తిరుమల వేంకటేశ్వర స్వామి హుండీ కానుకలతో కళకళలాడుతోంది. టీటీడీ (TTD) చరిత్రలో శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. భక్తులు స్వామివారికి కాసుల వర్షం కురిపించారు. ఈనెల రూ. 100 కోట్ల ఆదాయం దాటింది. కొన్ని నెలలుగా పెద్ద ఎత్తున తిరుమలకు భక్తులు వస్తున్నారు. శ్రీవారిని దర్శించుకుని విరివిగా కానుకలు సమర్పించుకుంటున్నారు. కరోనా ప్రభావం తగ్గడంతో తిరుమల కొండ నిత్యం రద్దీతో కళకళలాడుతోంది. మొక్కులున్న భక్తులతో పాటు, ముడుపులనూ భారీగా సమర్పిస్తున్న క్రమంలో హుండీ ఆదాయం పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.
అలిపిరి నుంచి స్వామి కొండకు వేలాదిమంది భక్తులు కాలినడకన తిరుమల చేరుకుంటున్నారు. వాహనాల సంఖ్య కూడా పెరిగింది. శ్రీవారి ఆలయం, క్యూకాంప్లెక్స్లు, మాడవీధులు, అన్నప్రసాద భవనం, అఖిలాండం, బస్టాండు, రోడ్లు, దుకాణ సముదాయాలు, కల్యాణకట్ట, లడ్డూల జారీ కేంద్రం, ఇతర సందర్శనీయ ప్రదేశాలు భక్తులతో రద్దీగా మారాయి. తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఉన్న హుండీ తిరుమల హుండీగా సుప్రసిద్ధం. వడ్డీకాసుల వాడు, ఆపదమొక్కుల వాడు అని పేరొందిన తిరుమల వేంకటేశ్వరున్ని దర్శించుకునే భక్తులు.. కానుకలు హుండీలో వేయడం పరిపాటి. ప్రపంచవ్యాప్తంగా వాటికన్ సిటీ తర్వాత అంతటి ఆదాయం కలిగిన ప్రార్థనా స్థలంగా తిరుమల ప్రసిద్ధి చెందింది. ఆపదలు వచ్చినప్పుడు మొక్కులు మొక్కుకుంటే ఆయన తీరుస్తాడని భక్తుల నమ్మకం. ఒంటిపై వేసుకుని వచ్చిన బంగారం, సొమ్ముతో సహా మొత్తం హుండీలో వేయడాన్ని నిలువు దోపిడీ అని వ్యవహరిస్తారు. తిరుపతిలో నిలువు దోపిడీ చెల్లించుకుంటానని మొక్కుకుని, మొక్కు తీర్చుకుంటూంటారు