ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగియడంతో రాజకీయ పార్టీలు మేధోమథనం ప్రారంభించాయి. గతంలో కంటే భారీగా ఓటింగ్ శాతం పెరగడం ఎవరిక లాభిస్తుందోనని అలు వైసీపీ, ఇటు కూటమి నేతలు అంచనాలు వేస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో అర్బన్ ఓటింగ్ కన్నా గ్రామీణ ప్రజల ఓటింగ్ ఎక్కువగా ఉండేది. ఈ దఫా అర్బన్‌లో కూడా ఓటింగ్ శాతం ఏమాత్రం తగ్గలేదు. వృద్ధులు, వికలాంగులు, మహిళల ఓటింగ్ ఎక్కువగా ఉన్నందున అదంతా తమకు అనుకూలమని అధికార వైసీపీ లెక్కగడుతోంది. చంద్రబాబు హామీల వల్లే వాళ్లు పెద్ద ఎత్తున ఓటింగ్‌కు తరలి వచ్చినట్లు కూటమి పక్షాలు భావిస్తున్నాయి. మొత్తంగా పోలింగ్ శాతం పెరిగిందంటే అదంతా నెగటివ్ ఎమోషన్ వల్లేనని ప్రతిపక్షాలు బలంగా నమ్ముతున్నాయి. పోలింగ్ శాతం పెరిగినా గత ఎన్నికల్లో మళ్లీ ఎన్డీయే అధికారానికి వచ్చింది. అందువల్ల ఇది ప్రామాణికం కాదని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
సంక్షేమ పథకాల లబ్దిదారులు అనుకూలంగా పెద్ద ఎత్తున స్పందించడం వల్లే ఓటింగ్ శాతం పెరిగినట్లు వైసీపీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల్లో తమకు సానుకూల తీర్పు వస్తుందని ఆశిస్తున్నాయి. వాస్తవానికి పూర్తి స్థాయి గ్రామీణ ఓటర్లు ఏ నియోజకవర్గంలోనూ ఉండరు. అర్బన్ ప్రాంతంలోని మధ్య తరగతి ఓటర్లు కూడా గణనీయమైన సంఖ్యలో ఉంటారు.అందువల్ల మిడిల్ క్లాసులో వ్యక్తమవుతున్న వ్యతిరేకత వైసీపీ విజయావకాశాలను దెబ్బతీసే అవకాశం లేకపోలేదని మరికొందరు పరిశీలకులు చెబుతున్నారు.
గతంలో బరిలో నిలిచిన అభ్యర్థుల బలాబలాలు గెలుపోటములను ప్రభావితం చేసేవి. ఈ దఫా జగన్ కావాలా.. చంద్రబాబు కావాలా అనే రీతిలో ఎన్నికలు జరిగాయి. ఐదేళ్ల నుంచి రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా నగదు బదిలీ పథకాలు అమలయ్యాయి. అందువల్ల ప్రతిపక్షాలకు అనుకూలంగా సైలెంట్ ఓటింగ్ జరిగినట్లు కూటమి నేతలు భావిస్తున్నారు. మళ్లీ వైసీపీ అధికారానికి వస్తే తమకు వస్తున్న పథకాలను నిలిపేస్తారేమోనన్న భావంతో విపక్షాలకు అనుకూలంగా ఓటు వేసిన వాళ్లు ఎక్కడా బయటపడడం లేదని కూటమి పక్షాలు అంచనా వేస్తున్నాయి. ఇంకా వైసీపీ మీద ఎంతో కొంత కాంగ్రెస్ ప్రభావం చూపించడం వల్ల కూడా ఎన్డీయే కూటమికే విజయావకాశాలున్నట్లు విశ్లేషకులు కొందరు అంచనా వేస్తున్నారు. మొత్తానికి ప్రజలు ఎవరికి ఓటేశారన్నది తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.