సొంతూళ్లకు క్యూ కట్టిన ఏపీ ప్రజలు.. ఆర్టీసీకి చంద్రబాబు లేఖ

Telugu BOX Office

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఎక్కడెక్కడో సెటిలైన ఆంధ్రప్రదేశ్ వాసులు తరలివెళ్తున్నారు. ఎన్నికల పండుగలో పాల్గొనేందుకు సొంతూర్లకు వెళ్తున్న వారితో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. అలాగే సొంత వాహనాల్లో ఊర్లకు వెళ్తున్న వారితో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద సందడి నెలకొంది. బస్సులు, రైళ్లల్లో సీట్లు దొరక్క ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

ఇదే సమయంలో ఏపీఎస్ ఆర్టీసీ రిజర్వేషన్ వెబ్ సైట్లోనూ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. రిజర్వేషన్ కోసం ఎక్కువ మంది ప్రయత్నిస్తుండటంతో సర్వర్ మొరాయిస్తోంది. శనివారం ఉదయం నుంచే ఈ సమస్య తలెత్తటంతో టికెట్లు బుక్ చేసుకునేందుకు ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

మరోవైపు ప్రయాణికుల ఇబ్బందులు, ఏపీఎస్ఆర్టీసీ రిజర్వేషన్ వెబ్ సైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తిన అంశం తన దృష్టికి రావటంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. దీనిపై ఆర్టీసీ ఎండీ తిరుమలరావుకు లేఖరాశారు. ఎన్నికల్లో ఓటు వేసేందుకు వస్తున్న ఏపీవాసుల కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని చంద్రబాబు లేఖలో కోరారు. ఆర్టీసీ బస్సులను పెంచాలని.. దాని ద్వారా పోలింగ్ శాతం కూడా పెరుగుతుందన్నారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఏపీకి భారీగా ఓటర్లు వచ్చే అవకాశం ఉందని.. అదనపు బస్సులు ఏర్పాటు చేయడం వారికి ఉపయోగపడుతుందని లేఖలో పేర్కొన్నారు.

మరోవైపు ఇప్పటికే హైదరాబాద్, విజయవాడ బస్టాండులలో ప్రయాణికుల రద్దీ కనిపిస్తోందన్న చంద్రబాబు.. బస్సుల కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఏపీఎస్ఆర్టీసీ అవసరమైనన్ని అదనపు బస్సులను అందుబాటులోకి తేవాలని కోరారు. ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మూడు రోజులు పాటు అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ తిరుమలరావును చంద్రబాబు లేఖ ద్వారా కోరారు.

Share This Article
Leave a comment