీ ఆఫ్ వయలెన్స్, గాయం 2 సినిమాలను చూసినట్టుగా ఉంది.. అంటూ కామెంట్లు వినిపించాయి. అయితే లియో సినిమా టైటిల్స్ ప్రారంభంలోనే లోకేష్ ఏ హిస్టరీ ఆఫ్ వయలెన్స్ సినిమాకు క్రెడిట్ ఇచ్చాడు.

లియో.. లోకేష్‌ కగనరాజ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ, విక్రమ్‌ చిత్రాలతో దీనికి సంబంధం ఉండదు. ఖైదీలోని నెపోలియన్‌ పాత్ర, చివర్లో ‘విక్రమ్‌’(కమల్‌ హాసన్‌) నుంచి లియోకి ఫోన్‌ రావడం.. ఇవి మాత్రమే లోకేష్‌ కగనరాజ్‌ యూనివర్స్‌ నుంచి తీసుకున్నారు. మిగత స్టోరి అంతా డిఫరెంట్‌గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్‌ గత సినిమాల మాదిరే చాలా స్టైలీష్‌గా, రేసీ స్క్రీన్‌ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్‌ కంటే ఫ్యామిలీ ఎమోషన్‌ మీదనే ఎక్కువ దృష్టిపెట్టాడు.

ఓ ముఠా కలెక్టర్‌ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత హైనా(కృర జంతువు)ఫైట్‌ సీన్‌తో హీరో ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత పార్తి ఫ్యామిలీ పరిచయం.. భార్య, పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. అయితే ఫ్యామిలీ ఎపిసోడ్‌ కాస్త బోరింగ్‌ అనిపిస్తుంది. కాఫీ షాపులో యాక్షన్‌ ఎపిసోడ్‌ తర్వాత కథనం ఆసక్తికరంగా సాగుతుంది. పార్తి ఫోటో పేపర్‌లో చూసి ఆంటోని గ్యాంగ్‌ హిమాచల్‌ ప్రదేశ్‌కు రావడంతో కథపై మరింత ఆసక్తి పెరుగుతుంది. అసలు లియో ఎవరు? ఆంటోని నేపథ్యం ఏంటనే క్యూరియాసిటి ప్రేక్షకుల్లో పెరుగుతుంది. ఆంటోని, పార్తి తొలిసారి కలిసే సీన్‌ కూడా అదిరిపోతుంది. ఇంటర్వెల్‌ ముందు ఆంటోని, పార్తికి మధ్య వచ్చే ఛేజింగ్‌ సన్నివేశం అయితే హైలెట్‌. లియో నేపథ్యం ఏంటి? తండ్రి, కొడుకులను ఎందుకు వైరం ఏర్పడిదనేది సెకండాఫ్‌లో చూపించారు.

ద్వితీయార్దంలో లియో ఫ్లాష్ బ్యాక్ ఓకే అనిపిస్తుంది. ఆ తరువాత ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కోసం రాసుకున్న భారీ యాక్షన్ సీక్వెన్స్ బాగుంటుంది. ఖైదీ సినిమాలోని నెపోలియన్‌ను లియోకు తీసుకొచ్చి.. లింక్ కలిపిన విధానం బాగుంటుంది. నెపోలియన్ మరోసారి ఇందులో అదరగొట్టేశాడు. చివరకు లియోకి, విక్రమ్ (కమల్ హాసన్) కాల్ చేయడంతో నెక్ట్స్ పార్ట్ మీద హైప్ క్రియేట్ చేసేశాడు లోకేష్. అలా మొత్తంగా ఖైదీ, విక్రమ్‌ల రేంజ్‌లో లియో ఆకట్టుకోకపోయినా.. విజయ్ ఫ్యాన్స్‌కు మాత్రం పండుగలా ఉంటుంది. ఎల్‌సీయూలో భాగంగా వచ్చిన లియో లోకేష్ ఫ్యాన్స్‌ను మాత్రం అంతగా ఆకట్టుకోకపోవచ్చు. టెక్నికల్‌గా సినిమా హై స్టాండర్డ్‌లో అనిపిస్తుంది.

అనిరుధ్ మరోసారి తన మార్క్ చూపించాడు. ఈ సారి పాటలతో మెప్పించకపోయినా నేపథ్య సంగీతంతో అదరగొట్టేశాడు. అన్బరివ్ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, ఫిలమిన్ ఎడిటింగ్ అన్నీ కూడా బాగున్నాయి. నిర్మాణ పరంగా భారీగానే ఖర్చు పెట్టినట్టు కనిపిస్తోంది. చివరగా లియోని ఖైదీ, విక్రమ్‌లతో పోల్చకుండా చూస్తే మాత్రం మంచి ఫీలింగ్‌తో థియేటర్ నుంచి బయటకు రావొచ్చు.

లియో రివ్యూ
3.3
Acting 3.5 out of 5
Direction 3.5 out of 5
Music 3 out of 5
Production 3 out of 5
Share This Article
Leave a review