ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ కొద్దిరోజులు హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 66 ఏళ్లు. కిమ్స్ ఆస్పత్రి వర్గాలు మంగళవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేస్తూ, “ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న సీతారామశాస్త్రి సాయంత్రం 4.07 గంటలకు మృతి చెందారు” అని ప్రకటించాయి. కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సిరివెన్నెల (1986) సినిమాతో సినీ గేయరచయతగా అందరి దృష్టినీ ఆకర్షించిన చేంబోలు సీతారామశాస్త్రి ఆ చిత్రం పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు. అయితే ఆయన సినీ రంగానికి పరిచయమైంది మాత్రం అంతకు రెండేళ్ల ముందు వచ్చిన ‘జననీ జన్మభూమి’ చిత్రంతో. ఆ చిత్రానికి కూడా కె. విశ్వనాథే దర్శకుడు. తొలి సినిమాలో సీహెచ్ సీతారామశాస్త్రి (భరణి) అనే పేరుతో ఆయన ‘తడిసిన అందాలలో…’ అనే పాట రాశారు. ఆయన మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో సీవీ యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు సీతారామశాస్త్రి 1955 మే 20న జన్మించారు. పదో తరగతి వరకు అనకాపల్లిలోనే చదువుకున్న ఆయన కాకినాడలో ఇంటర్, ఆంధ్ర విశ్వకళాపరిషత్‌లో బీఏ పూర్తి చేశారు. అనంతరం రాజమహేంద్రవరంలో కొంతకాలం బీఎస్ఎన్ఎల్లో పని చేశారు. నాలుగు దశాబ్దాల సినిమా కెరీర్లో దాదాపు 800ల చిత్రాల్లో 3 వేలకు పైగా పాటలు రాసిన సిరివెన్నెల ఉత్తమ సినీ గేయరచయితగా 11 నంది అవార్డులు, 4 ఫిల్మ్ ఫేర్ అవార్డులు గెల్చుకున్నారు. సిరివెన్నెల చిత్రంతో 1986లో తెలుగు సినీ పాటల ప్రియులకు పరిచయమైన సీతారామశాస్త్రి అదే ఏడాది వంశీ దర్శకత్వం వహించిన ‘లేడీస్ టైలర్’ చిత్రంతో పాపులర్ ప్రేమ గీతాలు రాయడంలోనూ తన కలానికి అంతే పదను ఉందని నిరూపించుకున్నారు.
‘విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం…, ఆది భిక్షువు వాడినేమి కోరేది, చందమామ రావే…’ వంటి పాటలతో తొలి చిత్రంతోనే తన ప్రత్యేకతను చాటుకున్న సీతారామశాస్త్రి క్లాస్, మాస్ పాటలతో సినీ ప్రేక్షకలోకాన్ని ఆకట్టుకున్నారు. సిరివెన్నెల 2019లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శ్రుతిలయలు, స్వయంకృషి, స్వర్ణకమలం, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం వంటి చిత్రాలకు ఆయన పాటలు రాశారు. సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని కల్పించాలని ఎన్నో సందర్భాల్లో చెప్పిన సీతారామశాస్త్రి ఆ దిశగా చెప్పుకోదగిన కృషి చేశారు. కెరీర్ తొలిరోజుల్లో ‘సిరివెన్నెల’ సినిమాకు ఆయన రాసిన పాటలు బాగా పాపులర్ అయ్యాయి. కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ‘రుద్రవీణ’ చిత్రం సిరివెన్నెల కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఆ చిత్రంలోని ‘తరలి రాద తనే వసంతం, నమ్మకు నమ్మకు ఈ రేయిని…’ వంటి పాటలు అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణను చూరగొన్నాయి.
తమ్ముడు గుర్తించిన టాలెంట్
సీతారామశాస్త్రిలో కవి ఉన్నాడని గుర్తించిన మొదటి వ్యక్తి ఆయన సోదరుడు. చిన్నప్పటి నుంచి సీతారామశాస్త్రికి పాటలు పాడాలని కోరిక. ఒకట్రెండుసార్లు ప్రయత్నించి, అందుకు తాను పనికిరానని నిర్ధారణకు వచ్చారు. అయితే, కొత్త పదాలతో ఎప్పుడూ ఏదో ఒకటి పాడుతుండటాన్ని చూసిన ఆయన సోదరుడు ‘అన్నయ్యా కవిత్వం కూడా బాగా రాస్తున్నావు. ప్రయత్నించు’ అని చెప్పారట. ఆ తర్వాత ఏవీ కృష్ణారావు, సహచరుడు చాగంటి శరత్‌బాబుతో కలిసి సాహితీ సభలకు వెళ్లేవారు. ఆ సమయంలో సీతారామశాస్త్రిని అందరూ భరణి అని పిలిచేవారు. ఎం.ఏ చేస్తుండగా దర్శకుడు కె.విశ్వనాథ్ నుంచి పిలుపు రావటంతో ‘సిరివెన్నెల’ చిత్రానికి తొలిసారి కలాన్ని కదిలించారు. అలా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే సుమధుర గీతాలెన్నింటినో రాసి చివరికి దివికేగారు.