Nara Lokesh: తండ్రికి తగ్గ తనయుడు .. టీడీపీ భవిష్యత్తుకు ఢోకా లేదు

Telugu BOX Office

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి తనయుడిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన నారా లోకేశ్.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా.. పార్టీలో కీలక స్థానంలో ఉన్నారు. రెండేళ్లపాటు చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేసిన లోకేశ్.. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2024లోనూ ఆయన మంగళగిరి నుంచే బరిలో నిలిచారు.

1983 జనవరి 9న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు ప్రమాణ స్వీకారం చేయగా.. అదే నెల 23వ తేదీన చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులకు నారా లోకేశ్ జన్మించారు. స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తి చేసిన లోకేశ్.. అంతకు ముందు కార్నెగీ మెలన్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ పట్టా అందుకున్నారు. చదువు పూర్తయ్యాక లోకేశ్ కొంత కాలం వరల్డ్ బ్యాంక్‌లో పని చేశారు. ఇండియా తిరిగొచ్చాక 2008 నుంచి 2013 వరకు హెరిటేజ్ సంస్థలో పని చేశారు.

తెలుగుదేశం పార్టీ ద్వారా నారా లోకేశ్ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. టీడీపీ 2009 ఎన్నికల మేనిఫెస్టోలో నగదు బదిలీ పథకాన్ని చేర్చింది. ఇది నారా లోకేష్ ఆలోచనగా చెబుతారు. అప్పటి నుంచి టీడీపీ కార్యక్రమాల్లో ఆయన భాగం అయ్యారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా 2013 నుంచి లోకేశ్ టీడీపీ కోసం పనిచేస్తున్నారు. మొదట్లో ఆయన తెలుగు మాట్లాడే విషయంలో తడబడినప్పటికీ.. అనతి కాలంలోనే ఆయన మెరుగయ్యారు.

2017 మార్చి 30న నారా లోకేశ్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకే.. ఏప్రిల్ 2న మంత్రి పదవి వర్గంలోకి అడుగుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల బాధ్యతల్ని ఆయన నిర్వర్తించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఐటీ కంపెనీలను తీసుకొచ్చేందుకు నారా లోకేశ్ కృషి చేశారు. పరిపాలనలో సృజనాత్మకత, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేవారికి అందించే అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ పురస్కారాన్ని లోకేశ్ అందుకున్నారు.

2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేశ్.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేతిలో 5,337 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మంత్రిగా పని చేసిన లోకేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో ఓడిపోవడం టీడీపీ వర్గాలను విస్మయానికి గురి చేసింది. అయితే 2023 మార్చి 29 వరకు ఆయన ఎమ్మెల్సీగా కొనసాగారు. ఈసారి పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలన్న సంకల్పంతో 2023 జనవరి 27న యువగళం పేరిట నారా లోకేశ్ పాదయాత్ర ప్రారంభించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో పాదయాత్ర మొదలుపెట్టిన ఆయన.. విశాఖ జిల్లా అగనంపూడి వద్ద ముగించారు. 226 రోజుల పాటు పాదయాత్ర చేసిన లోకేశ్.. 3,132 కిలోమీటర్లు నడిచారు.

ఎన్నికల సీజన్ మొదలయ్యాక ఓ వైపు చంద్రబాబు, మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని హోరెత్తిస్తుండగా లోకేష్ కొద్ది రోజులు మంగళగిరికే పరిమితమయ్యారు. దీనిపై వైసీపీ నేతలు ఎన్నో విమర్శలు చేశారు. కన్న పుత్రుడి మీద నమ్మకం లేకే చంద్రబాబు దత్తపుత్రుడిని నమ్మకున్నాడంటూ ఎద్దేవా చేశారు. అయితే మరికొద్ది రోజుల్లో ప్రచారం ముగుస్తుందనగా జూలు విదిల్చిన సింహంలా నారా లోకేష్ దూకుడు పెంచారు. యువత, మహిళలను లక్ష్యంగా చేసుకుని యువగళం పేరుతో ఎన్నో సభలు నిర్వహించారు. వారితో నేరుగా కనెక్ట్ అవుతూ వారి ప్రశ్నలకు ఆకట్టుకునేలా సమాధానాలు చెప్పుకొచ్చారు. ఈ రాష్ట్రం మళ్లీ బాగుపడాలంటే చంద్రబాబే దిక్కని వారికి అర్ధమయ్యేలా వివరించారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి 164 స్థానాలు దక్కించుకోగానే అందరూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ని ఆకాశానికెత్తేస్తున్నారు గానీ.. చెప్పాలంటే వారికంటే ముందే ఎన్నికల బరిలోకి దిగి శ్రేణులను సమాయత్తం చేసిన లోకేషే. అంతేకాదు కూటమి కచ్చితంగా 160కి పైగా సీట్లు సాధిస్తుందని ముందునుంచీ ఆయన ధీమా వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఆయన చెప్పినట్లుగానే టీడీపీ-జనసేన- బీజేపీ కూటమి కనీవినీ ఎరుగని రీతిలో 164 స్థానాల్లో విజయ దుందుభి మోగించింది. పార్టీని గెలిపించుకోవడమే కాకుండా మూడు దశాబ్దాలుగా టీడీపీకి అందని ద్రాక్షలా మారిన మంగళగిరి నియోజకవర్గం నుంచి 90వేలకు పైగా మెజార్టీతో గెలుపొంది సరికొత్త చరిత్ర సృష్టించారు. మొన్నటివరకు పప్పు అంటూ ఎగతాళి చేసిన వారితోనే ఆయన పప్పు కాదు ఫైర్ అని ప్రశంసలు అందుకుంటున్నారు లోకేష్. ఈ ఎన్నికల ద్వారా టీడీపీ భవిష్యత్తు నారా లోకేష్ చేతిలో భద్రంగా ఉంటుందని పార్టీ కార్యకర్తలు కాలరెగరేసుకుంటూ చెప్పుకుంటున్నారు.

 

Share This Article
Leave a comment