- నటీనటులు: మాట్ డామన్, అన్నీ హాథవే, టామ్ హాలెండ్, రాబర్ట్ ప్యాటిన్సన్, ఛార్లెజ్ థీరన్, సమంత మోర్టన్, హిమేష్ పటేల్ తదితరులు
- సంగీతం: లుడ్విగ్ గోరాన్సన్
- సినిమాటోగ్రఫీ: హోయ్టే వాన్ హోయ్టేమా
- ఎడిటింగ్: జెన్నీఫర్ లామీ
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: క్రిస్టఫర్ నోలన్
- బడ్జెట్: సుమారు రూ. 2,000 కోట్లు
- విడుదల తేదీ: 17-07-2026
హాలీవుడ్ సంచలన దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ నుండి ఒక సినిమా వస్తోందంటే ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాధారణంగా సైన్స్ ఫిక్షన్, టైమ్ ఇన్వర్షన్ వంటి క్లిష్టమైన కాన్సెప్ట్‌లతో మాయ చేసే నోలన్, ఈసారి రూటు మార్చి హోమర్ రాసిన అమరకావ్యం గ్రీకు మైథాలజీ ఆధారంగా ‘ది ఒడిస్సీ’ అనే విజువల్ ఎపిక్‌ను తెరకెక్కించారు. దాదాపు రూ. 2000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంపై మన దేశంలో ఒక రాజమౌళి సినిమాకో లేదా హాలీవుడ్ ‘అవతార్’ చిత్రానికో వచ్చే స్థాయి హైప్ లభించింది. తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా తెలుగు డబ్బింగ్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. మరి ఈ గ్రీకు చందమామ కథతో నోలన్ చేసిన మ్యాజిక్ ఏంటో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథాంశం (Storyline)
ట్రోజన్ యుద్ధంలో తన అద్భుతమైన తెలివితేటలతో, చెక్క గుర్రం వ్యూహంతో ట్రాయ్ రాజ్యాన్ని ఓడించి, పదేళ్ల సుదీర్ఘ పోరాటానికి ముగింపు పలుకుతాడు ఇథాకా దేశపు రాజు ఒడిస్సియస్ (మ్యాట్ డామన్). యుద్ధం ముగిసిన తర్వాత తన సైన్యంతో కలిసి స్వదేశానికి సముద్ర మార్గం ద్వారా తిరుగు ప్రయాణమవుతాడు. నిజానికి పది రోజుల్లో చేరుకోవాల్సిన ఆ ప్రయాణం, గ్రీకు దేవతల ఆగ్రహానికి గురికావడంతో పదేళ్లపాటు అనేక ఆపదలతో కూడిన సుదీర్ఘ పోరాటంగా మారుతుంది.
మరోవైపు ఇథాకా రాజ్యంలో భర్త ఎప్పటికైనా తిరిగి వస్తాడనే నమ్మకంతో రాణి పెనెలోప్ (ఆన్ హాత్వే), కొడుకు టెలిమాకస్ (టామ్ హాలాండ్) ఎదురుచూస్తుంటారు. అయితే రాజు లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని, రాజ్యాన్ని ఆక్రమించడంతో పాటు పెనెలోప్‌ను వివాహం చేసుకోవాలని అంతర్గత శత్రువైన ఆంటినస్ (రాబర్ట్ ప్యాటిన్సన్) తన శక్తియుక్తులతో ఒత్తిడి తెస్తుంటాడు. ఈ సముద్ర మార్గంలో ఒంటికన్ను రాక్షసుడు (సైక్లోప్స్), మంత్రగత్తె సిర్సీ, మరియు సముద్ర సుడిగుండాల వంటి మాయల నుండి ఒడిస్సియస్ తన సైన్యాన్ని ఎలా కాపాడుకున్నాడు? వయసు పైబడిన స్థితిలో ఒక ద్వీపంలో కలిప్సో (ఛార్లెజ్ థెరాన్)తో కలిసి ఉంటూ తన గతాన్ని ఎలా గుర్తు తెచ్చుకున్నాడు? చివరికి తన రాజ్యం చుట్టూ చేరిన రాబందుల్లాంటి శత్రువులను అంతం చేసి భార్యాపిల్లలను కలుసుకున్నాడా లేదా? అన్నదే ఈ సినిమా కథ.
సినిమా ఎలా ఉందంటే..
రాజులు, రాజ్యాలు, మాయలు, మంత్రాలు, రాక్షసుల కథలు మన భారతీయ ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. మన ఇతిహాసాల్లో ఇలాంటివి ఎన్నో చూశాం. అయితే ఇలాంటి పాత పురాణ గాథను చెప్పడానికి దర్శకుడికి రెండు దారులు ఉంటాయి; ఉన్నది ఉన్నట్లు చెప్పడం లేదా దానికి బలమైన నాటకీయతను జోడించడం. క్రిస్టోఫర్ నోలన్ రెండో మార్గాన్ని ఎంచుకుని, తన మార్క్ ‘నాన్-లీనియర్’ (గతం, ప్రస్తుతం మార్చి మార్చి చూపించే విధానం) స్క్రీన్‌ప్లేతో కథను అత్యంత ఉత్కంఠభరితంగా నడిపించారు.
సినిమా ప్రారంభంలో ఇథాకా రాజ్య పరిస్థితిని, ఒడిస్సియస్ గతాన్ని పరిచయం చేసే మొదటి 20 నిమిషాలు కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ, ఒడిస్సియస్ సముద్ర ప్రయాణం మొదలైన తర్వాత ప్రేక్షకుడు ఆ మాయా ప్రపంచంలోకి పూర్తిగా వెళ్ళిపోతాడు. ఇందులో వచ్చే ప్రతి ఎపిసోడ్ ఒక చందమామ కథలా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఒంటికన్ను రాక్షసుడితో యుద్ధం, ఐరన్ షీల్డ్స్ ధరించిన భారీ మనుషుల దాడి, సముద్రపు సుడిగుండాల నుండి తప్పించుకునే సీన్లు మైండ్ బ్లాయింగ్ అనిపిస్తాయి. మంత్రగత్తె సిర్సీకి సంబంధించిన సన్నివేశాలు ఒక హారర్ సినిమాను తలపిస్తూ, మన రామాయణంలోని మాయా లేడి ఘట్టాన్ని గుర్తుచేస్తాయి.
ప్రథమార్ధమంతా సాహసాలతో అద్భుతంగా సాగితే, ద్వితీయార్ధంలో డ్రామా మోతాదు కాస్త ఎక్కువైంది. శత్రుమూకలను అంతం చేయడానికి హీరో, ఆయన కొడుకు చేసే ప్రయత్నాల వల్ల కొన్ని చోట్ల కథ ముందుకు సాగనట్లు అనిపిస్తుంది. అయితే, క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ మన రామాయణంలోని శివధనస్సు విరిచే ఘట్టాన్ని తలపిస్తూ మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పిస్తుంది. గ్రీకు పురాణాలపై అవగాహన లేని వారికి కొన్ని చోట్ల అయోమయం కలిగినా, ఓవరాల్‌గా ఇదొక క్లాసిక్ నోలన్ మార్క్ సినిమా అనే అనుభూతిని ఇస్తుంది.
ఎవరెలా చేశారంటే..
నటీనటుల విషయానికి వస్తే, ఒడిస్సియస్ పాత్రలో మ్యాట్ డామన్ ఒదిగిపోయి జీవించారు. ఒక యోధుడిగా, భార్యాపిల్లల కోసం తపించే భర్తగా ఎక్కడా అతి లేకుండా తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రాణి పెనెలోప్‌గా ఆన్ హాత్వే శత్రువుల నుంచి రాజ్యాన్ని కాపాడుకునే ధీర వనితగా ఎమోషనల్ సీన్స్‌లో అద్భుత నటన కనబరిచారు. ఒడిస్సియస్ కొడుకు టెలిమాకస్‌గా టామ్ హాలాండ్ తండ్రి లేని లోటును భరిస్తూ, తల్లిని కాపాడుకునే యువకుడిగా ఎక్సలెంట్ ఎమోషన్స్ పండించాడు. నెగిటివ్ షేడ్స్ ఉన్న ఆంటినస్ పాత్రలో రాబర్ట్ ప్యాటిన్సన్ క్రూరత్వాన్ని విలక్షణంగా పండించగా, కలిప్సోగా ఛార్లెజ్ థీరన్, మంత్రగత్తెగా సమంత మోర్టన్ తమ పాత్రల పరిధి మేర అలరించారు. ఇక నటీనటులలో ఏకైక భారతీయుడైన హిమేష్ పటేల్, ఒడిస్సియస్ రెండో కమాండర్‌గా తరచుగా అయోమయానికి గురయ్యే పాత్రలో చక్కగా ఇమిడిపోయారు.
సాంకేతిక విభాగం & ప్రత్యేకతలు
ప్రస్తుతం ఏఐ (AI), వీఎఫ్ఎక్స్ (VFX) రాజ్యమేలుతున్న ఆధునిక సినీ ప్రపంచంలో, గ్రీన్ మ్యాట్ల సాయం లేకుండా 5 దేశాల్లో, 91 రోజుల పాటు వాస్తవికతకు దగ్గరగా ఈ సినిమాను షూట్ చేయడం చిత్ర బృందం యొక్క గొప్ప కృషికి నిదర్శనం. హోయ్టే వాన్ హోయ్టెమా ఐమాక్స్ (IMAX) కెమెరా విజువల్స్ కాంస్యయుగపు ప్రపంచాన్ని మన కళ్లముందుకు తెచ్చి నమ్మేలా చేశాయి; ప్రతి ఫ్రేమ్ ఎంతో గ్రాండ్‌గా ఉంది. లుడ్విగ్ గోరాన్సన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో బాక్సులు బద్దలయ్యేలా ఉంటూనే, కాంస్యయుగపు శబ్దాలను పునఃసృష్టిస్తూ సినిమా మూడ్‌లోకి మనల్ని తీసుకెళ్తుంది. నోలన్ మార్క్ నాన్-లీనియర్ శైలిని ప్రేక్షకులు సులభంగా అర్థం చేసుకునేలా ఎడిటర్ జెన్నిఫర్ లేమ్ తన కత్తెరకు పదును పెట్టారు. సినిమాలో వినిపించే “మనుషులు లేని మహా కట్టడాలు, నగరాలు మట్టితో సమానం”, “మనుషుల్లో దేవుడిని వెతకొద్దు.. నిరాశపడతావు” వంటి సంభాషణలు ప్రేక్షకులకి గుర్తుండిపోతాయి.
చివరిగా..
ది ఒడిస్సీ.. నోలన్ మార్క్‌తో సాగే గ్రీకు చందమామ కథ.. ఆయన కెరీర్లో మరో మాస్టర్ పీస్!
