‘వారణాసి’లో చిన్నమస్తాదేవి.. భయంకర రూపం..ఎవరీ దేవత?

Telugu BOX Office

దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఒక సినిమా ప్రారంభిస్తే, అది పూర్తయ్యే దాకా దేశం మొత్తం ఆ చిత్రంపైనే చర్చ సాగడం సహజం. అలాంటి ప్రమోషన్స్, అలాంటి గ్రిప్‌ జక్కన్నకే సొంతం. ‘బాహుబలి’లో చివర్లో వచ్చిన “కట్టప్ప బాహుబాలిని ఎందుకు చంపాడు?” అనే ఒక్క డైలాగ్ భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత హైప్‌ సృష్టించింది. ఆ సస్పెన్స్‌ బాహుబలి 2 విడుదలయ్యే వరకు దేశమే కాదు, ప్రపంచం కూడా చర్చించింది.

ఇప్పుడు రాజమౌళి–మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ కూడా అదే స్థాయిలో సంచలనాలను సృష్టిస్తోంది. ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్‌లో సాధారణంగా కనిపించే సీన్లు కాకుండా, లొకేషన్‌లు, షాట్స్‌ ద్వారా కథలోని మిస్టరీని చూపిస్తూ టైటిల్‌ను రివీల్ చేశారు. గ్లింప్స్ మొత్తం అద్భుతంగా ఉన్నా ఒక్క షాట్ మాత్రం ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్‌కు గురిచేసింది—అదే భయంకరమైన ఛిన్నమస్తా దేవి రూపం.

గ్లింప్స్‌లో కనిపించిన ఆ రూపం నిస్సందేహంగా ఎవరికైనా గగుర్పాటు పుట్టించేలా ఉంది. నగ్నంగా ఉన్న దేవత, ఒక చేతిలో పదునైన కత్తి, మరో చేతిలో ఆమె స్వంత తల. సంభోగంలో నిమగ్నమైన స్త్రీ–పురుషుల మీద కాళ్లు పెట్టి నిలబడి… దేవత మెడ నుంచి ప్రవహించే మూడు రక్తధారల్లో రెండు పక్కన ఉన్న డాకిని–వర్ణినిలు తాగుతుండగా, మూడో రక్తధార నేరుగా చేతిలో ఉన్న తల నోట్లోకి వెళ్లేలా చూపించారు. ఇంత భయంకరంగా ఏ దేవతను పెద్దపెద్ద సినిమాల్లో చూపిన దాఖలాలు లేవు.

ఈ రూపం ఎవరిది? ఎందుకు ఇలా భీకరంగా ఉంటుంది? అనే ప్రశ్నలతో సోషల్ మీడియా దద్దరిల్లింది. పురాణాల ప్రకారం ఈ రూపం ఛిన్నమస్తా దేవికి చెందింది. ఆమె గురించి చాలామందికి తెలియదు కానీ, శక్తి రూపాల్లో అత్యంత ప్రబలమైన దేవిగా తంత్ర గ్రంథాలు చెప్తున్నాయి. ‘ఛిన్న’ అంటే ఖండించడం, ‘మస్తా’ అంటే తల. అంటే తన తలను తానే ఖండించుకున్న దేవత. ఇందుకు సంబంధించిన కథల్లో ఒకటి పురాణాలలో ఇలా వస్తుంది: మందాకినీ నదిలో పార్వతి దేవి స్నానం చేస్తుండగా ఒక అజ్ఞాత శక్తి వల్ల ఆమెకు కామ భావం రగులుతుంది. ఆ సమయంలోనే ఆమెతో పాటు స్నానం చేస్తున్న సహచర్యాలైన డాకిని, వర్ణినిలకు తీవ్రమైన ఆకలి ముంచుకొస్తుంది. వారిరువురూ దేవిని ఆహారం అడుగుతారు.

అన్నపూర్ణ స్వరూపిణిగా పార్వతి, వారి ఆకలిని తీర్చేందుకు తన శరీరాన్నే ఆహారంగా అర్పిస్తుంది. సృష్టి–వినాశనం సమతౌల్యాన్ని పరిరక్షించడానికి, రతీ–మన్మథుల శరీరాలపై నిలబడి, తన తలను తానే ఖండించి, వరుణినీ–డాకినీలకు రక్తాన్ని ఇస్తుంది. మరో రక్తధార నేలపై పడితే సంహారం సంభవిస్తుందని, ఆ రక్తాన్ని తన నోటికే చేరుస్తుంది. ఈ రూపమే ఛిన్నమస్తా—భయంకరమైనదే అయినా, సృష్టి–రక్షణల కోసం త్యాగం చేసిన శక్తి రూపం.

ఈ దేవతను సాధారణంగా తంత్ర విద్యలో, భూత–భవిష్యత్‌ జ్ఞానానికి ప్రయత్నించే యోగులు ఆరాధిస్తారు. శక్తిమంతులలో శక్తిమంతురాలిగా పురాణాలు వర్ణించాయి.

వారణాసి కథకు ఛిన్నమస్తా సంబంధం ఏమిటి?
నెటిజన్ల చర్చల ప్రకారం రణ కుంభ (పృథ్వీరాజ్ సుకుమారన్) సినిమాలో తంత్ర విద్యను అభ్యసించే పాత్ర. ఆ సాధనలో భాగంగా ఛిన్నమస్తా దేవిని ఆరాధిస్తాడు. ఆ శక్తితో మందాకినీ (ప్రియాంక చోప్రా)ను సంకటంలో పడేస్తాడు. అప్పుడు రుద్ర (మహేష్ బాబు) ఆమెను రక్షించేందుకు ప్రవేశిస్తాడనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఇందులో నిజం ఎంత? రాజమౌళి ఎలాంటి విజువల్స్ చూపిస్తాడు? అన్నది తెలుసుకోవాలంటే సినిమా థియేటర్లలో దర్శనమివ్వే వరకు వేచి చూడాల్సిందే.

Share This Article
Leave a Comment