స్కిల్స్ డెవలప్మెంట్ స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ న్యాయస్థానం 14రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఉత్కంఠ పరిణామాల మధ్య పోలీసులు ఆయన్ని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. రిమాండ్ విధించారన్న సమాచారం బహిర్గతమవగానే టీడీపీ అభిమానులు పెద్దఎత్తున న్యాయస్థానం వద్దకు చేరుకున్నారు. చంద్రబాబును వాహనంలో తరలిస్తుండగా కొందరు తట్టుకోలేకపోయారు. తెదేపా మహిళా నాయకురాలు ఒకరు న్యాయస్థానం ఎదుటే పోలీసు వాహనాలకు అడ్డుగా నిలవగా, మహిళా పోలీసులు ఆమెను పక్కకు లాగేశారు. కార్యకర్తలు జైబాబు.. జైజై బాబు అని నినాదాలు చేయటంతో న్యాయస్థానాల పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
చంద్రబాబును పరామర్శించేందుకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు తరలివచ్చారు. తీర్పు వెలువరించే సమయానికి న్యాయస్థానాల పరిసరాల్లో పోలీసులు ఆంక్షలను మరింత కఠినం చేశారు. తీర్పు అనంతరం వానలోనే చంద్రబాబు వాహనం రాజమహేంద్రవరం బయలుదేరింది. లోకేశ్ సైతం తన వాహనంలో తండ్రి కాన్వాయ్‌ను అనుసరించారు. దారి పొడవునా అభిమానులు, నాయకులు అధినేత రాక కోసం వేచి చూశారు. చంద్రబాబు వాహనంలో నుంచే వారికి అభివాదం చేశారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం సోమవరప్పాడు వద్ద కొంతమంది తెదేపా నాయకులు, కార్యకర్తలు కాన్వాయ్‌ని ఆపగా, వారితో మాట్లాడిన చంద్రబాబు ఎటువంటి అడ్డంకులు సృష్టించవద్దని వారిని వారించారు. జైల్లో చంద్రబాబుకు ఖైదీ నంబర్.. 7691 కేటాయించారు.
జైల్లో చంద్రబాబుకు ప్రత్యేక సౌకర్యాలు
జడ్ ప్లస్ భద్రతలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు జైల్లో అవసరమైన అన్ని ప్రత్యేక సౌకర్యాలను కల్పించాలని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌ను ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి హిమబిందు ఆదేశించారు. ‘చంద్రబాబుకు ప్రాణహాని ఉన్నందున జైల్లో ఆయనకు ప్రత్యేక గదిని కేటాయించడంతోపాటు తగిన భద్రతనూ కల్పించండి. ఇంటి నుంచి వచ్చిన ఆహారం, ఔషధాలనూ అనుమతించండి’ అని న్యాయమూర్తి తన ఆదేశాల్లో పేర్కొన్నారు. అంతకుముందు జైల్లో చంద్రబాబుకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించేలా ఆదేశించాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ‘మావోయిస్టులు, రాజకీయ ప్రత్యర్థులు.. ఇతర వర్గాల నుంచి చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం ఆయనకు జడ్ ప్లస్ భద్రతను కల్పించింది. అందువల్ల జైల్లో సాధారణ బ్లాక్‌లో ఇతర ఖైదీలతో కలిపి ఉంచితే ఆయన ప్రాణాలకు ప్రమాదం. అంతేకాకుండా చంద్రబాబుకు 73 ఏళ్ల వయస్సు. వివిధ రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న కారణంగా ఆయన వైద్యులు సూచించిన ఆహారాన్ని తీసుకోవడంతోపాటు మందులు కూడా వాడాల్సి ఉంది. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబు జైలు నిబంధనల ప్రకారం ప్రత్యేక సౌకర్యాలకు అర్హులు. కాబట్టి ఆయనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి’ అని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబుకు హౌస్ అరెస్ట్‌ను అనుమతించాలని ఆయన తరఫు న్యాయవాదులు మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.