
ఎఫ్ 1 వీసాలపై విధించిన ఆంక్షలతో పలు విద్యాసంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరి దీనికి ఓ ఉదాహరణ. ఈ విద్యాసంస్థ అంతర్జాతీయ విద్యార్థుల నుంచి వచ్చే ఆదాయంపైనే ఎక్కువగా ఆధారపడింది. కానీ, ఈ ఏడాది ప్రవేశాలు సగానికిపైగా తగ్గిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. బడ్జెట్ కుదించుకోవడంతోపాటు, సిబ్బంది వేతనాల్లోనూ కోత పెట్టింది. ఇలా దాదాపు 100కు పైగా అమెరికాలోని కాలేజీలు ఇబ్బందులు పడుతున్నాయి. విదేశీ విద్యార్థులు తగ్గుముఖం పట్టడం భవిష్యత్తులో పరిశోధనలు, ఆవిష్కరణలు సహా విద్యారంగంలో పోటీతత్వంపైనా తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఎన్‌ఏఎఫ్‌ఎస్ పేర్కొంది. విదేశీ విద్యార్థులు లేకపోతే.. ఆదాయానికి, ఖర్చులకు మధ్య ఊహించని విధంగా లోటు ఏర్పడుతుందని వివరించింది. అంతేకాదు, విదేశీ విద్యార్థులు చెల్లిస్తున్న ట్యూషన్ ఫీజుల నుంచే అమెరికా విద్యార్థులకు స్కాలర్ షిప్పులు ఇస్తున్నామని, భవిష్యత్తులో ఇది కూడా ప్రభావితం అవుతుందని జార్జ్ మాసన్ వర్సిటీ ప్రొఫెసర్ జస్టిన్ తెలిపారు. భారత విద్యార్థుల ప్రవేశాలపై అమెరికా, కెనడా విధించిన ఆంక్షల కారణంగా విదేశీ విద్యపై చేస్తున్న ఖర్చు ఐదేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకున్న భారత పౌరులు.. తమ వీసాలను స్వయంగా దౌత్య కార్యాలయానికి వచ్చి తీసుకోవాలని ఢిల్లీలోని అమెరికా ఎంబసీ తెలిపింది. వీసా తీసుకునేందుకు మూడో వ్యక్తిని కానీ, కుటుంబ సభ్యులను కానీ అనుమతించడం లేదని పేర్కొంది. భద్రతా పరమైన చర్యల్లో భాగంగా కొత్త నిబంధనను అమలు చేస్తున్నట్టు వివరించింది. ఒకవేళ ఎవరైనా స్వయంగా వచ్చి తీసుకునే అవకాశం లేకపోతే హోం డెలివరీ సదుపాయం ఉందని, దీనికి రూ.1200 అదనంగా చెల్లించాలని తెలిపింది.
