మాఘ మాసం శుక్ల పక్షంలో వచ్చే పంచమి తిథిని “వసంత పంచమి”గా వ్యవహరిస్తారు. రుతు సంబంధమైన పండగ కావడంతో దీనికి ఆ పేరు వచ్చింది. ఈ పండగనే బసంత్ పంచమి, సరస్వతీ పంచమి, మదన పంచమి, శ్రీపంచమి అనే పేర్లతో పిలుస్తారు. పంచమి రోజు సరస్వతీ దేవి పుట్టినరోజు కావడంతో ఈ పర్వదినానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రోజున చదువుల తల్లి సరస్వతీ అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు. వసంత పంచమిని శీతాకాలం ముగింపునకు, వేసవి ఆరంభానికి సూచికగా భావిస్తారు. వసంత పంచమి రోజు జ్ఞానానికి దేవత అయిన సరస్వతీ మాతను దేశవ్యాప్తంగా పూజిస్తారు. ఆ రోజు పసుపు బట్టలు ధరించి అమ్మవారికి పసుపు, కుంకుమ అర్పిస్తారు. అలాగే పసుపు రంగులో ఉన్న పండ్లు, పువ్వులు, చీర, నైవేద్యాలు సమర్పిస్తారు.
మాఘ మాసంలోని శుక్లపక్ష పంచమ తిథి ఈసారి ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం నాడు వచ్చింది. వసంత పంచమి రోజున జ్ఞాన దేవత అయిన సరస్వతి దేవి దర్శనమిస్తుందని చెబుతారు. ఒక చేతిలో పుస్తకం, రెండో చేతిలో వీణ, మూడో చేతిలో జపమాల, నాలుగో చేతిలో అభయహస్తంతో కనిపిస్తుంది. సరస్వతి దేవిని పూజించడం ద్వారా ఆమె ఆశీర్వాదాలు కుటుంబానికి ఉంటాయని చెప్పకుంటారు.
ఈ పనులు అస్సలు చేయొద్దు
వసంత పంచమి నాడు కొన్ని పనులు చేయకూడదని పెద్దలు చెబుతారు. వసంత పంచమి రోజు పొరపాటున కూడా చెట్లను, మొక్కలను నరకొద్దు. వసంత పంచమి నుంచే వసంతకాలం ప్రారంభమవుతుందని చెబుతారు. కాబట్టి ఈరోజు ప్రకృతికి అంకితం చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో చెట్లను, మొక్కలను నరికితే అది ప్రకృతిని అవమానించినట్లే.
ఇది సరస్వతి దేవికి కోపం తెప్పించే అంశం. అలాగే వసంత పంచమి రోజున పొరపాటున కూడా మాంసము, మద్యము సేవించకండి. ఇలా చేయడం వల్ల మేలు జరగదు. దానికి బదులుగా ఉపవాసం ఉండండి. లేదా స్వచ్ఛమైన సాత్వికమైన ఆహారం తినేందుకు ప్రయత్నించండి. ఆ రోజున మాటలు కూడా తగ్గించండి. ఎవరితోను గొడవలు పడడం, తిట్టడం పరుషమైన పదాలు వాడటం వంటివి చేయకండి.
వసంత పంచమి రోజు ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో పూజలు నిర్వహించుకుంటే ఎంతో మంచిది. సరస్వతి దేవికి నైవేద్యంగా పసుపు రంగులో ఉన్న ఆహారాలను నివేదించండి. అలాగే పూజలో పసుపు రంగు చీరనే కట్టుకొని కూర్చోండి. పసుపు రంగు దుస్తులు వేసి అమ్మవారిని పూజిస్తే మీ కోరిన కోరికలు నెరవేరుతాయి. మీకు ఎంతో మేలు జరుగుతుంది.
పంచమి రోజు చదవాల్సిన స్తోత్రాలు: శ్రీ పంచమి రోజు సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రం చదివినా, విన్నా సంవత్సరం మొత్తం అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు. అలాగే సరస్వతీ కవచం వింటే ప్రపంచాన్ని జయించే తెలివితేటలు లభిస్తాయని చెబుతారు.