తెలుగుదేశం కూటమి కోసం ప్రచారం చేయడానికి విదేశాల నుంచి ఎన్నారైలకు ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ‘మీ కృషి ఎనలేనిది’ అని కొనియాడారు. ఇక ముందు తనలో పూర్తిగా మారిన చంద్రబాబును చూస్తార ని వ్యాఖ్యానించారు. పార్టీపై అభిమానంతో ప్రచారం చేసిన ప్రవాసాంధ్రులు ఎన్నికల అనంతరం విదేశాలకు వెళ్లే ముందు మంగళవారం రాత్రి మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా వారి గౌరవార్థం ఎన్‌ఆర్‌ఐ గ్రాట్యుటీ డిన్నర్ ఏర్పాటుచేశారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చంద్రబాబు వీడియో కాల్‌లో మాట్లాడారు. మాతృభూమిపై మమకారంతో సప్త సముద్రాలు దాటి వచ్చి పార్టీ కోసం పని చేశారని కొనియాడారు. ముఖ్యమంత్రిగా తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత విదేశాల నుంచి వచ్చిన ప్రవాసాంధ్రులు తనను కలుసుకోవడానికి ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెడతానన్నారు. విదేశాలలోని ప్రవాసాంధ్రులు ప్రతి ఒక్కరు తమ వంతుగా సంవత్సరానికి ఐదుగురు యువకులకు ఉద్యోగాలు కల్పించి, వీసా ఇప్పించడానికి ముందుకు రావడం కీలక అధ్యాయమని ప్రశంసించారు.
గడచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఐల గురించి పట్టించుకోకపోవడంతో వారి ద్వారా రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు ఆగిపోయాయని చంద్రబాబు అన్నారు. గల్ఫ్ దేశాల్లోని ఎన్‌ఆర్‌ఐలు ప్రమాదం బారిన పడితే రూ.ఒక లక్ష, ప్రమాదవశాత్తు చనిపోతే రూ.10 లక్షలు, అక్కడ వారికి ఏదైనా న్యాయ సమస్యలు తలెత్తితే రూ.50 వేల వరకు అందేలా ఆనాడు టీడీపీ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. నాడు టీడీపీ ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఐల కోసం చేపట్టిన కార్యక్రమాలను వైసీపీ ప్రభత్వం రద్దు చేసిందని, ఎన్డీయే కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే వాటన్నింటినీ పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.
ఏపీ భవిష్యత్తు కోసమే తాము కుటుంబసభ్యులతో సహా స్వచ్ఛందంగా తరలివచ్చి ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నామని పలువురు ఎన్‌ఆర్‌ఐలు తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని, కూటమి గెలుపు ఏపీకి మలుపు కాబోతుందని వ్యాఖ్యానించారు. పార్టీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ప్రచారం చేసిన తీరును ఎన్నారై విభాగం అధ్యక్షుడు వేమూరి రవి వివరించారు. వాస్తవానికి వీరందరికీ విందు ఏర్పాటు చేసి చంద్రబాబు స్వయానా కలవాల్సి ఉంది. అయితే వారాణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమానికి వెళ్లిన ఆయన తిరిగి రావడంలో ఆలస్యం కావడంతో రాలేకపోయినట్టు రాధాకృష్ణ తెలిపారు. ఈ సమావేశంలో గుంటూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు పార్టీ ప్రవాసీ ప్రముఖులు కోమటి జయరాం, వెంకట్ కోడూరి, సురేశ్ మాలపాటి, మల్లిక్ మేడరమట్ల తదితరులు పాల్గొన్నారు.