ఒంగోలు నియోజకవర్గ చరిత్రలో కనీవినీ ఎరుగని విజయాన్ని తెదేపా అభ్యర్థి దామచర్ల జనార్దన్ సొంతం చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత… ఒంగోలులో ఎన్నడూ లేనంత ఆధిక్యం సాధించారు. వైసీపీకి చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఏకంగా 34,026 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2012లో బాలినేని 27 వేల ఓట్లు మెజార్టీతో గెలవగా… తాజాగా జనార్దన్ దానిని అధిగమించారు. నగరంతో పాటు… ఒంగోలు రూరల్, కొత్తపట్నం, మండలాల్లోని దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఆయనకు మెజార్టీ లభించింది.
అయితే కొత్తపట్నంలో తమకు మంచి మెజార్టీ వస్తుందని వైసీపీ నాయకులు వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. పోలింగ్ ముందు రోజున పలు ప్రాంతాల్లో వైకాపా నాయకులు తాయిలాలు పంచి ప్రలోభాలకు గురిచేసినా… ఓటర్లు మాత్రం విస్పష్ట తీర్పు చెప్పారు. వృత్తి, ఉద్యోగ రీత్యా దేశ విదేశాల్లో స్థిరపడిన వారు సైతం వ్యయప్రయాసలను లెక్కచేయకుండా వచ్చి… గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించి మరీ ఓటేయడం విశేషం. తాజా విజయంతో తెదేపా శ్రేణుల్లో జోష్ నెలకొంది.