4 రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్‌లోకి.. ‘కల్కి’ కలెక్షన్ల సునామీ

Telugu BOX Office

రెబల్ స్టార్ ప్రభాస్‌, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీసు దగ్గర ప్రకంపనలు సృష్టిస్తోంది. హిందూ పురాణాలను, సైన్స్‌ని ముడిపెడుతూ నాగ్ అశ్విన్ తీసిన విజువల్ వండర్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. జూన్ 27న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తొలిరోజే 191.5 కోట్లు కలెక్షన్లు రాబట్టి రికార్డులు సెట్ చేసిన కల్కి శని, ఆదివారాల్లో మరింత దూసుకుపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా 4 రోజుల్లోనే 500 కోట్ల క్లబ్ చేరిపోయి అరుదైన రికార్డు నెలకొల్పింది.

కల్కి చిత్రం వసూళ్లపై ప్రభాస్ అభిమానులు ట్విటర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. మిగతా హీరోలకి రూ.500 కోట్ల క్లబ్ అనేది కలని.. ప్రభాస్‌కి మాత్రం కాదంటూ కామెంట్లు చేస్తున్నారు. బాహుబలి -2, సలార్ తర్వాత నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్ చేసిన ప్రభాస్ మూవీగా ‘కల్కి’ రికార్డుల్లోకి ఎక్కింది. పెద్దగా ప్రమోషన్లు చేయకుండానే థియేటర్లలోకి వచ్చి మరీ బాక్సాఫీసు బెండు తీస్తున్నాడు ప్రభాస్. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు హిందీ, ఓవర్సీస్‌లో కల్కి జోరు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ముఖ్యంగా నార్త్ ప్రేక్షకులైతే ఈ సినిమా చూస్తూ మైమరచిపోతున్నారు. ఇండియాలో నంబర్ వన్‌ హీరో ప్రభాస్ మాత్రమేనని.. బాలీవుడ్ ఖాన్‌లకు అంత సీన్ లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, కల్కిని కడుపులో మోసే సుమతి పాత్రలో దీపికా పదుకొణే కనిపించడంతో బాలీవుడ్‌ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు.

ఇక ‘కల్కి’ సినిమాపై ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. చిరంజీవి, రజనీకాంత్‌, మోహన్‌ బాబు, అల్లు అర్జున్‌ తదితరులు ‘కల్కి’ ఓ అద్భుతమని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌ మధ్య ఉన్న యాక్షన్‌ సన్నివేశాలు, విజువల్‌ వండర్‌ దృశ్యాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు ఈ చిత్రంలో పురాణాలను భాగం చేయడంతో కర్ణుడికి సంబంధించి చరిత్ర విశేషాల వీడియోలు, రీల్స్‌ సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక ‘కల్కి’ చూసినవాళ్లు.. పార్ట్‌-2పై ఎప్పుడు వస్తుందా అని చర్చించుకుంటున్నారు.

Share This Article
Leave a comment