ఆర్య, ఆర్య-2 చిత్రాలతో టాలీవుడ్లో హిట్ కాంబినేషన్‌గా ముద్రపడ్డారు జీనియస్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. వారిద్దరి కలయికలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కింది ‘పుష్ప’. 12 ఏళ్ల తర్వాత బన్నీ, సుకుమార్ కలిసి చేస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమాలోని మొదటి పార్ట్ ‘పుష్ప – ది రైజ్’ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచంలో ఎక్కడా దొరకని శేషాచలం అడవుల్లో మాత్రమే లభించే అరుదైన ఎర్రచందనం దుంగల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ గురించి ఆసక్తికరమైన విషయాలు మీకోసం..
- అల్లు అర్జున్ – సుకుమార్ తొలిసారి 2004లో ‘ఆర్య’తో మంచి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత 2009లో ‘ఆర్య 2’తో అలరించారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ముచ్చటగా మూడోసారి కలిసి చేస్తున్న చిత్రం ‘పుష్ప’.
- అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇదే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేశారు. ‘పుష్ప’రాజ్ పాత్ర కోసం అల్లు అర్జున్ ప్రత్యేకంగా సిద్ధమయ్యారు. చిత్తూరు యాస నేర్చుకున్నారు.
- ‘పుష్ప’ సినిమాకు ₹160 కోట్ల నుంచి ₹180 కోట్లు ఖర్చు చేశారని భోగట్టా. రెండో భాగం చిత్రీకరణను ఫిబ్రవరిలో ప్రారంభిస్తారట.
- అల్లు అర్జున్ ‘పుష్ప’ గెటప్‌లో రెడీ అయ్యేందుకు మేకప్ కోసం దాదాపు రెండు గంటల సమయం పట్టేదట. తెల్లవారుజామున 4.30 నిద్రలేచి.. ఐదుకల్లా సెట్‌కెళ్లి.. 5 నుంచి 7 వరకూ మేకప్ కోసమే ఓపిగ్గా కూర్చొనేవారట. షూట్ పూర్తయ్యాక మేకప్ తీయడానికి మరో 20 నుంచి 40 నిమిషాలు పట్టేదని బన్నీ చెప్పారు.
- ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే సినిమా కావడంతో ‘పుష్ప’అత్యధిక భాగం అడవుల్లో చిత్రీకరించారు. అందుకోసం చిత్ర బృందం మారేడుమిల్లి అడవులను ఎంచుకుంది.
- కొన్ని రోజులు కేరళ అడవుల్లో చిత్రీకరణ జరిగింది. కృత్రిమ దుంగల్ని చిత్రీకరణ కోసం అక్కడకు తీసుకెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు అక్కడి పోలీసులు పట్టుకున్నారట. ఇది ఎర్రచందనం కాదన్నా, తాము సినిమా వాళ్లమని చెప్పినా వాళ్లు వినలేదట. అవి సినిమా కోసం తయారు చేసినవని నిరూపించాక గానీ వదిలిపెట్టలేదట.
- యూనిట్ మొత్తాన్ని మారేడుమిల్లి అడవుల్లోకి తీసుకెళ్లడానికి రోజూ దాదాపు 300 వాహనాలను ఉపయోగించేవారు.
- తొలి రోజు చిత్రీకరణే 1500 మంది నేపథ్యంలో సాగింది. ఎర్రచందనం కృత్రిమ దుంగలు ఒకొక్కసారి వేల సంఖ్యలో అవసరమయ్యేవి. ఫోమ్, ఫైబర్ కలిపి కృత్రిమ దుంగల్ని తయారు చేశారు. ఎర్రచందనం దుంగలు, యూనిట్ సామాగ్రిని అడవుల్లోకి తీసుకెళ్లడానికి కష్టమయ్యేది. ఇందుకోసం అడవుల్లో కొన్ని చోట్ల మట్టి రోడ్లు కూడా వేయాల్సి వచ్చింది.
- ‘పుష్ప’ కోసం అడవుల్లో రోజూ 500 మందికి పైగా పనిచేవారట. ఇక ఈ సినిమాలో ఓ పాటను దాదాపు 1000మందితో చిత్రీకరించారు.
- సునీల్ ఇందులో మంగళం శ్రీను అనే ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. విలన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన సునీల్ కమెడియన్‌గా పేరు తెచ్చుకోవటం గమనార్హం. అయితే పాన్ ఇండియాలో విలన్‌గా చేస్తూ తన కోరిక నెరవేర్చుకున్నారు.
- ఈ సినిమాతో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, కన్నడ నటుడు ధనుంజయ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. ఫహద్ ఫాజిల్ పాత్ర మొదటి విజయ్ సేతుపతిని అడిగారు. కానీ డేట్స్ కుదరక ఆయన చేయలేకపోయారు.
- సుకుమార్- దేవిశ్రీ ప్రసాద్ కలిసి వరుసగా చేస్తున్న ఎనిమిదో చిత్రం ‘పుష్ప’. ఇప్పటివరకూ విడుదలైన సాంగ్స్ అన్నీ కలిసి మొత్తంగా 250 మిలియన్ వ్యూస్‌కు పైగా సాధించాయి.
- ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు పెద్ద పీట వేశారు. ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా రూ.6 కోట్లు ఖర్చు పెట్టారట.
- మైత్రీ మూవీ మేకర్స్‌తో రష్మికకు ఇది రెండో చిత్రం మొదటి చిత్రం ‘డియర్ కామ్రేడ్ చేశారు.’ అలాగే దర్శకుడు సుకుమార్‌కు మైత్రీ వారితో ఇది రెండో చిత్రమే మొదటిది ‘రంగస్థలం’.
- ‘పుష్ప’ను మొదట ఒక చిత్రంగా తీయాలనుకున్నారు. కానీ, కథ పెద్దది కావడంతో రెండు భాగాలు చేశారు. ‘పుష్ప: ది రైజ్’ ఇప్పుడు విడుదలవుతోంది. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటలా 59 నిమిషాలు.
- తొలి పార్ట్‌లో రష్మిక పాత్ర నిడివి తక్కువగానే ఉంటుంది. ఆమె రెండో పార్టులో విశ్వరూపం చూపిస్తుందట. ఫహద్ ఫాజిల్ కూడా సినిమా ఆఖరులోనే వస్తారని టాక్.
- ఈ సినిమాలో సమంత ‘ఉ అంటావా… ఊఊ అంటావా’ అనే ఐటెమ్ సాంగ్ చేసింది. ఆమె కెరీర్లో తొలిసారి ఇలా కనిపిస్తోంది. సమంత ఐటెమ్ సాంగ్ కోసం పెద్ద మొత్తంలోనే పారితోషికం అందుకుందని టాక్. పాట కోసం ఆమెకు కోటిన్నర రూపాయలు ఇచ్చారట. మొత్తంగా ఈ పాటకు చిత్రబృందం రూ. ఐదు కోట్లు బడ్జెట్ పెట్టిందని టాక్.
- ఈ సినిమాలో పాటలకు చాలామంచి పేరు వస్తోంది. అన్నింటినీ చంద్రబోసే రాశారు. ‘ఉ అంటావా… ఊ ఊ అంటావా..’ పాటను ఆలపించిన ఇంద్రావతి చౌహాన్… ప్రముఖ సింగర్ మంగ్లీ చెల్లెలు.