H1B వీసాలు 75 వేలు చాలు… సెంటర్‌ ఫర్‌ ఇమ్మిగ్రేషన్‌ స్టడీస్‌

Telugu BOX Office

భారత్‌ నుంచి అమెరికాకు విద్యార్థులుగా, ఎక్స్ఛేంజి విజిటర్స్‌గా వచ్చి 2023లో వీసా గడువు తీరినా వెనక్కి తిరిగి వెళ్లని భారతీయులు 7,000 మంది ఉన్నారని సెంటర్‌ ఫర్‌ ఇమ్మిగ్రేషన్‌ స్టడీస్‌ (CIS) వెల్లడించింది. వీరితో పాటు దాదాపు 32 దేశాల విద్యార్థులు,   ఎక్స్ఛేంజి విజిటర్స్‌లో 20శాతానికి పైగా గడువు తీరినా అమెరికాను వదిలి వెళ్లడం లేదని పేర్కొంది. ఎఫ్, ఎం కేటగిరీల్లో ఈ సమస్య అధికంగా ఉందని వివరించింది. ఈ నేపథ్యంలో వలస చట్టాల్లో, హెచ్‌1బీ వీసా విధానాల్లో సంస్కరణలు అవసరమని అమెరికా చట్టసభ కమిటీ సభ్యులకు సూచించింది. హెచ్‌1బీ వీసాలు 75,000లోపే ఉండాలని సిఫార్సు చేసింది.

‘అమెరికాలో ఇమ్మిగ్రేషన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పునరుద్ధరణ’పై సీఐఎస్‌ ప్రతినిధి జెస్సికా ఎం వాన్‌.. సభా కమిటీకి వివరాలను వెల్లడించారు. అమెరికాలోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలో చదువుకోవడానికి, భాషా శిక్షణకు ఎఫ్‌-1 వీసాలిస్తారు. వృత్తి విద్యలో శిక్షణకు, విద్యేతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు, భాషేతర అంశాల్లో శిక్షణ పొందేందుకు ఎం-1 వీసాలను అందజేస్తారు. ‘భారత్, చైనా, బ్రెజిల్, కొలంబియాల నుంచి వచ్చిన వారిలో ఒక్కో దేశం నుంచి 2,000 మందికిపైగా 2023లో వీసా గడువు తీరినా అమెరికాలోనే ఉంటున్నారు. ఇందులో భారత్‌ నుంచి వచ్చిన వారే అత్యధికంగా 7,000 మంది ఉన్నారు. అందుకే వీసా జారీ విధానాల్లో సవరణలు అవసరం. విద్యార్థి వీసాలను జారీ చేసే విషయంలో ద్విలక్ష్య విధానాన్ని రద్దు చేయాలి (చదువుతోపాటు ఉద్యోగం చేయడం). చదువు అయిపోగానే విద్యార్థి స్వదేశానికి తిరిగివెళ్లేలా అంగీకరించే విధానం ఉండాలి’ అని జెస్సికా సూచించారు.

ప్రభుత్వ రంగంలోని ఉద్యోగాల్లో వీసా వర్కర్ల అనుమతిని సాధ్యమైనంత తక్కువకు కుదించాలని జెస్సికా సూచించారు. అమెరికాలో నైపుణ్య, నైపుణ్యంలేని కార్మికులకు కొరత లేదని, అలాంటి వారిని విదేశాల నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ‘ప్రస్తుతం కొన్ని కంపెనీలు అమెరికన్లను తీసేసి తక్కువ వేతనాలపై పని చేసే విదేశీయులను నియమించుకుంటున్నాయి. ఇందులో అక్రమ నియామక ప్రక్రియలను అనుసరిస్తున్నాయి. అభ్యర్థుల నుంచి నియామక ఫీజులను వసూలు చేస్తున్నాయి.’ అని జెస్సికా తెలిపారు. వీసా గడువు తీరినా ఉండే ఉద్యోగుల విషయంలో కంపెనీలే బాధ్యత తీసుకునేలా చేయాలని సూచించారు.

జెస్సికా ఇంకా ఏమన్నారంటే… వృత్తి నిపుణులకు ఇచ్చే హెచ్‌1బీ వీసాలను రెండేళ్లకే పరిమితం చేయాలి. అదనంగా రెండేళ్లు మాత్రమే పొడిగింపునకు అవకాశం ఇవ్వాలి. గ్రీన్‌ కార్డు పిటిషన్‌ వేసిన కారణంగా ఆటోమేటిక్‌గా పొడిగింపు ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలి. హెచ్‌1బీ వీసాలను 75వేలు అంతకంటే తక్కువకు కుదించాలి. అందులోనే లాభాపేక్ష రహిత, పరిశోధన రంగాలను జోడించాలి.

Share This Article
Leave a comment