రివ్యూ: భగవంత్ కేసరి

భ‌గ‌వంత్ కేస‌రి... చానా ఏళ్లు యాదుంటాడు

Telugu BOX Office
Highlights
భ‌గ‌వంత్ కేస‌రి... చానా ఏళ్లు యాదుంటాడు
3.6

చిత్రం: భగవంత్‌ కేసరి; నటీనటులు: బాలకృష్ణ, కాజల్‌ అగర్వాల్‌, శ్రీలీల, అర్జున్‌ రాంపాల్‌, ప్రియాంక జవాల్కర్‌, ఆర్‌.శరత్‌కుమార్‌, రఘుబాబు, జాన్‌ విజయ్‌, వీటీవీ గణేష్‌ తదితరులు; సంగీతం: ఎస్‌. తమన్‌; సినిమాటోగ్రఫీ: సి.రామ్‌ ప్రసాద్‌; ఎడిటింగ్‌: తమ్మిరాజు; నిర్మాత: సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది; బ్యానర్‌: షైన్‌ స్క్రీన్స్‌; రచన, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి; విడుదల: 19-10-2023

అనిల్ రావిపూడి ఫన్ డైరెక్టర్.. బాలయ్య బాబు ఊరమాస్.. వీళ్లిద్దరి కాంబోలో సినిమా అంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే. మాస్ ఆఫ్ గాడ్‌ లాంటి బాలయ్యని మరీ ఫన్ అండ్ ఫస్ట్రేషన్‌‌కి గురిచేస్తే.. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది పెద్ద టాస్క్. అందులోనూ బాలయ్య బాబుకి కత్తి ఇచ్చి వీరంగం చేయమంటే విధ్వంసం సృష్టించే రకం. అలాంటిది కామెడీగా.. కామెడీ చేయిస్తే ఆడియన్స్‌కి రుచిస్తుందా? అందుకే ‘భగవంత్ కేసరి’తో అటు ఫన్‌ని ఇటు యాక్షన్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ యాక్షన్ ఎంటర్టైన్మెంట్‌ను అందించే ప్రయోగం చేశారు. గురువారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది.. ప్రేక్షకులను మెప్పించిందా?

క‌థేంటంటే: నేల‌కొండ భ‌గ‌వంత్ కేస‌రి (బాల‌కృష్ణ) అడ‌వి బిడ్డ. ఓ కేసులో జైల్లో శిక్ష అనుభ‌విస్తున్నప్పుడు జైల‌ర్ (శ‌ర‌త్‌కుమార్‌) కూతురు విజ‌య‌ల‌క్ష్మి అలియాస్ విజ్జి పాప (శ్రీలీల‌)తో అనుబంధం ఏర్పడుతుంది. విజ్జిపాప‌ని ఆర్మీలో చేర్చాల‌నేది త‌న తండ్రి క‌ల. అనుకోకుండా జైల‌ర్ మ‌ర‌ణించ‌డంతో విజ్జిపాప బాధ్యత‌ల్ని భ‌గ‌వంత్ కేస‌రి తీసుకుంటాడు. ఆమెని ఓ సింహంలా త‌యారు చేయాల‌ని నిర్ణయిస్తాడు. ఆ ప్రయ‌త్నం ఎలా సాగింది?.. సైకాల‌జిస్ట్ కాత్యాయ‌ని (కాజ‌ల్) ఎలా సాయం చేసింది? ఇంత‌కీ భ‌గ‌వంత్ కేస‌రి జైలుకి ఎందుకు వెళ్లాడు?.. ఆయ‌న గ‌త‌మేమిటి?.. రాజ‌కీయ నాయ‌కుల్ని త‌న గుప్పెట్లో పెట్టుకుని ప్రాజెక్ట్ వి కోసం ప్రయ‌త్నాలు చేస్తున్న బిలియ‌నీర్ రాహుల్ సంఘ్వీ (అర్జున్ రాంపాల్‌)తో ఉన్న వైరం ఏమిట‌నేది మిగ‌తా క‌థ‌.

బాలయ్య సినిమా అంటే.. ఫ్యాక్షన్ డ్రామా.. ఓ ఫ్లాష్ బ్యాక్.. రివేంజ్.. ఫ్యామిలీ సెంటిమెంట్.. ఈ ఊర మసాలా దినుసులు రోట్లో వేసి దంచినట్టుగా తిప్పి తిప్పి ఒకే కథని వివిధ కోణాల్లో చూపిస్తుండటం దర్శకులకు కామన్ అయిపోయింది. అయితే ఈసారి బాలయ్య బాబు రూటు మార్చారు. కత్తిపట్టి నరికితే మీకు అలుపొస్తుందేమో.. నాకు ఊపొస్తుందని ఊచకోత కోసే బాలయ్య.. భగవంత్ కేసరిగా ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్ మోడ్‌లోకి దిగినా.. ఊచకోత మాత్రం కామనే.

అగ్ర హీరోల‌తో సినిమా అన‌గానే ద‌ర్శకులు చాలా వ‌ర‌కు సేఫ్ గేమ్ ఆడ‌టానికే ప్రయ‌త్నిస్తుంటారు. ఆ హీరోల తాలూకు ఇమేజ్‌ని వాడుకుంటూ అభిమానుల్ని మెప్పిస్తే చాల‌న్నట్టుగా ఫార్ములా సినిమాలు తీయ‌డానికే మొగ్గు చూపుతుంటారు. కానీ, యువ ద‌ర్శకుడు అనిల్ రావిపూడి ‘భ‌గ‌వంత్ కేస‌రి’తో ఓ కొత్త ప్రయ‌త్నం చేశాడు. ఆడ‌బిడ్డని సింహంలా త‌యారు చేయాలి అనే విష‌యాన్ని బాల‌కృష్ణ లాంటి ఓ అగ్ర క‌థానాయ‌కుడితో చెప్పించారు. నేటి స‌మాజానికి చాలా అవ‌స‌ర‌మైన గుడ్ ట‌చ్ బ్యాడ్ ట‌చ్ వంటి కీల‌క‌మైన అంశాన్ని స్పృశిస్తూ శ‌క్తిమంత‌మైన సినిమా మాధ్యమం బాధ్యత‌ని చాటి చెప్పారు. ఇలాంటి విష‌యాలు స్టార్ హీరోల సినిమాల‌తో చ‌ర్చకొస్తే ఆ ప్రభావం వేరుగా ఉంటుంది. ఆ విష‌యంలో క‌థానాయ‌కుడు బాల‌కృష్ణని అభినందించాల్సిందే. అలాగ‌ని ఈ సినిమా సందేశాల‌కే ప‌రిమితం కాలేదు. అభిమానుల్ని, కుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించే హీరోయిజం, భావోద్వేగాల్ని జోడించి వినోదం పంచుతుంది. క‌థ‌లో లీనం చేయ‌డానికి కాస్త స‌మ‌యం తీసుకున్నారు ద‌ర్శకుడు. బాల‌కృష్ణ, శ్రీలీల క‌లిసిన‌ప్పట్నుంచి క‌థ‌లో వేగం పెరుగుతుంది. చిచ్చా, బిడ్డా అంటూ ఆ ఇద్ద‌రూ క‌లిసి చేసిన సంద‌డి సినిమాకి హైలైట్‌.

బాల‌కృష్ణ భిన్న కోణాల్లో సాగే పాత్రలో క‌నిపిస్తారు. ఆయ‌న న‌ట‌న, లుక్ సినిమాకి హైలైట్‌. తెలంగాణ యాస‌లో ఆయ‌న చెప్పిన సంభాష‌ణ‌లు కూడా ఆక‌ట్టుకుంటాయి. ఇందులో పోరాట ఘ‌ట్టాలు కూడా ఇదివ‌ర‌క‌టి సినిమాల్లాగా కాకుండా స‌హ‌జంగా ఉంటాయి. శ్రీలీల‌కి ద‌క్కిన ఓ మంచి అవ‌కాశాన్ని ప‌క్కాగా స‌ద్వినియోగం చేసుకుంది. భావోద్వేగ స‌న్నివేశాల్లోనూ, యాక్షన్ ఘ‌ట్టాల్లోనూ ఆమె ప్రతిభ ఆక‌ట్టుకుంటుంది. ప‌తాక స‌న్నివేశాల‌తో మ‌రింత‌గా క‌ట్టిప‌డేసింది. రాహుల్ సాంఘ్వీ పాత్రలో అర్జున్ రాంపాల్ న‌ట‌న మెప్పిస్తుంది. కాజ‌ల్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేక‌పోయినా బాల‌కృష్ణకి త‌గిన జోడీ అనిపించుకుంటుంది.

అనిల్ రావిపూడి టేకింగ్ మాత్రం అదిరిపోయింది.. రిచ్ నెస్ రావాలంటే.. ఫారిన్ కంట్రీస్ చుట్టిరావాల్సిన పనిలేదని చూపించారు. హైదరాబాద్ సిటీని చాలా అందంగా చూపించారు. విలన్ ఉండే ప్యాలెస్ అయితే ఫారిన్ కంట్రీస్‌ని గుర్తు చేసింది. తెలంగాణ భవన్, అసెంబ్లీ, ట్యాంగ్ బండ్, అంబేద్కర్ భారీ విగ్రహం.. ఇలా ఏ ఒక్క లొకేషన్‌ని వదిలిపెట్టలేదు. చాలా సుందరంగా చూపించారు. సి. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అయ్యింది. తమన్ మ్యూజిక్ పర్వాలేదు.. మొత్తం సిట్యువేషనల్ సాంగ్సే కాబట్టి.. మూడు పాటలూ కూడా ఆహా ఓహో అని అనిపించినట్టుగా అయితే లేవు.

భ‌గ‌వంత్ కేస‌రి... చానా ఏళ్లు యాదుంటాడు
3.6
Acting 4 out of 5
Direction 3.5 out of 5
Music 3.5 out of 5
Production 3.4 out of 5
Overall Movie 3.5 out of 5
Share This Article
Leave a review