చిత్రం: స్కంద; నటీనటులు: రామ్, శ్రీలీల, సయీ మంజ్రేకర్, ప్రిన్స్ సిసిల్, శరత్ లోహితాశ్వ, దగ్గుబాటి రాజా, ప్రభాకర్, శ్రీకాంత్ తదితరులు; సంగీతం: ఎస్. తమన్; ఎడిటింగ్: తమ్మిరాజు; సినిమాటోగ్రఫీ: సంతోష్ దేటేక్; నిర్మాత: శ్రీనివాస చిట్టూరి, పవన్ కుమర్; రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను; విడుదల: 28-09-2023
మాస్ సినిమాలకి పెట్టింది పేరు బోయపాటి శ్రీను. ఆయన దర్శకత్వంలో రామ్ అనగానే ఆ కలయికపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. బోయపాటి మార్క్ సినిమాలో ఎనర్జిటిక్ హీరో రామ్ ఎలా కనిపిస్తాడో చూడాలనే ఉత్సుకత ఏర్పడింది. ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ తర్వాత ఆ స్థాయిలో అంచనాలకి తగ్గట్టుగానే పాన్ ఇండియా స్థాయిలో ‘స్కంద’ చేశారు బోయపాటి శ్రీను. మరి ఈ చిత్రం ఎలా ఉంది? రామ్ – బోయపాటి కలయిక మాస్ ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం..
ఆంధ్రా సీఎం కూతుర్ని తెలంగాణ సీఎం కొడుకు లేపుకుని పోవడంతో ‘స్కంద’ కథ మొదలౌతుంది. ఆంధ్రా సీఎం అంటే జగనూ.. తెలంగాణా సీఎం అంటే కేసీఆర్ కాదండోయ్.. బోయపాటి కథలో ఇక్కడ ఇద్దరు సీఎంలు విలన్లన్నమాట. తన కూతుర్ని లేపుకునిపోవడంతో.. తెలంగాణ సీఎం కొడుకుని లేపేయడానికి ఆంధ్రా సీఎం స్కెచ్‌లు వేస్తుంటాడు. ఈ ప్రాసెస్‌లో ధీరుడు వీరుడు సూరుడైన స్కంద (రామ్ పోతినేని)కి తన కూతుర్ని తీసుకొచ్చే బాధ్యతని అప్పగిస్తాడు ఆంధ్రా సీఎం. అయితే స్కంద ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా.. అటు ఆంధ్రా సీఎం కూతుర్నీ.. ఇటు తెలంగాణ సీఎం కూతురు (శ్రీలీల) లేపుకుని తన సొంత ఊరు రుద్రరాజ పురానికి తీసుకుని వస్తాడు. ఈ ఇద్దరు సీఎంలకు.. ఈ రుద్రరాజపురానికి లింక్ ఏంటన్నది ఒక ట్విస్ట్ అయితే.. ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది.
రుద్రరాజ పురానికి పెద్ద మణికంఠరాజు (దగ్గుబాటి రాజా). మణికంఠ రాజు కొడుకే స్కంద. అలాగే మణికంఠ రాజు ప్రాణ స్నేహితుడే రుద్రగంటి రామకృష్ణ రాజు (శ్రీకాంత్). ఇతను క్రౌన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈవోగా ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి.. లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని.. ఈ ఇద్దరు సీఎంలు అక్రమ కేసులో ఇరికించి ఉరి కంభం ఎక్కించబోతారు. ఇలాంటి పరిస్థితుల్లో తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం.. రామకృష్ణ రాజుని అతని కుటుంబాన్ని ‘స్కంద’ ఎలా కాపాడగలిగాడు. ఆ ఇద్దరు సీఎంలను ఎలా మట్టుపెట్టాడు అన్నదే మిగిలిన కథ.
మాస్ సినిమాకి చాలా నిర్వచనాలు ఉన్నాయి. అందులో బోయపాటి మాస్ ప్రత్యేకం. ఆయన శైలి మేకింగ్, పాత్రలతో ప్రత్యేకమైన బ్రాండ్‌ని సృష్టించుకున్నారు. శక్తిమంతంగా కనిపించే ఆయన హీరోలు సూపర్‌మేన్ తరహాలో వీరవిహారం చేస్తుంటారు. పాత్రలు నడుచుకునే తీరునీ, పోరాట ఘట్టాల్ని లార్జర్ దేన్ లైఫ్ తరహాలో తెరపై ఆవిష్కరించి మాస్‌కి అసలు సిసలు సినిమాటిక్ అనుభూతిని పంచుతుంటారు. ఆ నేపథ్యంలోనూ తను చెప్పాలనుకున్న విషయాన్ని మంచి భావోద్వేగాలతో చెబుతుంటారు ‘స్కంద’ సినిమాతోనూ అదే ప్రయత్నం చేశారు బోయపాటి. మాస్‌కి జాతరే ఈ సినిమా. రామకృష్ణంరాజు పాత్రతో సినిమాని మొదలుపెట్టిన దర్శకుడు, ఇద్దరు ముఖ్యమంత్రుల్ని, వాళ్ల సామ్రాజ్యాన్ని ఆవిష్కరించాక హీరోని పరిచయం చేస్తాడు. అక్కడ్నుంచి అసలు సినిమా మొదలవుతుంది. హీరో హీరోయిన్ల మధ్య కాలేజీ డ్రామా, పాటలు, యాక్షన్ ఘట్టాలు, ఆసక్తికరమైన మలుపులతో ప్రథమార్ధాన్ని నడిపించాడు దర్శకుడు. వర్తమాన రాజకీయాలు, ఉచిత పథకాలపై చురకలు వేస్తూ కొన్ని సన్నివేశాల్ని తీర్చిదిద్దారు.
భద్ర నుంచి అఖండ వరకూ బొయపాటు తొమ్మది సినిమాలు తీస్తే.. అందులో ఆరు బ్లాక్ బస్టర్ హిట్స్. అదీ బోయపాటి మార్క్ అంటే. ఆరంభంలో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన ఘనత బోయపాటికే దక్కింది. అవి కూడా అలాంటి ఇలాంటి హిట్స్ కాదు.. మాస్ ఆడియన్స్‌ని ఉర్రూతలూగించిన ఊర మాస్ చిత్రాలవి. అయితే స్కంద సినిమాలోనూ అదే స్థాయి మాస్ ఫీస్ట్ అందించే ప్రయత్నం చేశారు బోయపాటి. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో బోయపాటి మార్క్.. మాస్ ఆడియన్స్‌తో వీరంగం చేయిస్తాయి. కమర్షియల్ కిటుకులు బాగా తెలిసిన బోయపాటి.. మాస్ ఆడియన్స్‌కి గాలం వేయడంలో దిట్ట. అయితే స్కందలో కనిపించే ఊచకోత మాత్రం.. మాస్ ఆడియన్సే వామ్మో అనేట్టు చేశారు.
చంద్రబాబుతో బోయపాటికి ఉన్న సాన్నిహిత్యమో.. లేదంటే హీరో రామ్‌కి ఏపీ గవర్నమెంట్‌పై ఉన్న కోపమో తెలియదు.. ఇన్ డైరెక్ట్‌గా ఏపీ గవర్నమెంట్‌ని బాగానే కోకారు. ‘బూం.. బూం బీర్లు’పై సెటైర్లు కానీ.. ‘నిద్రపోతున్నవాడ్ని చంపడం నీకు అలవాటేమో.. లేపి చంపడం నాకు అలవాటు’, ‘ఇయ్యాలే.. పొయ్యాలే.. గట్టిగా అరిస్తే తొయ్యాలే.. అడ్డం వస్తే లేపాలే.. ఇప్పుడు సీఎంలు అయినవాళ్లు ఇలా అయినవాళ్లే కదా’.. అని హీరో చెప్పే డైలాగ్‌లు ఇన్ డైరెక్ట్‌గా గట్టిగా తగిలేట్టుగానే ఉన్నాయి.