అపరిచితుడిలా ప్రవర్తించేవాడు.. 2 ఏళ్లు నరకం చూశాను: ఎట్టకేలక మౌనం వీడిన అనుపమ పరమేశ్వరన్

Telugu BOX Office

దక్షిణాది చిత్రపరిశ్రమలో తనకంటూ తనదైన నటన, గ్లామర్‌తో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో వరుస విజయవంతమైన చిత్రాలలో నటిస్తూ ఆకట్టుకుంటున్న ఈ భామ, ఇటీవల తన వ్యక్తిగత జీవితం గురించి చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ తీవ్ర కలకలం రేపుతున్నాయి. కొద్దిరోజులుగా ఆమె వ్యక్తిగత ప్రేమ జీవితంపై అనేక రకాల ఊహాగానాలు, రూమర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ.. గత రెండేళ్లుగా తాను ఎదుర్కొన్న మానసిక, శారీరక నరకం గురించి బహిరంగంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఆ పోస్ట్ వెనుక అసలు నిజం ఇదే!

కొద్దిరోజుల క్రితం అనుపమ తన సోషల్ మీడియా ఖాతాలో “మనశ్శాంతి కావాలంటే మీకు అనవసరమైన మార్గాలను, వ్యక్తులను వదిలేయాలి” అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తమిళ యంగ్ హీరోతో బ్రేకప్ కావడం వల్లే ఆమె ఈ పోస్ట్ చేశారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై ఫుల్ క్లారిటీ ఇస్తూ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన అనుపమ, తాను గత రెండేళ్లుగా ‘నార్సిసిస్టిక్ అబ్యూజ్’ (ఆత్మసంతోషం కోసం ఎదుటివారిని మానసికంగా వేధించే ప్రవర్తన) అనుభవించానని వెల్లడించారు. ఈ పరిస్థితి తీవ్రతను వివరిస్తూ.. నార్సిసిస్టిక్ అబ్యూజ్ గురించి నటి మడోనా సెబాస్టియన్ మాట్లాడిన ఒక రీల్ చూసినప్పుడు తన శరీరం భయంతో వణికిపోయిందని అనుపమ గుర్తు చేసుకున్నారు. సదరు వ్యక్తి పేరును వెల్లడించడానికి ఇష్టపడని అనుపమ, ఆ సమయంలో తాను అనుభవించిన వేదన వర్ణనాతీతమని చెప్పారు.

రోజుకొకరకంగా మనస్తత్వం

ఆ వ్యక్తి ప్రవర్తనను ‘అపరిచితుడు’ సినిమాలోని పాత్రలతో పోల్చుతూ అనుపమ సంచలన విషయాలు బయటపెట్టారు. “ప్రారంభంలో నాపై ఎనలేని ప్రేమను కురిపించేవారు. నా జీవితంలో ఇంతటి మంచి వ్యక్తి దొరకడం నిజమేనా, ఇది కలలా ఉందే అనిపించేంతలా నా నమ్మకాన్ని గెలుచుకున్నారు. కానీ మరుసటి రోజే ‘అపరిచితుడు’లోని అన్నియన్ పాత్రలా అత్యంత క్రూరంగా ప్రవర్తించేవారు. కనీసం వైపు చూడకుండా తీవ్రమైన నిర్లక్ష్యం చూపేవారు. ఆ మరుసటి రోజు మళ్లీ ‘అంబి’లా మారి, పసిపిల్లాడిలా ఏడుస్తూ క్షమాపణలు కోరుతూ, ఇకపై ఇలా చేయనని ప్రామీస్ చేసేవారు. మళ్లీ ప్రేమ కురిపించి, కొద్దిరోజులకే పాత ప్రవర్తనను పునరావృతం చేసేవారు” అని అనుపమ వివరించారు.

కెరీర్ వదులుకోమని ఒత్తిడి

పరిచయం ఏర్పడిన కేవలం మూడు నెలల్లోనే నిశ్చితార్థం, డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ హడావుడి చేశారని అనుపమ చెప్పారు. అయితే, పెళ్లి పేరుతో తన నటనా రంగాన్ని మాన్పించి, తనను పూర్తిగా తన కంట్రోల్‌లోకి తెచ్చుకోవడానికే ఆ వ్యక్తి ప్రయత్నిస్తున్నాడని గ్రహించినట్లు ఆమె తెలిపారు. అందుకే తాను పదే పదే ఎంగేజ్‌మెంట్‌ను వాయిదా వేస్తూ వచ్చానని చెప్పారు.

ఈ మానసిక ఒత్తిడి, వేధింపులు తట్టుకోలేక తాను డిప్రెషన్ తగ్గేందుకు మందులు కూడా వాడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కెరీర్‌లోనే పెద్ద హిట్‌గా నిలిచిన ‘డ్రాగన్’ సినిమా ప్రమోషన్స్ సమయంలో కూడా తాను తీవ్ర మానసిక క్షోభలో ఉండటం వల్ల సరిగ్గా పాల్గొనలేకపోయానని ఆమె స్పష్టం చేశారు. “ఒకవేళ నేను తొందరపడి ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుని ఉంటే, కచ్చితంగా విడాకులు తీసుకోవాల్సి వచ్చేది” అని అనుపమ వ్యాఖ్యానించారు.

బాధితులకు ధైర్యం చెప్పేందుకే బహిరంగ ప్రకటన

తాను ఈ విషయాలను బయటకు చెప్పడానికి ప్రధాన కారణం సమాజంలో ఇటువంటి నార్సిసిస్టిక్ అబ్యూజ్ ఎదుర్కొంటూ కూడా, అది ఏమిటో గుర్తించలేకపోతున్న వారిని హెచ్చరించడానికేనని అనుపమ పేర్కొన్నారు. అలాంటి పరిస్థితిలో ఉన్నవారు త్వరితగతిన దానిని గుర్తించి బయటపడాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం తాను ఆ విషపూరితమైన బంధం నుంచి, ఆ నరకం నుంచి పూర్తిగా బయటపడి ప్రశాంతంగా ఉన్నానని తెలిపారు. తన జీవితంలో పోగొట్టుకున్న ఆనందాన్ని, ప్రశాంతతను మళ్లీ తిరిగి పొందుతున్నానని స్పష్టం చేశారు. అనుపమ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ పరిశ్రమలోనూ, సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Share This Article
Leave a Comment