ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ముఖ్యపార్టీల నేతలు ఎన్నికల ప్రచారాలతో ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. అయితే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలుపు కోసం ఇటీవల జబర్దస్త్ కమెడియన్స్, మెగా హీరోలు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. తాజాగా పవన్ కల్యాణ్ గెలుపు కోసం ఏకంగా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే మంగళవారం ట్విట్టర్ వేదికగా జనమే జయం అని నమ్మే జనసేనానిని గెలిపించండని ఓ వీడియో విడుదల చేశారు.
‘పవన్ కల్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన, అందరికీ మంచి చేయాలనే విషయంలో ముందు ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కల్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కల్యాణ్ తన సొంత సంపాదనను కాదని, కవులు రైతుల కన్నీరు తూడిచిపెట్టడానికి ఖర్చుపెట్టడం, జవాన్, కార్మికుల లాంటి వారికి సాయం చేస్తాడన్నారు. తను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడే కదా ప్రజలకు కావాల్సింది’ అని చెప్పారు.
సినిమాలోకి పవన్ బలవంతంగా వచ్చాడని, రాజకీయంలోకి మాత్రం ఇష్టంతోనే వచ్చాడని చిరు అన్నారు. ఏ తల్లికైన తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది, అలాగే ఏ అన్నకు అయిన తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాదేస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. అలా బాధపడుతున్న తల్లికి అన్నయ్యగా ఓ మాట చెప్పారన్నారు. ‘నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం, వారి బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం ఇది మన బాధ కంటే అది ఎంతో గొప్పది’ అని చెప్పారన్నారు.
జనం కోసం జన సైనికుడు అయ్యాడని, తను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయానికి అంకితం చేసిన శక్తి పవన్ కల్యాణ్ అని చిరంజీవి కొనియాడారు. ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్ కోసం ఆ శక్తిని వినియోగించాలంటే.. చట్ట సభల్లో అతడి గొంతు వినాలన్నారు. జనమే జయం అని నమ్మే జనసేనాని, పిఠాపురం ప్రజలు కల్యాణ్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అండగా నిలబడుతాడని, పిఠాపురం ప్రజల కలలను నిజం చేస్తాడని గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. చిరంజీవి వీడియోను జనసైనికులు తెగ వైరల్ చేస్తున్నారు. తమ్ముడు కోసం అన్నయ్య.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.