కల్కి సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా వెసులుబాటు వచ్చేసింది. అంతా ఊహించినట్టుగానే చంద్రబాబు సర్కారు, ఈ సినిమాకు భారీ ‘ప్రత్యేక పెంపు’ ఇచ్చింది. ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్ అంతటా కల్కి సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఏపీలోని సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ పై 75 రూపాయలు, మల్టీప్లెక్సుల్లో టికెట్ పై 125 రూపాయలు అదనంగా పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్సుల్లో 125 రూపాయల పెంపు అనేది ఈ ఐదేళ్లలో ఇదే అత్యథికం.
సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం సినిమాకు చివరిసారిగా గత ఏపీ ప్రభుత్వం పెంపు ఇచ్చింది. టికెట్ పై 50 రూపాయలు పెంచుకోవచ్చంటూ జీవో జారీ చేసింది. కొత్త ప్రభుత్వం మాత్రం కల్కి సినిమాకు ఏకంగా రూ.125 పెంపు ఇవ్వడం విశేషం. అంతేకాదు.. ఈ ఏకంగా 2 వారాల పాటు సవరించిన రేట్లు కొనసాగేలా వెసులుబాటిచ్చింది. ఏపీలో ఈ ఐదేళ్లలో ఏ సినిమాకు 2 వారాల వెసులుబాటు దక్కలేదు. అయితే బెనిఫిట్ షోలపై జీవోలో ఎలాంటి ప్రస్తావన లేదు. రోజుకు 5 షోలు వేసుకునే అంశం కూడా ఎక్కడా లేదు. వీటి కోసం జిల్లాల వారీగా కలెక్టర్లతో సంప్రదించి ప్రత్యేక అనుమతులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఏపీలో కచ్చితంగా బెనిఫిట్ షోలు ఉంటాయి. ఆ టికెట్ రేట్లు చుక్కల్ని తాకుతాయి. తెలంగాణతో పోలిస్తే, ఏపీలోనే థియేటర్ల సంఖ్య ఎక్కువ. పెంచిన టికెట్ రేట్ల బట్టి చూసుకుంటే, కల్కి సినిమాకు ఏపీలో భారీగా ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది.