దసరా పండగ రోజు ‘శూర్పనఖ దహనం’.. పురుష హక్కుల సంఘం నిర్ణయం

Telugu BOX Office

దసరా పండుగను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా రావణ దహనం నిర్వహించడం ఎంతోకాలంగా సంప్రదాయంగా వస్తోంది. దసరా పండగను “విజయదశమి” అని కూడా పిలుస్తారు, ఇది ప్రధానంగా చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం, రావణుడు సీతను అపహరించినప్పుడు శ్రీరాముడు రావణుడిపై సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండగని నిర్వహిస్తుంటారు. అందుకే దసరా పండగ రోజున రావణుడి బొమ్మలను దహనం చేస్తుంటారు. అయితే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఓ పురుష హక్కుల సంస్థ ఈసారి శూర్పణఖ దహన కార్యక్రమం నిర్వహించేందుకు నిర్ణయించుకుంది. భర్తలను పొట్టనపెట్టుకున్న భార్యల తీరుకు నిరసనగా ఈ కార్యక్రమం ఏర్పాటుకు నిశ్చయించినట్టు పౌరుష్ అనే సంస్థ ప్రకటించింది.

ఇటీవల హనీమూన్‌లో భర్తను హత్య చేసిన యువతి సోనమ్ రఘువంశీ, భర్తను చంపి డ్రమ్ములో పాతిపెట్టిన మీరట్ యువతి ముస్కాన్‌తో పాటు పలు మహిళా నిందితుల ఫొటోలను దిష్టిబొమ్మపై పెట్టి దహనం చేస్తామని సంస్థ అధ్యక్షుడు అశోక్ దశోరా పేర్కొన్నారు. ‘దిష్మి బొమ్మ మధ్యలో సోనమ్ సూర్యవంశీ ఫొటో పెడతాము. ఆమె ఇండోర్‌కు చెడ్డ పేరు తెచ్చింది. ఆమెతో పాటు భర్తను పొట్టన పెట్టుకున్న ముస్కాన్, నికితా సింఘానియా వంటి మొత్తం 10 మంది మహిళల ఫొటోలు బొమ్మపై ఏర్పాటు చేస్తాము. ఈ సిగ్గుమాలిన చర్యలకు సంకేతాత్మక నిరసనగా దిష్టి బొమ్మ దహనానికి ప్లాన్ చేశాము’ అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఓ పోస్టర్‌ను కూడా వారు విడుదల చేశారు.

Share This Article
Leave a Comment