‘సంక్రాతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ

Telugu BOX Office

నటీనటులు: విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరీ, ఐశ్వర్య రాజేశ్, వీకే నరేష్, వీటీ గణేష్, సాయి కుమార్, పమ్మి సాయి, సర్వదమన్ బెనర్జీ తదితరులు
దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాత: దిల్ రాజు
సినిమాటోగ్రఫి: సమీర్ రెడ్డి
ఎడిటర్: తమ్మిరాజు
మ్యూజిక్: భీమ్స్ సిసిరిలియో
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
రిలీజ్ డేట్: 2025-01-14


విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ అంటే చాలు ఆడియన్స్ భారీ అంచనాలు పెట్టేసుకుంటారు. ఎఫ్ 2, ఎఫ్ 3 తర్వాత ఈ కాంబినేషన్‌లో వచ్చిన మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాపై తొలి నుంచి మంచి అంచనాలున్నాయి. ఆడియో సూపర్ హిట్ కావడం, డిజిటల్ ప్రమోషన్స్ పెద్ద ఎత్తున చేయడంతో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది ? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం..

కథేంటి..
యాదగిరి దామోదర రాజు అలియాస్ యమ ధర్మరాజు (వెంకటేష్), భాగ్యలక్ష్మి (ఐశ్వర్య రాజేష్)లది హ్యాపీ ఫ్యామిలీ. గోదారిగట్టుపైనా రామచిలకవే అని భాగ్యాన్ని తెగ ప్రేమించేస్తుంటాడు రాజు. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన రాజు ఓ ఎన్ కౌంటర్ విషయంలో సస్పెషన్‌కి గురై.. పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి తప్పుకుంటాడు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చి తొలిచూపులోనే భాగ్యని ప్రేమించి పెళ్లి చేసుకుని బిందాస్‌గా బతికేస్తుంటాడు. అయితే తెలంగాణ సీఎం కేశవ్ (నరేష్) పెట్టుబడుల్ని ఆకర్షించే ఉద్దేశంతో దేశంలోనే నెంబర్ 1 కంపెనీ సీఈఓ అయిన సత్య ఆకేళ్ల (అవసరాల శ్రీనివాస్)‌ని హైదరాబాద్‌కి రప్పిస్తారు. అయితే అతడిని బీజూ పాండే కిడ్నాప్ చేస్తాడు. జైల్లో ఉన్న తన అన్న పాప పాండేని విడిపిస్తేనే సత్య ఆకేళ్లని విడుస్తాం లేదంటే చంపేస్తాం అని బెదిరిస్తాడు. ఈ విషయం బయటకు తెలిస్తే.. ప్రభుత్వం పరువుపోతుందని సీక్రె‌ట్ ఆపరేషన్ చేపడతారు సీఎం కేశవ. పోలీసులకు, ప్రభుత్వానికి సవాల్‌గా మారిన ఈ క్రైమ్ అండ్ కిడ్నాప్ కేసుని రాజు మాత్రమే ఛేదించగలడని నమ్మి.. అతని సస్పెన్షన్‌ను ఎత్తి వేసి నేరస్థులను పట్టుకునే బాధ్యతను రాజుకి అప్పగిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది..? అసలు ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్‌తో కథకు లింక్ ఏంటి అనేది స్క్రీన్ మీద చూడాలి..

ఎలా ఉంది…
సినిమా కథ విషయానికి వస్తే.. పాత కథనే కొత్త సీసాలో పోసిన రెగ్యులర్, రొటీన్ కమర్షియల్ పాయింట్. కాకపోతే తనదైన శైలిలో హస్యాన్ని జోడించడంలో దిట్ట అయిన అనిల్ రావిపూడి అదే ట్రీట్‌‌‌‌మెంట్‌తో చెలరేగిపోయాడు. కొన్నిసార్లు జంధ్యాల మార్కు కామెడీ కనిపిస్తే.. మరికొన్ని సార్లు పక్కా జబర్దస్త్ సీన్లను గుర్తు చేస్తుంది. అయితే వెంకీ మామ ఇమేజ్.. ఆయనకు ఉన్న ఫ్యామిలీ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఓ మీటర్‌లో రాసుకొన్న సన్నివేశాలు హిలేరియస్ హాస్యాన్ని పండించాయి. ఎంటర్‌టైన్‌‌మెంట్‌తోపాటు యాక్షన్ జోడించి సంక్రాంతి పండుగ సంబరాన్ని సినీ అభిమానులకు పంచాడనే చెప్పాలి.

ఎవరెలా నటించారంటే..
నటీనటుల విషయానికి వస్తే.. వెంకటేష్‌కు రాజు క్యారెక్టర్ టైలర్ మేడ్ రోల్. అనాథగా, ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా, మాజీ ప్రియుడిగా, బాధ్యాతయుతమైన భర్త, తండ్రి, కొడుకుగా ఇలా రకరకాల షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. తనదైన మేనరిజం, బాడీ లాంగ్వేజ్‌లో మరోసారి ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఎంటర్‌టైన్‌మెంట్ రూపంలో ఫుల్ మీల్స్ అందించాడు. ప్రత్యేకించి బుల్లిరాజు పాత్రలో నటించిన పిల్లాడు యాక్టింగ్ అదిరిపోయింది. ఫస్టాఫ్‌లో ఒకటీరెండు సీన్లు బాగా పండాయి. సేమ్, సెకండాఫ్‌‌లోనూ ఇంకాస్త పదునైన సీన్లు రెండు పడి ఉంటే సినిమా ఇంకాస్త రేంజ్ పెరిగేది. తెలుగు అమ్మాయి ఐశ్వర్య రాజేష్‌ని తెలుగు సినిమా ఇన్నాళ్లూ సరిగ్గా వాడుకోలేదనిపిస్తుంది. తనకు అనుగుణమైన పాత్ర పడితే దంచేయగలదు. అమాయకురాలైన భార్య పాత్రలో మెప్పించింది. ‘లక్కీ భాస్కర్’ హిట్‌తో ఫామ్‌లో ఉన్న మీనాక్షి చౌదరి ఇందులోనే చెలరేగిపోయింది. అటు నటన, ఇటు అందచందాలతో మెప్పించింది. ఇక పమ్మీ సాయి, వీటీ గణేష్, వీకే నరేష్ తదితరులు హాస్యంతో ఆకట్టుకొన్నారు. గోదావరి యాసలో పమ్మిసాయి.. కథను మలుపు తిప్పే పాత్రలో గణేష్ నవ్వుల్లో ముంచెత్తుతారు. మిగతా క్యారెక్టర్లలో నటించిన ప్రతీ ఒక్కరు తన మార్కును చూపించుకొన్నారు. మొత్తానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ సంక్రాంతి హిట్టు కొట్టేశాడు అనిల్ రావిపూడి.

Share This Article
Leave a comment