Yakshini Review: వేదిక నటించిన ‘యక్షిణి’ వెబ్ సిరీస్ రివ్యూ

Telugu BOX Office

సోసియో ఫాంటసీ డ్రామాలకి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. AI వంటి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఈ జోనర్లో కంటెంట్ చేయాలని చాలా నిర్మాణ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లో కూడా ‘అమ్మోరు’ ‘దేవి’ వంటి సినిమాలు వచ్చి సెన్సేషనల్ సక్సెస్ అందుకున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘హనుమాన్’ రిజల్ట్ గురించి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఇదే జోనర్లో ‘యక్షిణి’ అనే వెబ్ సిరీస్ వచ్చింది. ట్రైలర్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ వెబ్ సిరీస్.. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఓ తెలుసుకుందాం రండి :

కథ ఏంటంటే..
యక్ష లోకం మీద నాగలోకం ఆధిపత్యం చెలాయించాలని, యక్షులను తమ బానిసలుగా చేసుకోవాలని మహాకాళ్ (అజయ్) ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలోనే యక్షిణి అయిన మాయ (వేదిక)ను ప్రేమ పేరుతో మోసం చేస్తాడు. రహస్య మందిర ద్వారం గురించి మహాకాళ్ తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. కానీ మహాకాళ్ వల్ల అది సాధ్యం కాదు. ఇక యక్ష లోక ధర్మాన్ని తప్పిందని కుబేరుడు మాయను శపిస్తాడు. మానవుడి ప్రేమకు బానిసైనందున.. భూలోకంలోనే ఉండిపోవాలని, ఈ శాప విమోచనం కలగాలంటే.. వంద మంది బ్రహ్మచారులను తన వశం చేసుకుని హతం చేయాల్సి ఉంటుందని చెబుతాడు. ఇక భూలోకంలోనే ఉన్న మాయ.. 99 మంది బ్రహ్మచారుల్ని హతం చేస్తుంది. వందో వ్యక్తి మాత్రం ఆత్మహత్యకు సిద్దపడే శుద్ధబ్రహ్మణుడు, బ్రహ్మచారై ఉండాలని కండీషన్ పెడతాడు. ఆ వందో వ్యక్తి కోసం ఎదురుచూస్తున్న తరుణంలోనే కృష్ణ (రాహుల్ విజయ్) తారసపడతాడు. ఆ తరువాత కృష్ణ జీవితంలోకి మాయ వస్తుంది? ఆ తరువాత మాయ ఏం చేసింది? మాయని పట్టుకునేందుకు మహాకాళ్ చేసిన ప్రయత్నాలు ఏంటి? ఈ కథలో మరో యక్షిణి జ్వాలాముఖి (మంచు లక్ష్మీ) పాత్ర ఏంటి? చివరకు కృష్ణను మాయ చంపేస్తుందా? అసలేం జరుగుతుంది? అనేది కథ.

విశ్లేషణ:
ఉద్దరామతంత్రం అనే గ్రంథంలో అసలేం ఉందంటే.. అంటూ యక్షిణులకి, నాగులకి మధ్య జరిగే ఆధిపత్య పోరుని హారర్ జోడించి తేజ యార్ని వివరించిన కథ సక్సెస్ అయిందనే చెప్పాలి. ప్రతీ ఎపిసోడ్ ని చాలా జాగ్రత్తగా ఏదీ అతిగా లేకుండా.. ఎక్కడ బోర్ కొట్టకుండా.. అలా తీసుకెళ్ళాడు. మాయ తన శాపానికి విముక్తి పొందగలదా లేదా అనే క్యూరియాసిటితో పాటు నాగుల రాజు అయినటువంటి మహాకాళి తనని పట్టుకుంటాడా లేదా అనే ఇంటెన్స్ తో తీసుకెళ్ళగలిగారు మేకర్స్. ఈ సిరీస్ లో మొత్తం ఆరు ఎపిసోడ్ లు ఉన్నాయి. మొదటిది ది హోప్.. ఇందులో యక్షిణి ఎవరు.. తన చంపాలనుకున్న వందో మగాడిని కనిపెట్టిందా లేదా అనేది చూపించారు. రెండవ ఎపిసోడ్.. ది హంట్.. నాగుల రాజు మహాకాళి చేసిన తపస్సుకి నాగదేవత సౌగంధిక అనే పవర్స్ ఉన్న పుష్పాలని ఇస్తుంది. వాటి మూలంగా మహాకాళి తన శత్రువు అయినటువంటి మాయ జాడ వెతుక్కుంటూ వెళ్తాడు. అయితే అతనికి జ్వాలాముఖి కనిపిస్తుంది.

మూడవ ఎపిసోడ్ ది ట్రాప్.. మహాకాళి తన గురువికిచ్చిన మాట ని తను పొందడానికి సరైన అవకాశం లభిస్తుంది. ఇక మాయ జాడ కోసం మహాకాళి వెళ్తాడు. నాల్గవ ఎపిసోడ్: ది రివిలేషన్.. మాయ తన ప్లాన్ ప్రకారం కృష్ణని పెళ్ళి చేసుకుంటుంది. అయితే అంతలోనే కృష్ణ వాళ్ళ కుటుంబంలో ప్రమాదం సంభవిస్తుంది. దాంతో కృష్ణ, మాయల శోభనం ఆగిపోతుంది. మరోవైపు మాయకి సమయం తక్కువగా ఉంటుంది. ఐదో ఎపిసోడ్: ది వెంగెన్స్ .. ఇందులో మాయని వెతుక్కుంటు వచ్చిన మహాకాళికి జ్వాలాముఖి దొరుకుతుంది. అదే సమయంలో మాయ అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోతుంది. ఆరవ ఎపిసోడ్: ది బిగినింగ్ .. కుబేరుడి దగ్గర మాయ తన శాపం గురించి పూర్తిగా తెలుసుకుంటుంది. అదే సమయంలో మహాకాళి వచ్చి మాయని గుప్తమందిరంలో బంధిస్తాడు. ఇక మాయని ప్రేమించిన కృష్ణ.. తనకి సాయం చేశాడా లేదా అనేది మిగతా కథ.

సోషియో ఫాంటసీగా వచ్చిన ఈ సిరీస్ నిడివి కూడా తక్కువే. ఒక్కో ఎపిసోడ్ కి అంచనాలు మారిపోతుంటాయి. ట్విస్ట్ లతో పాటు ఎంగేజింగ్ సీన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ప్రతీ ఒక్కరు మాయ, మహాకాళి పాత్రలకి కనెక్ట్ అవుతారు. చివరి వరకు సాగే ఈ ఆధిత్యపోరు ఉత్కంఠభరితంగా సాగుతుంది. రెండు మూడు చోట్ల లిప్ లాక్ లు తప్ప పెద్దగా అడల్ట్ సీన్స్ లేవు. వాటిని స్కిప్ చేస్తే బెటర్. అసభ్య పదజాలం వాడలేదు. వంశీకృష్ణ రచన బాగుంది. స్క్రీన్ ప్లే అలా చివరి వరకు చూసేలా ఉంది. కార్తికేయన్ రోహిణి ఎడిటింగ్ నీట్ గా ఉంది. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ మ్యూజిక్ ఆకట్టుకుంది. కొన్ని చోట్ల బిజిఎమ్ అదనపు బలంగా నిలిచింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. విఎఫ్ఎక్స్ ఆకట్టుకుంది.

నటీనటుల పనితీరు:
యక్షిణిగా మాయ పాత్రలో వేదిక బాగానే నటించింది. యక్ష లోకం నుంచి వచ్చిన కన్యలానే అంత అందంగా కనిపించింది వేదిక. కొన్ని చోట్ల భయపెట్టడంలోనూ ది బెస్ట్ అనిపించింది. జ్వాలా ముఖిగా ఇంపార్టెంట్ రోల్‌లో మంచు లక్ష్మీ మెప్పించింది. మహకాళ్‌గా అజయ్ ఓకే అనిపిస్తాడు. కానీ అజయ్ లాంటి నటుడ్ని ఇంకా సరిగ్గా వాడుకోలేదనిపిస్తుంది. రాహుల్ విజయ్ హీరో మాత్రం కాదనిపిస్తుంది. ఓ పాత్ర మాత్రమే అన్నట్టుగా ఉంటుంది. మిగిలిన పాత్రలు అంత చెప్పుకోదగ్గవిగా ఉండవు. ప్రవీణ్, జబర్దస్త్ సత్య, జెమిని సురేష్ ఇలా అందరూ తమ తమ పాత్రల్లో మెప్పిస్తారు.

చివరగా: ఫాంటసీ చిత్రాలు ఇష్టపడే వారికి పండగే

Share This Article
Leave a comment