2021 నవంబర్ 19.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా తెలుగు దేశం పార్టీ అధినేత, అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా చేసిన శపథం గుర్తు ఉండే ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలవేళ మళ్లీ తెరపైకి వచ్చింది. ‘అసెంబ్లీ సాక్షిగా నా భార్యను అవమానించారు.. నన్ను ఇష్టం వచ్చినట్లు దూషించారు… మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీకి వస్తా.. ఇది కౌరవ సభ.. గౌరవ సభ కాదు.. ఇలాంటి కౌరవ సభలో నేను ఉండను.. ప్రజలందరూ నా అవమానాన్ని అర్థం చేసుకోమని కోరుతున్నా’ అంటూ అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రెస్‌మీట్‌లో భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. చేసిన శపథాన్ని మరిచిపోకుండా 2021 నుంచి ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టలేదు.
కాలం గిర్రున తిరిగింది. సరిగ్గా మూడేళ్ల తర్వాత చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. 2021 నవంబర్ 19న జరిగిన ఈ ఘటనను తెలుగు తమ్ముళ్లు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల వేళ గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు శపథం చేసి మరీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారని ఖుషీ అవుతున్నారు. వైసీపీ నేతలు చేసిన అవమానంతో చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాన్ని తాము ఇప్పటికీ మరిచిపోలేదంటూ కొందరు ట్వీట్లు చేస్తున్నారు. ఏపీ ఎన్నికల ఫలితాల వేళ అప్పట్లో అసెంబ్లీలో చంద్రబాబు శపథం చేసి బయటకు వస్తున్న వీడియోను షేర్ చేస్తున్నారు. దటీజ్ చంద్రబాబు.. శపథం చేసి మళ్లీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి వెళ్లబోతున్నారు.. ఎంతో ఆనందంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.
2021 నవంబర్ 19న.. రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరిగింది.. ఆ సమయంలో అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో స్పీకర్ మైక్ కట్ చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యులు తన భార్యను అవమానించేలా మాట్లాడారని భావోద్వేగానికి గురయ్యారు. తన సుధీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడు, ఎవ్వరినీ అవమానించేలా మాట్లాడలేదన్న చంద్రబాబు… అధికారం ఉందని విర్రవీగలేదని, అధికారం పోయినప్పుడు కుంగిపోలేదని అన్నారు. తాను మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేసిన ఆయన తన శపథాన్ని నెరవేర్చుకుని గర్వంగా అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు.