ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనంగా ప్రసిద్ధి చెందిన ప్రయాగ్ రాజ్ కుంభమేళా జన జాతరను తలపిస్తోంది. జనవరి 13న ప్రారంభమైన ఈ మహా కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీ మహాశివరాత్రి రోజున ముగియనుంది. 45 రోజుల జరిగే ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు.
జనవరి 13 నుంచి 29వ తేదీ వరకు మొత్తం 27.58 కోట్ల మంది భక్తులు కుంభమేళాలో స్నానాలు చేసినట్లు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 28 వరకు ఈ సంఖ్య 19.94 కోట్లుగా ఉండగా… మౌని అమావాస్య అయిన బుధవారం ఒక్కరోజే ఏకంగా ఏడున్నర కోట్ల మంది పుణ్యస్నానాలు చేయడం విశేషం. కుంభమేళా చరిత్రలోనే ఇదొక రికార్డుగా చెబుతున్నారు.
ఎంతో విశిష్టమైన మౌని అమావాస్య నాడు కుంభమేళాలో స్నానాలు చేసేందుకు 8 నుంచి 10 కోట్ల మంది వస్తారన్న అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేశారు. అనుకున్నట్లుగానే మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంటకే స్నానాలు చేసేందుకు లక్షల సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగి 30 మంది చనిపోగా.. 60 మంది గాయపడ్డారు. అయితే అధికార యంత్రాంగం వెంటనే స్పందించి సహాయచర్యలు చేపట్టడంతో స్నానాల ప్రక్రియ యథాతథంగా కొనసాగింది. కుంభమేళాకు వచ్చే భక్తుల వాహనాలతో ప్రయాగ్‌రాజ్‌కి వచ్చే అన్ని దారులు మూసుకుపోయాయి. కొన్ని వేల కార్లు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికీ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా వచ్చినవారంతా ప్రశాంతంగా పుణ్యస్నానాలు చేసి తిరిగి వెళ్లారు.
బుధవారం తొక్కిసలాట ఘటన నేపథ్యంలో కుంభమేళా నిర్వహణకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు. వైద్య సేవలు, స్వచ్ఛత, సురక్షిత రవాణా చర్యలు పాటించడంతో భక్తుల రద్దీని జాగ్రత్తగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో ప్రయాగ్‌రాజ్ నగరంలో అత్యాధునిక రవాణా వ్యవస్థ ఏర్పాటుతో భక్తులు సులభంగా అక్కడికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. భక్తుల సంఖ్యకు అనుగుణంగా అవసరమైన అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెప్పారు.
కుంభమేళాలో ఇప్పటివరకు 17 రోజులు పూర్తయ్యాయి. ఇంకా 28 రోజుల పాటు జరగనున్న నేపథ్యంలో భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుంభమేళాకు ఈసారి 40 కోట్ల మంది భక్తులు వస్తారని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది. అయితే 17 రోజులకే భక్తుల సంఖ్య 27 కోట్లు దాటిపోవడం విశేషం. కుంభమేళాకు వస్తోన్న స్పందన చూస్తుంటే భక్తుల సంఖ్య 50 కోట్లు దాటిపోయినా ఆశ్చర్యం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. బుధవారం తొక్కిసలాట మినహా ఇప్పటివరకు ఎలాంటి ఆటంకాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రశంసలు కురుస్తున్నాయి.