
ఈ మధ్యకాలంలో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మొత్తం పురాణ కథల చుట్టూనే తిరుగుతోంది. పురాణాలు, ఇతిహాసాల్లో ఉన్న మహావీరుల కథాంశాలను తెరకెక్కించేందుకు దర్శక నిర్మాతలు పోటీపడుతున్నారు. ఈ కోవలోనే కేజీఎఫ్, కేజీఎఫ్ 2, కాంతార, సలార్.. లాంటి భారీ చిత్రాలను అందించిన హోంబలే ఫిల్మ్స్…. క్లీమ్ ప్రొడక్షన్స్‌లో కలిసి మహావతార్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ మహావతార్ నరసింహ ’ అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. జులై 25న ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా రిలీజైన ఈ చిత్రం వెండితెరపై ప్రకంపనలు సృష్టిస్తోంది. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు. కేవలం మౌత్ టాక్ ద్వారానే థియేటర్లు హౌస్‌ఫుల్ అయిపోతూ కాసుల వర్షం కురిపిస్తున్నాయి. నటీనటులు లేకుండా కేవలం యానిమేషన్‌తోనే తెరకెక్కిచడం వల్ల పాత్రలతోనూ, ఆ భావోద్వేగాలతోనూ ప్రేక్షకులు మరింత ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు.
రిలీజ్ రోజు కంటే వారం రోజుల తర్వాత ఈ సినిమాకి థియేటర్లు పెరిగాయంటేనే దినిక ఆదరణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తొలిరోజు కేవలం రూ.1.75 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసిన ఈ చిత్రం ఏడు రోజులకి ఏకంగా రూ.40 కోట్లు రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మన ప్రేక్షకులని యానిమేషన్ చిత్రాలంటే పెద్దగా ఆసక్తి ఉండదు. గతంలో వచ్చిన ‘హనుమాన్’ యానిమేషన్ మూవీని పెద్దగా పట్టించుకోలేదు. ఆ నేపథ్యంలోనే ‘మహావతార్ నరసింహ’పై ముందు పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. అయితే రిలీజ్ తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది. నార్త్ నుంచి సౌత్ వరకు విజయఢంకా మోగిస్తూ కలెక్షన్లు సునామీ సృష్టిస్తోంది. కేవలం రూ.6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ సాక్నిల్క్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం.. తొలిరోజు కేవలం రూ.1.75 కోట్లు, రెండో రోజు రూ.4.6 కోట్లు, మూడో రోజు రూ.9.5 కోట్లు, నాలుగో రోజు రూ.6 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ.. ఐదో రోజు రూ.7.7 కోట్లు, ఆరో రోజు రూ.7.7 కోట్లు కలెక్ట్ చేసింది. ఏడో రోజైన గురువారం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 2.09 కోట్లు కాబట్టింది. దీనికి ఆఫ్‌లైన్ టిక్కెట్లు కలుపుకుంది మరింత పెరగనుంది.
‘హోంబలే’ నిర్మాణ సంస్థ భారతీయ పురాణాలను ఆధారం చేసుకొని ఓ పది యానిమేటెడ్ చిత్రాలని రూపొందించాలని ప్లాన్ చేసింది. అందులో మొదటగా ‘మహావతార్ – నరసింహ’ రిలీజైంది. తర్వాతి రోజుల్లో విష్ణువు దశావతారాల్లోని మరిన్ని కథలతో ‘హోంబలే’ నుండి యానిమేటెడ్ మూవీస్ రానున్నాయి. పదేళ్ళ పాటు ఈ మూవీస్ ను వరుసగా విడుదలచేస్తామని గతంలోనే హోంబలే సంస్థ ప్రకటించింది. ఆరంభంలోనే ‘మహావతార్ – నరసింహ’తో బంపర్ హిట్ పట్టేసిన ఈ సంస్థ రాబోయే చిత్రాలతో ఏ తీరున మురిపిస్తుందో అని సినీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాల ప్రభావం వల్ల మన దేశంలో యానిమేషన్ ఫిలిమ్స్‌కి ఆదరణ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు.
