గెలిపించండి.. ఆశీర్వదించండి.. నియోజకవర్గంలో సమస్య అనేది కనిపించకుండా కుప్పంతో పోటీపడి మంగళగిరిని అభివృద్ధి చేసే బాధ్యత తనదని టీడీపీ అభ్యర్ధి నారా లోకేశ్ అన్నారు. రాజధాని గ్రామమైన నిడమర్రు, మంగళగిరి పట్టణంలోని 8, 9 వార్డుల్లో గురువారం రాత్రి లోకేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత ఎన్నికల్లో ఇదే గ్రామంలో తనకు చాల తక్కువ ఓట్లు వచ్చాయని గుర్తుచేశారు. అప్పట్లో ఆళ్ల రామకృష్ణారెడ్డికి నిడమర్రు గ్రామస్తులు మంచి మెజారిటీని ఇచ్చి గెలిపిస్తే గ్రామాన్ని ఆయన చాల నిర్లక్ష్యం చేశాడన్నారు. నిడమర్రుకు వచ్చే దారులన్నీ గుంతలమయంగా ఉన్నాయని… గుంతల్లో రోడ్డెక్కడో వెతుక్కోవాల్సిన దుస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. గ్రామంలో డ్రైనేజి సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఆపదల్లో ఆదుకుంటాడని భావించి ఓట్లేసిన ప్రజలను ఆపదల పాల్జేసిన ఘనత కరకట్ట కమలహాసన్దేనన్నారు.
నిడమర్రు చెరువు పోరంబోకు భూముల్లో నివాసం ఉంటున్న ప్రజల ఇళ్లను కూలదోయించేందుకు ఎమ్మెల్యే ఆర్కే బుల్డోజర్లను పంపిస్తే తాను బాధితుల పక్షాన హైకోర్టులో పోరాడి కూల్చివేతలను అడ్డుకున్నానని గుర్తుచేశారు. గత ఎన్నికల్లో తాను ఓటమి పాలైనా 29 రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తన సొంత నిధులతో అమలు చేసి ప్రజలకు అండగా నిలిచానని గుర్తుచేశారు. గత 25 ఏళ్లపాటు అధికారంలో కొనసాగిన మురుగుడు హనుమంతరావు కుటుంబం కానీ, కరకట్ట కమలహాసన్ కానీ తాను చేసిన ప్రజాసేవలో కనీసం పదోవంతు చేయలేకపోయారని లోకేష్ విమర్శించారు.
రాజధాని అమరావతిని సర్వనాశనం చేశారని.. ఈ పాపంలో సీఎం జగన్కు, ఎమ్మెల్యే ఆళ్లకు భాగస్వామ్యం ఉందన్నారు. సీఎం జగన్ విశాఖలో తానొక్కడే బతికేందుకు రూ. 500 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుచేసి ప్యాలెస్ కట్టుకున్నాడని.. అవే నిధులను మంగళగిరిలో ఖర్చు చేసి ఉంటే ప్రతీ పేద కుటుంబానికి ఇల్లు, సురక్షితమైన తాగునీరు వచ్చి ఉండేదన్నారు. మంగళగిరి అభివృద్ధికి జగన్ రూ.1200 కోట్లు ఇస్తానని చెప్పి కనీసం రూ.12 కోట్లు ఇవ్వలేదని చెప్పిన ఆర్కే.. వైసీపీకి రాజీనామా చేసి మళ్లీ ప్యాకేజీ తీసుకుని వెనక్కి వచ్చాడన్నారు. మంగళగిరిలో ఓట్ల కొనుగోలు కోసం జగన్ రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నాడన్నారు. ఓటుకు నాలుగు వేల నుంచి పదివేల రూపాయల వరకు పంపిణీ చేస్తున్నట్టు సమాచారం వస్తుందన్నారు. ఆ డబ్బంతా మన ప్రజలదేనని.. నిరభ్యంతరంగా ప్రజలు ఆ డబ్బును తీసుకుని ఓటు మాత్రం తనకే వేయాలన్నారు.