ఈసారి సంక్రాంతి పండక్కి తెలుగులో గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామి రంగ.. చిత్రాలు రిలీజైతే అందులో ‘హనుమాన్’ మాత్రమే బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. మిగిలిన మూడు సినిమాలు ఇప్పటికే ఓటీటీలో సందడి చేస్తుంటే హనుమాన్ ఎప్పుడొస్తుందా?.. అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఊహించిన దానికంటే హనుమాన్‌కి ఆదరణ రావడంతో నెలరోజులు దాటినా థియేటర్లలో రన్ అవుతోంది. 300 థియేటర్లలో 30 రోజులు పూర్తి చేసుకుని చాలారోజుల తర్వాత తెలుగు ఇండస్ట్రీకి పండగ తీసుకొచ్చింది. ఈ సినిమా మరింతగా జనాల్లోకి వెళ్లేందుకు ఇటీవలే టిక్కెట్ రేట్లు కూడా తగ్గించినట్లు యూనిట్ ప్రకటించింది. అయితే హనుమాన్ థియేటర్ రన్ దాదాపు పూర్తికావడంతో ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రిలీజ్ డేట్ కూడా బయటికొచ్చింది.
తేజ సజ్జా హీరోగా నటించిన ‘హనుమాన్’ సినిమా ఎప్పుడో థియేటర్లలోకి రావాల్సింది. కానీ గ్రాఫిక్స్ పనుల వల్ల ఆలస్యమవుతూ ఈ సంక్రాంతికి రిలీజైంది. అయితే మహేశ్, వెంకటేశ్, నాగార్జున సినిమాలు ఇదే టైంకి విడుదలకు రెడీ అయ్యాయని.. ‘హనుమాన్’ని వాయిదా వేసుకోవాలని ఇండస్ట్రీ పెద్దలు నిర్మాతను నానా విధాలుగా ఇబ్బందులకు గురిచేశారు. అయితే కంటెట్పై నమ్మకం ఉండటంతో ధైర్యంగా నిలబడి సంక్రాంతి విజేతగా నిలవడంతో పాటు అనేక ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టారు.
‘హనుమాన్’ చిత్ర డిజిటల్ హక్కుల్ని దక్కించుకున్న జీ5 సంస్థ.. తొలుత 3-4 వారాల గ్యాప్‌లోనే ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణ దృష్ట్యా డిజిటల్ స్ట్రీమింగ్‌ని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు థియేట్రికల్ రన్ చివరకొచ్చేయడంతో ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మార్చి 2 నుంచి అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. త్వరలో దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. సంక్రాంతికి విడుదలైన విజయం సాధించిన నాగార్జున సినిమా ‘ నా సామి రంగ’ శనివారం నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.