ప్రపంచాన్ని నడిపించేది డబ్బు.. అది లేనిదే గౌరవం ఉండదు, మర్యాద ఉండదు, పేరు ప్రఖ్యాతలు రావని అంటుంటారు. కానీ ఇందులో నిజం లేదని అంటున్నారు సూపర్‌స్టార్ రజినీకాంత్. ఎన్ని రూ.కోట్లు సంపాదించినా తన జీవితంలో ప్రశాంతత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బస్ కండక్టర్‌గా మొదలైన రజినీకాంత్ ప్రయాణం సూపర్ స్టార్ వరకు వచ్చిన వైనం అందరికీ తెలిసిందే. అయితే పేరు, డబ్బు తన మనసుకు ప్రశాంతతనే ఇవ్వలేదని ఆయన చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. చెన్నైలో జరిగిన హ్యాపీ సక్సెస్ఫుల్ లైఫ్ త్రూ క్రియ యోగ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘నేను మంచి నటుడని అందరు అంటుంటారు. కానీ దాన్ని ప్రశంసగా తీసుకోవాలో, విమర్శగా పరిగణించాలో అర్థం కావడం లేదు. నా సినిమాల్లో నాకు ఆత్మ సంతృప్తిని కలిగించిన సినిమాలు బాబా, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి.. ఈ సినిమాలు చూసి నా అభిమానులు చాలా మంది సన్యాసులుగా మారారు, హిమాలయాలకు వెళ్లారు. కానీ నేను మాత్రం ఇక్కడే కొనసాగుతున్నాను. మధ్యలో వెళ్లి వస్తున్నా.. ఇంకా ఏదో చేయాలనిపిస్తూ ఉంటుంది. ఇక అక్కడ దొరికే అమూల్యమైన మూలికలు.. తింటే వారానికి సరిపడా శక్తి వస్తుంది. ఆరోగ్యం చాలా ముఖ్యం.. ఎందుకంటే మనల్ని ప్రేమించేవారు మనకు ఏదైనా అయితే తట్టుకోలేరు. డబ్బు, పేరు, ప్రఖ్యాతలు ఇవేమి నాకు సంతోషాన్ని ఇవ్వడం లేదు. అన్నీ ఉన్నా ప్రశాంతత లేదు నాకు. నా జీవితంలో నేను చాలా చూశాను.. కానీ 10 శాతం కూడా ప్రశాంతంగా జీవించలేక పోయాను. సంతోషం, ప్రశాంతత అనేవి జీవితాంతం వుండేవి కావు’ అంటూ రజనీకాంత్ వ్యాఖ్యానించారు.
రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. తమిళ సినీ పరిశ్రమను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన ఘనత రజనీదే అనడంలో సందేహమే లేదు. ఆయనకు జపాన్, మలేషియా దేశాల్లోనూ అనేక మంది అభిమానులున్నారు. భారతీయ సినిమాలు విదేశాల్లోనూ సత్తా చాటడంలో ఆయన చేసిన కృషి అంతా ఇంతా కాదు. స్టైల్, మ్యానరిజానికి కేరాఫ్‌గా నిలిచే రజనీకాంత్ యాక్షన్ సినిమాలతో కోలీవుడ్‌ని ఉర్రూతలూగించారు. ప్రస్తుతం ఆయన నెల్సన్ దిలీప్ కుమార్‌తో ‘జైలర్’ మూవీలో నటిస్తున్నారు.